సంగీత ముఖర్జీ(ఫైల్)
హస్తినాపురం: ఫేస్‌బుక్ ప్రేమ వికటించింది. తన కంటే చిన్నవాడైన యువకుడి కోసం కోల్‌కతా నుంచి వచ్చిన ఓ మహిళ లాడ్జి గదిలో అర్ధంతరంగా తనువు చాలించింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రియుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఈ ఘటన వనస్థలిపురం పరిధిలో బుధవారం వెలుగులోకి వచ్చింది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాకు చెందిన సంగీత ముఖర్జీ (43) వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఈమెకు గతంలోనే వివాహం కాగా... భర్త నుంచి విడాకులు తీసుకున్నారు. మూడేళ్ల క్రితం ఫేస్‌బుక్ ద్వారా సంగీతకు పంజాబ్ వాసి లోకేశ్ (25) పరిచయమయ్యాడు. అప్పటి నుంచి ఫేస్‌బుక్‌లో చాటింగ్ చేసుకుంటున్న వీరిద్దరి మధ్యా ప్రేమ చిగురించింది.
గత ఏడాది పంజాబ్ వెళ్ళిన సంగీత అక్కడ లోకేశ్‌ను కలిసి వచ్చింది. ఇద్దరూ కలిసి జీవించాలనే ఉద్దేశంతో మూడు నెలలు అక్కడే కలిసి ఉన్నారు. ఆపై కోల్‌కతాకు వెళ్ళిన వీళ్ళు కొన్నాళ్లు అక్కడా కలిసి ఉన్నారు. హైదరాబాద్‌లో ఉద్యోగం చూసుకుని స్థిరపడాలని, వివాహం చేసుకోవాలని భావించిన ఇద్దరూ సోమవారం సిటీకి వచ్చారు. వనస్థలిపురం పోలీసుస్టేషన్ పరిధిలోని అభ్యుదయనగర్ కాలనీలో ఉన్న ఓయో హోటల్‌లో గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. సంగీత గుర్తుతెలియని వ్యక్తులతో చాటింగ్ చేస్తోందనే ఉద్దేశంతో లోకేశ్ ఆమెతో ఘర్షణకు దిగాడు. మంగళవారం సాయంత్రం కూడా వీరి మధ్య గొడవలు జరిగాయి. దీంతో లోకేశ్ రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో ఉన్న తన స్నేహితుని వద్దకు వెళ్ళిపోయాడు. ఈ పరిణామంతో మనస్థాపం చెందిన సంగీత బుధవారం ఉదయం హోటల్ గదిలోనే బెడ్‌షీట్‌తో ఫ్యాన్‌కి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
ఆ గది దగ్గరకు వెళ్లిన సిబ్బంది డోర్ కొట్టినా ఎంతకీ డోర్ తీయకపోవడంతో హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వనస్థలిపురం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గది తలుపులు తెరిచి చూసేసరికి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. హోటల్ యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు ప్రేరేపించిన నేరంపై లోకేష్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా మొయినాబాద్‌లో ఉంటున్న లోకేష్ స్నేహితుడు కూడా కోల్‌కత్తాకు చెందిన వాడేనని, ఇతను నగరంలోని ఓ కళాశాలలో బీటెక్ చేస్తున్నాడని తెలిసింది. ఈ యువకుడితోనే సంగీత చాటింగ్ చేస్తుండగా వివాదం తలెత్తిందని తెలిసింది. ఈ నేపథ్యంలో లోకేష్, సంగీతలు తీవ్రంగా గొడవ పడుతున్నారని, వారిని ఓ కంట కనిపెట్టాలని కూడా ఆ యువకుడు హోటల్ సిబ్బందికి సూచించాడని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment