Harshini
-
Bengaluru: రైడ్ ఫర్ ఎ కాజ్! రైడింగ్‌తోనే సేవ.. ఆ ఊరిలో వెలుగులు నింపింది!
కొంతమంది దేశం కోసం తమ ప్రాణాలు అర్పించేందుకు రాత్రనక పగలనకా ప్రాణాలొడ్డి పోరాడుతున్నారు. వారు అక్కడ నిద్రాహారాలు మాని, కుటుంబ సంతోషాలను త్యాగం చేయబట్టి మనం ఇంత సురక్షితంగా జీవించగలుగుతున్నాము... అని ఎందరికి తెలుసు? ఒకవేళ తెలిసినా ఒక నిట్టూర్పు విడవడం తప్ప ఏమైనా చేయగలుగుతున్నామా? అయితే బెంగళూరుకు చెందిన హర్షిణి అలా కాదు... వారికోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకుని ఏకంగా ఓ ఎన్జీవోను ఏర్పాటు చేసింది. మహిళా బైక్ రైడర్స్‌తో కలిసి ఈవెంట్స్ నిర్వహిస్తూ సమకూరిన నిధులతో జవాన్ల కుటుంబాల అవసరాలు తీరుస్తోంది. హర్షిణి వెంకటేష్‌కు చిన్నప్పటినుంచి ఇతరులకు సాయం చేయలన్న ఆలోచనలు ఎక్కువ. కాలేజీ రోజుల్లో పాకెట్ మనీతో బట్టలు, కార్డ్స్ మీద ప్రింట్స్ డిజైన్ చేయడం, పుట్టగొడుగుల పెంపకం వంటివి చేపట్టి వాటిద్వారా వచ్చిన ఆదాయంతో ఇతరులకు సాయం చేసేది. 1998లో హర్షిణికి పెళ్లి అవ్వడం, వెంటవెంటనే ఇద్దరు కొడుకులు పుట్టడంతో తన సమయం అంతా ఇంటిని చక్కదిద్దుకోవడం, పిల్లల పెంపకంతో సరిపోయింది. కొంతకాలానికి భర్త ప్రోత్సాహంతో ముంబై వెళ్లి బేకింగ్, చాక్లెట్ తయారీ కోర్సులు చేసింది. కోర్సు పూర్తయ్యాక సొంతంగా చాక్లెట్, కేక్‌లు తయారు చేయడం మొదలు పెట్టింది. ప్రారంభంలో పదికేజీల ఆర్డర్లు ఉండేవి. ఏడాది తరువాత వంద కేజీల ఆర్డర్లు ఇచ్చే స్థాయికి హర్షిణి వ్యాపారం విస్తరించింది. అయితే బేకింగ్ కు కావాల్సిన పదార్థాల నుంచి మార్కెటింగ్, సప్లై వరకు అన్నీ తనే చూసుకోవడం కష్టంగా అనిపించేది. ఇదే సమయంలో ముంబైలో జరిగిన మాస్టర్ షెఫ్ కార్యక్రమానికి బెంగళూరు నుంచి రెండు వేల మందిలో హర్షిణి సెలెక్ట్ అయ్యింది. కానీ కొన్ని కారణాల వల్ల దానిని మధ్యలోనే వదిలేసింది. ఇదే సమయంలో అంధ విద్యార్థులు చదివే ఓ స్కూలు గురించి తెలిసింది. దీంతో అక్కడికి వెళ్లి విద్యార్థులతో కొంత సమయం గడపడం, వారికి కావాల్సిన సాయాన్ని అందిస్తూ సామాజిక సేవను ప్రారంభించింది. రైడింగ్‌తోనే సేవ పెళ్లి అయిన తరువాత బండి నడపాలన్న ఆసక్తితో హర్షిణి టూవీలర్ నడపడం నేర్చుకుంది. 2017లో ఓ మహిళా రైడర్స్ ఈవెంట్ జరుగుతుందని తెలిసి, రైడింగ్‌ను బాగా సాధన చేసి చీరకట్టులో బైక్ ర్యాలీలో పాల్గొంది. అప్పుడు హర్షిణి రైడ్ చేస్తోన్న ఫోటోతో సహా ఓ వార్తా పత్రిక మొదటి పేజీలో కథనాన్ని ప్రచురించింది. దానికి లభించిన ప్రోత్సాహంతో రైడింగ్‌తోనే సామాజిక సేవాకార్యక్రమాలు చేయాలనుకుంది. ఇండియన్ ఆర్మీ దేశానికి, సమాజానికి ఎంతో సాయం చేస్తోంది. కానీ మనం ఆర్మీకి తిరిగిచ్చింది చాలా తక్కువే. అందుకే వాళ్ల కుటుంబ సభ్యులకు ఏదైనా చేయాలని నిర్ణయించుకుంది. అమర జవాన్ల్ల కుటుంబాల్లో కొంతమంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ, చికిత్సకు డబ్బులు సరిపోక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిసి, వారికోసం విరాళాలు సేకరించేందుకు ‘షీ ఫర్ సొసైటీ, రైడ్ ఫర్ ఏ కాజ్’ పేరిట ఎన్జీవోను ప్రారంభించింది. ఫేస్బుక్ ద్వారా మహిళా బైకర్స్ అందర్ని ఒకచోటకు చేర్చి బైక్ రైడింగ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేసింది. ఆ ఈవెంట్ ద్వారా వచ్చిన డబ్బును అవసరంలో ఉన్న ఆర్మీ కుటుంబాలకు ఇచ్చింది. ఈవెంట్ విజయవంతమవడంతో తర్వాత కూడా బైక్ రైడ్ ఈవెంట్స్ నిర్వహిస్తూ వచ్చిన విరాళాలతో అవసరం అయిన వారికి సాయం చేయడం కొనసాగించింది. ఊరిలో వెలుగులు నింపింది బెంగళూరుకు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న కొలార్ అనే గ్రామానికి ఎలక్ట్రిసిటీ సదుపాయం సరిగా లేదు. ఐదువేలమంది జనాభా ఉన్న ఈ గ్రామంలో ఆర్మీలో పనిచేసిన నాలుగు తరాలకు చెందిన కుటుంబాలు ఉన్నాయి. అయినా వీళ్లకి సరైన విద్యుత్ సౌకర్యం అందుబాటులో లేదు. వీరికి విద్యుత్‌ను అందించేందుకు మూడువందల మంది మహిళా రైడర్స్‌తో కలిసి బెంగళూరు నుంచి కోలార్‌కు ర్యాలీ నిర్వహించింది. అందుకు స్పందనగా మాజీ సైనికులు వందమంది కలిసి సోలార్ కిట్లను బహుమతిగా ఇచ్చారు. దీంతో ఇప్పుడు ఆ గ్రామంలో ఎలక్ట్రిసిటి నిరంతరాయంగా అందుతోంది. పిల్లలు నేర్చుకోవడానికి ఉచితంగా శిక్షణ ఇచ్చే రెండు కంప్యూటర్ సెంటర్స్‌ను ఏర్పాటుచేసింది. భవిష్యత్‌లో మరిన్ని నిధులు సేకరించి బెంగళూరులోనేగాక, మైసూర్, థార్వాడ్‌లలో కూడా తన సేవలను విస్తరించనున్నట్లు హర్షిణి చెబుతోంది. చదవండి: Shweta Gaonkar: కొబ్బరి కల్లు గీసే శ్వేత.. ఏడాదికి మూడున్నర లక్షల ఆదాయం! బీటెక్ వద్దనుకుని.. -
హర్షిణి
నువ్వేంటి అనేది నీ పుట్టుక చెప్పదు.. నువ్వేంటో నీ వ్యక్తిత్వం చెప్తుంది.. నువ్వేంటో నీ జీవన శైలి చూపిస్తుంది.. ఆత్మగౌరవాన్ని మించిన అస్తిత్వం లేదు అని అమ్మ చెప్పిన మాటలను మంత్రంలా ఆచరించి తనను తాను గౌరవించుకున్న ఒక హర్షిణి కథ ఇది.. ‘‘నిజం చెబితే ఎందుకు ఉద్యోగం ఇవ్వరో చూడాలి.. నిజం చెప్పే ఉద్యోగాన్ని సాధించాలి’’ అని నిర్ణయించుకుంది ఆమె. ఆ పట్టుదలతోనే ‘జేఎల్ఎల్’ లో ఇంటర్వ్యూకి హాజరైంది. ఎప్పటిలాగే తొలి రెండు రౌండ్లు విజయవంతంగా పూర్తిచేసుకుంది. ఆఖరి రౌండూ పూర్తయి, ఉద్యోగం ఖాయమని తేలగానే చెప్పింది ఆమె ఇంటర్వ్యూ ప్యానెల్‌కు.. ‘సర్ .. నేను ట్రాన్స్ ఉమన్‌ని’ అని. ఆ జవాబుకి ప్యానెల్ ఉలిక్కిపడలేదు. ‘మీరు ఎవరైనా మాకు అభ్యంతరం లేదు. అయితే ఈ విషయాన్ని స్టాఫ్‌తో చెప్పకండి. వాళ్లు సరిగా రిసీవ్ చేసుకోలేకపోతే మీరే ఇబ్బంది పడ్తారు’’ అని సలహా మాత్రం ఇచ్చారు. ఆమె ఆత్మవిశ్వాసం ఉప్పొంగింది. ఆమె పేరు హర్షిణి మేకల. అమ్మ చెప్పినట్టుగా.. ఆమెకు మాటిచ్చినట్టుగా చదువుకొని.. మంచి ఉద్యోగం సంపాదించి .. ఆత్మగౌరవంతో బతుకుతోంది! ఆంధ్రప్రదేశ్‌కు చెందిన హర్షిణి సొంతూరు కృష్ణాజిల్లా.. జగ్గయ్యపేట మండలంలోని బలుసుపాడు అనే చిన్న గ్రామం. తల్లి, తండ్రి ఇద్దరూ వ్యవసాయ కూలీలే (ఇప్పుడు లేరు, చనిపోయారు). హర్షిణికి ఇద్దరు అక్కలు, ఒక తమ్ముడు. ఇదీ హర్షిణికి సంబంధించిన ప్రాథమిక సమాచారం. తన జీవితంలోని మిగిలిన విషయాల గురించి ఆమె మాటల్లోనే... ‘‘అబ్బాయిగానే పుట్టినా ఆలోచనలన్నీ అమ్మాయిలాగే ఉండేవి. స్కూల్ నుంచి రాగానే అక్క వాళ్ల బట్టలు వేసుకునేదాన్ని. కళ్లాపి చల్లి ముగ్గుపెట్టడం వంటివి చేసేదాన్ని. అమ్మ వారించేది. కౌన్సెలింగ్ ఇచ్చేది. వినకపోగా వయసు పెరుగుతున్నకొద్దీ మరీ నేను అమ్మాయిలాగే ప్రవర్తిస్తుంటే అమ్మ.. వీడి శరీరం అబ్బాయిదే కాని మైండ్ అమ్మాయిదే అని ఒక అభిప్రాయానికి వచ్చేసింది. కుటుంబంలో మిగిలిన వాళ్లు నా పట్ల ఎలా ఉన్నా అమ్మ మాత్రం నన్ను అర్థంచేసుకోవడానికే ప్రయత్నించింది. నిజం చెప్పాలంటే నాకొక స్నేహితురాలిగా ఉంది. అమ్మాయిలాంటి నా నడత చూసి బయట, స్కూల్లోని అబ్బాయిలు గేలిచేసేవారు, భయంకరంగా ఏడిపించేవారు. భరించలేక ఇంటికొచ్చి అమ్మను పట్టుకొని ఏడ్చేసేదాన్ని. ‘ఇంత చిన్నవాటికే భయపడి ఏడిస్తే ఎలా? రేప్పొద్దున జీవితంలో చాలా ఎదుర్కోవాలి. బాగా చదవాలి.. మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి. గొప్పగా బతకాలి’’ అంటూ ధైర్యం చెప్పేది. ఎంత ధైర్యం కూడదీసుకున్నా హేళనలు, అవమానాలు తప్పలేదు. వాటిమధ్యే పెరిగాను. ముంబైకి నేను డిగ్రీ సెకండియర్‌లో ఉన్నప్పుడు ఓ ఎన్జీవోలో పనిచేసే ఒక ట్రాన్స్ ఉమన్ పరిచయమై ‘‘ముంబైకి వెళితే నువ్వు మొత్తం అమ్మాయిలా మారిపోవచ్చు’’అని సలహా ఇచ్చారు. అది మనసులో పెట్టుకొని డిగ్రీ పూర్తయ్యాక ఇంట్లో వాళ్లకు చెప్పకుండా ముంబై వెళ్లిపోయా. కానీ ఆ వాతావరణంలో ఇమడలేక మూడు రోజులకే తిరిగొచ్చేశా. ఈలోపు మా అమ్మ నా మీద బెంగపెట్టుకొని ఆసుపత్రిపాలైంది. గుండె జబ్బు అని తేలింది. ‘‘ఇంకోసారి ఇలాంటివి చేయొద్దు.. నువ్వు గౌరవంగా బతకాలి’’ అంటూ ఏడ్చేసింది అమ్మ. బాగా చదువుకొని, చక్కగా స్థిరపడాలని ఒట్టుపెట్టించుకుంది నాతో. అప్పుడు పీజీ ఎంట్రెన్స్ రాశా. ఆచార్య యూనివర్సిటీ, ఎమ్.ఏ. ఎకనామిక్స్‌లో సీట్ వచ్చింది. పూర్తయ్యాక నేను డిగ్రీ చేసిన కాలేజ్‌లోనే లెక్చరర్‌గా చేరా. యేడాదిన్నరకు అమ్మ చనిపోయింది. అంతా చీకటయిపోయినట్టే అనిపించింది. నా దుఃఖం, సంతోషం, కష్టం, సుఖం అన్నీ ఎరిగిన మనిషి.. నాకున్న ఏకైక స్నేహితురాలు అమ్మ.. ఆమె లేని ప్రపంచాన్ని ఊహించుకోలేకపోయా. కుంగిపోయి.. ఆత్మహత్యా ప్రయత్నమూ చేశా. అక్కా, తమ్ముడు రక్షించారు. అప్పటికే మా అక్కలిద్దరికీ పెళ్లిళ్లయి పిల్లలు కూడా. పెద్దక్క భర్త చనిపోవడంతో మా ఇంటికే తెచ్చేసుకున్నాం. తమ్ముడు చదువుకుంటున్నాడు. అమ్మ పోయిన బాధలో నాన్న తాగుడికి బానిసయ్యాడు. బాధ్యతగా మసలుకోవాలన్న స్పృహ వచ్చింది. ఊళ్లోనే ఉంటే అమ్మ జ్ఞాపకాలతో దిగులు పెరగడం తప్ప ఏమీ చేయలేనని గ్రహించి మళ్లీ ముంబై వెళ్లిపోయా. అక్కడ ‘త్రివేణి సమాజ్ వికాస్ కేంద్ర’ అనే స్వచ్ఛంద సంస్థలో ప్రాజెక్ట్ మేనేజర్‌గా కొన్నాళ్లు, క్రిస్టియన్ ఎన్జీవో ‘సేవానికేతన్’లో కొన్నాళ్లు పనిచేశా. ఆ టైమ్‌లోనే ఢిల్లీ వెళ్లి స్త్రీగా మారిపోయే సర్జరీ చేయించుకొని ‘పూర్తిగా అమ్మాయే’అనే సర్టిఫికెట్ తీసుకున్నా. దీంతో నా ‘ఐడెంటిటీ’ మార్చుకోవాలని కోర్టు అఫిడవిట్ కూడా తెచ్చుకొని ‘హర్షిణి’ నయ్యాను. ఎమ్‌ఎన్‌సీలలో ఉద్యోగం సంపాదించాలనుకున్నా. జేఎల్‌లో సాధించా. స్టాఫ్ దగ్గర నేనెవరో చెప్పొద్దన్న నా పై అధికారులే నేను చేరిన ఆరునెలలకు నా గురించి స్టాఫ్‌కి చెప్పారు గర్వంగా. అందరూ షాక్. నిజమే అంటూ నా స్ట్రగుల్‌ని నేను చెబితేగాని నమ్మలేదు ఎవరూ. బ్యూటిఫుల్ స్మైల్ ఉద్యోగం చేస్తూనే ట్రాన్స్ విమెన్ కోసం ప్రారంభించిన అందాల పోటీల్లో పాల్గొన్నా. ‘టాప్ సిక్స్’లో నిలిచి, ‘బ్యూటిఫుల్ స్మైల్’ టైటిల్‌నూ గెలుచుకున్నా. అలా జాతీయ అందాల పోటీలో పాల్గొన్న మొదటి తెలుగు ట్రాన్స్ ఉమన్‌ని నేనే. మోడలింగ్ కూడా చేశా. రెండు హిందీ లఘుచిత్రాల్లో నటించా. ముంబైలోని మరాఠీ, హిందీ, ఇంగ్లిష్ పత్రికలు నా గురించి రాశాయి. ఇదంతా మా ఊరికి ఇంకోరకంగా చేరి మా అక్కతో కొందరు ‘మీ చెల్లెలు ముంబైలో బెగ్గింగ్ చేసుకుంటోందట కదా’ అన్నారట. దాంతో మా అక్క ఏడుస్తూ ఫోన్ చేసింది ‘ముంబై వద్దు.. ఏమొద్దు ఇక్కడికి వచ్చెయ్’ అని. హైదరాబాద్‌లో ఉన్న మా ఆఫీస్ బ్రాంచ్‌కి బదిలీ చేయించుకుని వచ్చేశా. నటి కావాలనే కోరిక చిన్నప్పటి నుంచీ ఉంది. ఇక్కడికి వచ్చాక సినిమాల్లో చాన్స్‌కోసం ప్రయత్నించడం మొదలుపెట్టా. నా గురించి తెలిసి రచయిత, దర్శకుడు అమాన్ అహ్మద్ ‘బద్లావ్’ అనే హిందీ నాటకంలో నాకు వేషం ఇచ్చారు. దానికి మంచి పేరు వచ్చింది. సినిమా చాన్సే ఇంకా రాలేదు. తమిళంలో, మలయాళంలో ట్రాన్స్ ఉమన్‌కు హీరోయిన్ అవకాశాలు ఇస్తున్నారు. మమ్ముట్టి లాంటి పెద్ద పెద్ద హీరోల పక్కనా చేస్తున్నారు. కానీ మన తెలుగులో కనీసం క్యారెక్టర్ రోల్స్ కూడా ఇవ్వడం లేదు. సీరియళ్లలో ‘ట్రాన్స్ ఉమన్’ పాత్రనూ ఆడవాళ్లే చేస్తున్నారు. కానీ మాకు ఇవ్వడం లేదు’’ అంటుంది హర్షిణి మేకల. ►ఏ ఊళ్లో అయితే ఒకప్పుడు అవమానాలు, అవహేళనలు ఎదుర్కొన్నానో ఆ ఊరి వాళ్లే ఇప్పుడు అభిమానిస్తున్నారు. నా లైఫ్ స్టైల్ చూసి సంతోషపడుతున్నారు. ఈ ఆనందాన్ని పంచుకోవడానికి అమ్మ లేదనే దిగులు వెంటాడుతూనే ఉంది. అమ్మా.. నువ్వు కోరుకుంటున్నట్టే గౌరవంగా బతుకుతున్నాను అని చెప్పాలనుంటుంది. – హర్షిణి -
కలకలం రేపుతున్న శ్రీ హర్షిణి హత్య
సాక్షి, మహబూబ్‌నగర్: ఫేస్బుక్ పరిచయం మరో బాలికను బలిగొంది. సామాజిక మాధ్యమం ద్వారా పరిచయం పెంచుకుని, ఆ తర్వాత ఆమెను దారుణంగా హతమార్చాడో యువకుడు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్రకలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే మహబూబ్‌నగర్ కేంద్రీయ విద్యాలయంలో పదో తరగతి చదువుతున్న శ్రీ హర్షిణి అనే బాలిక ఈ నెల 27న ఇంటి నుంచి అదృశ్యమైంది. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్రీ హర్షిణి ఫేస్బుక్ చాటింగ్‌పై ఆరా తీశారు. ఈ క్రమంలో హైదరాబాద్‌కు చెందిన నవీన్ రెడ్డితో ఎక్కువగా చాటింగ్ చేసినట్లు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల విచారణలో జడ్చర్ల మండలం శంకరాయపల్లి సమీపంలో శ్రీ హర్షిణి హతమార్చినట్లు నవీన్‌రెడ్డి అంగీకరించాడు. బాలికకు మాయమాటలు చెప్పి కారులో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి...ఆమెపై అత్యాచారానికి యత్నించగా, శ్రీ హర్షిణి తీవ్రంగా ప్రతిఘటించింది. అయితే ఈ విషయాన్ని ఆమె ఎక్కడ బయటపెడుతుందనే భయంతో శ్రీ హర్షిణిని బండరాయితో కొట్టి హతమార్చినట్లు వెల్లడించాడు. పోలీసులు గురువారం ఉదయం బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టంకు తరలించారు. కాగా ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. నవీన్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ విషయం తెలిసిన నిందితుడు కుటుంబసభ్యులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. -
హర్షిణికి కాంస్య పతకం
సాక్షి, హైదరాబాద్: వరంగల్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో బీహెచ్ఈఎల్ భారతీయ విద్యాభవన్స్ స్కూల్ విద్యార్థిని డి.హర్షిణి తృతీయ స్థానంలో నిలిచి కాంస్య పతకం కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రామహనుమాన్, వైస్ ప్రిన్సిపాల్ నళిని రెడ్డి, శిక్షణ ఉపాధ్యాయుడు శేషుకుమార్ హర్షిణిని అభినందించారు. -
హర్షిణికి రెండు పతకాలు
సాక్షి, హైదరాబాద్: అంతర్ జిల్లా సీనియర్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో డి. హర్షిణి రెండు పతకాలను సొంతం చేసుకుంది. సికింద్రాబాద్‌లోని జీహెచ్ఎంసీ స్విమ్మింగ్‌పూల్‌లో జరిగిన ఈ పోటీల్లో భారతీయ విద్యా భవన్ పబ్లిక్ స్కూల్ (బీహెచ్ఈఎల్)కు చెందిన హర్షిణి 800 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో రజతం... 400 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో కాంస్య పతకం సాధించింది. ఈ సందర్భంగా తమ స్కూల్ విద్యార్థిని హర్షిణిని ప్రిన్సిపల్ రామ హనుమాన్ అభినందించారు. -
మహిళా తారలతోనే...
హర్షిణి, రోజా, భారతి, మేఘనా రమి, జయ, ప్రవల్లిక ముఖ్య తారలుగా కేఆర్ ఫణిరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘బటర్ ఫ్లైస్’. తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా తొలి సన్నివేశానికి జీవితా రాజశేఖర్ కెమెరా స్విచ్ఛాన్ చేయగా, ఏపీ ఎఫ్డీసీ ఛైర్మన్ అంబికా కృష్ణ క్లాప్ ఇచ్చారు. నల్లమల్లు రాధ గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘మహిళా ఆర్టిస్టులతోనే సినిమా తీయడం మంచి ప్రయత్నం’’ అన్నారు అంబికా కృష్ణ. ‘‘మహిళా తారలతోనే చేస్తున్న తొలి చిత్రమిది’’ అన్నారు ఫణిరాజ్. ‘‘మహిళలకు ఎదురయ్యే కష్ణనష్టాలను చూపించబోతున్నాం’’ అన్నారు రామసత్యనారాయణ. ఈ చిత్రానికి సంగీతం: ప్రత్యోదన్ స్వరకర్త.