ఫేస్‌బుక్‌లో చాటింగ్ చేస్తూ చీటింగ్
►నగర వ్యాపారికి రూ.4.5 లక్షల టోకరా
సాక్షి, సిటీబ్యూరో : ఫేస్‌బుక్ ద్వారా అందమైన యువతి ఫొటోతో నగరానికి చెందిన వ్యాపారికి ఎర వేసిన సైబర్ నేరగాళ్ళు చాటింగ్‌తో ముగ్గులోకి దింపారు. ఆపై భారీ మొత్తం పంపిస్తున్నానంటూ చెప్పి రూ.4.5 లక్షలకు టోకరా వేశారు. దీనిపై బుధవారం కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన జగన్నాథం అనే వ్యాపారికి ఫేస్‌బుక్‌లో ఓ యువతి పరిచయమైంది. ఆకర్షణీయమైన ఫొటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టి ఆకర్షించింది. కొంతకాలం చాటింగ్ చేస్తూ వ్యాపారి దగ్గర నమ్మకం సంపాదించుకుంది. నాకున్న ఏకైన మంచి స్నేహితుడవంటూ జగన్నాథాన్ని బుట్టలో వేసుకుంది. తన వద్ద భారీ మొత్తంలో నగదు, నగలు ఉన్నాయని, వాటిలో కొన్ని నీకు బహుమతిగా పంపిస్తున్నానంటూ చెప్పింది.
ఇది జరిగిన కొన్నాళ్ళకు ఢిల్లీ విమానాశ్రయం కస్టమ్స్ అధికారినంటూ ఓ వ్యక్తి నుంచి జగన్నాథానికి ఫోన్ వచ్చింది. విలువైన వస్తువులతో వచ్చిన ఆ పార్శిల్‌కు సంబంధించి కొన్ని పన్నులు చెల్లించాలంటూ చెప్పాడు. మరికొన్ని పత్రాలు సైతం కావాలని, అవి లేని కారణంగా దొడ్డిదారిలో క్లియర్ చేస్తానని నమ్మించాడు. ఇలా కొన్ని బ్యాంకు ఖాతాల్లో రూ.4.5 లక్షలు డిపాజిట్ చేయించుకున్నాడు. ఇంత మొత్తం చెల్లించినా మరికొంత చెల్లించాలంటూ ఫోన్లు వస్తుండటంతో మోసపోయినని తెలుసుకున్న వ్యాపారి సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించాడు.