సాక్షి, మహబూబ్‌నగర్: ఫేస్‌బుక్ పరిచయం మరో బాలికను బలిగొంది. సామాజిక మాధ్యమం ద్వారా పరిచయం పెంచుకుని, ఆ తర్వాత ఆమెను దారుణంగా హతమార్చాడో యువకుడు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్రకలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే మహబూబ్‌నగర్ కేంద్రీయ విద్యాలయంలో పదో తరగతి చదువుతున్న శ్రీ హర్షిణి అనే బాలిక ఈ నెల 27న ఇంటి నుంచి అదృశ్యమైంది. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్రీ హర్షిణి ఫేస్‌బుక్ చాటింగ్‌పై ఆరా తీశారు. ఈ క్రమంలో హైదరాబాద్‌కు చెందిన నవీన్ రెడ్డితో ఎక్కువగా చాటింగ్ చేసినట్లు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల విచారణలో జడ్చర్ల మండలం శంకరాయపల్లి సమీపంలో శ్రీ హర్షిణి హతమార్చినట్లు నవీన్‌రెడ్డి అంగీకరించాడు.
బాలికకు మాయమాటలు చెప్పి కారులో నిర్మానుష‍్య ప్రాంతానికి తీసుకువెళ్లి...ఆమెపై అత్యాచారానికి యత్నించగా, శ్రీ హర్షిణి తీవ్రంగా ప్రతిఘటించింది. అయితే ఈ విషయాన్ని ఆమె ఎక్కడ బయటపెడుతుందనే భయంతో శ్రీ హర్షిణిని బండరాయితో కొట్టి హతమార్చినట్లు వెల్లడించాడు. పోలీసులు గురువారం ఉదయం బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టంకు తరలించారు. కాగా ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. నవీన్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ విషయం తెలిసిన నిందితుడు కుటుంబసభ్యులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment