మానసిక నిపుణుడు కావాలి
న్యూఢిల్లీ: పెద్ద టోర్నీల్లో ఆడేటప్పుడు భారత హాకీ జట్లు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయని, దీనికి పరిష్కారంగా వెంటనే ఓ మానసిక నిపుణుడిని నియమించాలని సీనియర్ జట్టు కెప్టెన్ సర్దార్ సింగ్ కోరాడు. ఇటీవల ముగిసిన జూనియర్ ప్రపంచకప్ హాకీలో భారత ఆటగాళ్ల ఆటతీరును గమనిస్తే ఈ విషయం తెలిసిపోతుందని అన్నాడు. ‘వీలైనంత త్వరగా జట్టుతో పాటు మానసిక నిపుణుడు ఉండాలని నేను భావిస్తున్నాను. ఇప్పటికే దీని గురించి హాకీ ఇండియా హై పెర్ఫార్మెమెన్స్ డెరైక్టర్ రోలంట్ ఓల్ట్‌మన్స్‌తో చర్చించాం. జూనియర్ ప్రపంచకప్‌లో భారత మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూసినప్పుడు ఆటగాళ్లు చాలా ఒత్తిడిలో ఉన్నట్టు కనిపించారు. సొంత అభిమానుల ముందు ఆడే సమయంలో ఎదురయ్యే ఒత్తిడిని వారు అధిగమించడంలో విఫలమయ్యారు. హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్‌కు ముందుగానే సైకాలజిస్ట్ సేవలు మాకు అందుతాయని ఆశిస్తున్నాను’ అని సర్దార్ అన్నాడు.
చాంపియన్స్ ట్రోఫీ వేదిక భువనేశ్వర్
వచ్చే ఏడాది డిసెంబర్ 13 నుంచి 21 వరకు జరిగే పురుషుల హాకీ చాంపియన్స్ ట్రోఫీ భువనేశ్వర్‌లో జరుగనుంది. ప్రస్తుతం పునర్‌నిర్మాణంలో ఉన్న కళింగ స్టేడియంలో అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్)కు చెందిన ఈ టోర్నీ జరుగుతుందని హాకీ ఇండియా ప్రధాన కార్యదర్శి నరీందర్ బాత్రా తెలిపారు. ఈ టోర్నీలో ఎనిమిది జట్లు పాల్గొంటాయి. ఢిల్లీలో ముగిసిన జూనియర్ ప్రపంచకప్ హాకీ టోర్నీకి అభిమానులు స్వల్ప సంఖ్యలో రావడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకమే కారణమని ఆయన ఆరోపించారు. చివరి నిమిషంలో అనుమతి ఇవ్వడంతో కేవలం వారం రోజుల ముందుగా టిక్కెట్లు అమ్మగలిగామని చెప్పారు.