కొంతమంది దేశం కోసం తమ ప్రాణాలు అర్పించేందుకు రాత్రనక పగలనకా ప్రాణాలొడ్డి పోరాడుతున్నారు. వారు అక్కడ నిద్రాహారాలు మాని, కుటుంబ సంతోషాలను త్యాగం చేయబట్టి మనం ఇంత సురక్షితంగా జీవించగలుగుతున్నాము... అని ఎందరికి తెలుసు? ఒకవేళ తెలిసినా ఒక నిట్టూర్పు విడవడం తప్ప ఏమైనా చేయగలుగుతున్నామా?
అయితే బెంగళూరుకు చెందిన హర్షిణి అలా కాదు... వారికోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకుని ఏకంగా ఓ ఎన్జీవోను ఏర్పాటు చేసింది. మహిళా బైక్ రైడర్స్‌తో కలిసి ఈవెంట్స్ నిర్వహిస్తూ సమకూరిన నిధులతో జవాన్ల కుటుంబాల అవసరాలు తీరుస్తోంది.
హర్షిణి వెంకటేష్‌కు చిన్నప్పటినుంచి ఇతరులకు సాయం చేయలన్న ఆలోచనలు ఎక్కువ. కాలేజీ రోజుల్లో పాకెట్ మనీతో బట్టలు, కార్డ్స్ మీద ప్రింట్స్ డిజైన్ చేయడం, పుట్టగొడుగుల పెంపకం వంటివి చేపట్టి వాటిద్వారా వచ్చిన ఆదాయంతో ఇతరులకు సాయం చేసేది. 1998లో హర్షిణికి పెళ్లి అవ్వడం, వెంటవెంటనే ఇద్దరు కొడుకులు పుట్టడంతో తన సమయం అంతా ఇంటిని చక్కదిద్దుకోవడం, పిల్లల పెంపకంతో సరిపోయింది.
కొంతకాలానికి భర్త ప్రోత్సాహంతో ముంబై వెళ్లి బేకింగ్, చాక్లెట్ తయారీ కోర్సులు చేసింది. కోర్సు పూర్తయ్యాక సొంతంగా చాక్లెట్, కేక్‌లు తయారు చేయడం మొదలు పెట్టింది. ప్రారంభంలో పదికేజీల ఆర్డర్లు ఉండేవి. ఏడాది తరువాత వంద కేజీల ఆర్డర్లు ఇచ్చే స్థాయికి హర్షిణి వ్యాపారం విస్తరించింది. అయితే బేకింగ్ కు కావాల్సిన పదార్థాల నుంచి మార్కెటింగ్, సప్లై వరకు అన్నీ తనే చూసుకోవడం కష్టంగా అనిపించేది.
ఇదే సమయంలో ముంబైలో జరిగిన మాస్టర్ షెఫ్ కార్యక్రమానికి బెంగళూరు నుంచి రెండు వేల మందిలో హర్షిణి సెలెక్ట్ అయ్యింది. కానీ కొన్ని కారణాల వల్ల దానిని మధ్యలోనే వదిలేసింది. ఇదే సమయంలో అంధ విద్యార్థులు చదివే ఓ స్కూలు గురించి తెలిసింది. దీంతో అక్కడికి వెళ్లి విద్యార్థులతో కొంత సమయం గడపడం, వారికి కావాల్సిన సాయాన్ని అందిస్తూ సామాజిక సేవను ప్రారంభించింది.
రైడింగ్‌తోనే సేవ
పెళ్లి అయిన తరువాత బండి నడపాలన్న ఆసక్తితో హర్షిణి టూవీలర్ నడపడం నేర్చుకుంది. 2017లో ఓ మహిళా రైడర్స్ ఈవెంట్ జరుగుతుందని తెలిసి, రైడింగ్‌ను బాగా సాధన చేసి చీరకట్టులో బైక్ ర్యాలీలో పాల్గొంది. అప్పుడు హర్షిణి రైడ్ చేస్తోన్న ఫోటోతో సహా ఓ వార్తా పత్రిక మొదటి పేజీలో కథనాన్ని ప్రచురించింది. దానికి లభించిన ప్రోత్సాహంతో రైడింగ్‌తోనే సామాజిక సేవాకార్యక్రమాలు చేయాలనుకుంది.
ఇండియన్ ఆర్మీ దేశానికి, సమాజానికి ఎంతో సాయం చేస్తోంది. కానీ మనం ఆర్మీకి తిరిగిచ్చింది చాలా తక్కువే. అందుకే వాళ్ల కుటుంబ సభ్యులకు ఏదైనా చేయాలని నిర్ణయించుకుంది. అమర జవాన్ల్ల కుటుంబాల్లో కొంతమంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ, చికిత్సకు డబ్బులు సరిపోక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిసి, వారికోసం విరాళాలు సేకరించేందుకు ‘షీ ఫర్ సొసైటీ, రైడ్ ఫర్ ఏ కాజ్’ పేరిట ఎన్జీవోను ప్రారంభించింది.
ఫేస్‌బుక్ ద్వారా మహిళా బైకర్స్ అందర్ని ఒకచోటకు చేర్చి బైక్ రైడింగ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేసింది. ఆ ఈవెంట్ ద్వారా వచ్చిన డబ్బును అవసరంలో ఉన్న ఆర్మీ కుటుంబాలకు ఇచ్చింది. ఈవెంట్ విజయవంతమవడంతో తర్వాత కూడా బైక్ రైడ్ ఈవెంట్స్ నిర్వహిస్తూ వచ్చిన విరాళాలతో అవసరం అయిన వారికి సాయం చేయడం కొనసాగించింది.
ఊరిలో వెలుగులు నింపింది
బెంగళూరుకు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న కొలార్ అనే గ్రామానికి ఎలక్ట్రిసిటీ సదుపాయం సరిగా లేదు. ఐదువేలమంది జనాభా ఉన్న ఈ గ్రామంలో ఆర్మీలో పనిచేసిన నాలుగు తరాలకు చెందిన కుటుంబాలు ఉన్నాయి. అయినా వీళ్లకి సరైన విద్యుత్ సౌకర్యం అందుబాటులో లేదు. వీరికి విద్యుత్‌ను అందించేందుకు మూడువందల మంది మహిళా రైడర్స్‌తో కలిసి బెంగళూరు నుంచి కోలార్‌కు ర్యాలీ నిర్వహించింది.
అందుకు స్పందనగా మాజీ సైనికులు వందమంది కలిసి సోలార్ కిట్లను బహుమతిగా ఇచ్చారు. దీంతో ఇప్పుడు ఆ గ్రామంలో ఎలక్ట్రిసిటి నిరంతరాయంగా అందుతోంది. పిల్లలు నేర్చుకోవడానికి ఉచితంగా శిక్షణ ఇచ్చే రెండు కంప్యూటర్ సెంటర్స్‌ను ఏర్పాటుచేసింది. భవిష్యత్‌లో మరిన్ని నిధులు సేకరించి బెంగళూరులోనేగాక, మైసూర్, థార్వాడ్‌లలో కూడా తన సేవలను విస్తరించనున్నట్లు హర్షిణి చెబుతోంది.
చదవండి: Shweta Gaonkar: కొబ్బరి కల్లు గీసే శ్వేత.. ఏడాదికి మూడున్నర లక్షల ఆదాయం! బీటెక్ వద్దనుకుని..
Comments
Please login to add a commentAdd a comment