హర్‌షిణి | Special Story On Harshini | Sakshi
Sakshi News home page

హర్‌షిణి

Published Sat, Jan 25 2020 2:47 AM | Last Updated on Sat, Jan 25 2020 5:04 AM

Special Story On Harshini - Sakshi

నువ్వేంటి అనేది నీ పుట్టుక చెప్పదు.. నువ్వేంటో నీ వ్యక్తిత్వం చెప్తుంది.. నువ్వేంటో నీ జీవన శైలి చూపిస్తుంది.. ఆత్మగౌరవాన్ని మించిన అస్తిత్వం లేదు అని అమ్మ చెప్పిన మాటలను మంత్రంలా ఆచరించి తనను తాను గౌరవించుకున్న ఒక హర్షిణి కథ ఇది..

‘‘నిజం చెబితే ఎందుకు ఉద్యోగం ఇవ్వరో చూడాలి.. నిజం చెప్పే ఉద్యోగాన్ని సాధించాలి’’ అని నిర్ణయించుకుంది ఆమె. ఆ పట్టుదలతోనే ‘జేఎల్‌ఎల్‌’ లో ఇంటర్వ్యూకి హాజరైంది. ఎప్పటిలాగే తొలి రెండు రౌండ్లు విజయవంతంగా పూర్తిచేసుకుంది. ఆఖరి రౌండూ పూర్తయి, ఉద్యోగం ఖాయమని తేలగానే చెప్పింది ఆమె ఇంటర్వ్యూ ప్యానెల్‌కు..  ‘సర్‌ .. నేను ట్రాన్స్‌ ఉమన్‌ని’ అని. ఆ జవాబుకి ప్యానెల్‌ ఉలిక్కిపడలేదు. ‘మీరు ఎవరైనా మాకు అభ్యంతరం లేదు. అయితే ఈ విషయాన్ని  స్టాఫ్‌తో చెప్పకండి. వాళ్లు సరిగా  రిసీవ్‌ చేసుకోలేకపోతే మీరే ఇబ్బంది పడ్తారు’’ అని సలహా మాత్రం ఇచ్చారు.

ఆమె ఆత్మవిశ్వాసం ఉప్పొంగింది. ఆమె పేరు హర్షిణి మేకల. అమ్మ చెప్పినట్టుగా.. ఆమెకు మాటిచ్చినట్టుగా చదువుకొని.. మంచి ఉద్యోగం సంపాదించి .. ఆత్మగౌరవంతో బతుకుతోంది! ఆంధ్రప్రదేశ్‌కు చెందిన హర్షిణి సొంతూరు కృష్ణాజిల్లా.. జగ్గయ్యపేట మండలంలోని బలుసుపాడు అనే చిన్న గ్రామం. తల్లి, తండ్రి ఇద్దరూ వ్యవసాయ కూలీలే (ఇప్పుడు లేరు, చనిపోయారు). హర్షిణికి ఇద్దరు అక్కలు, ఒక తమ్ముడు. ఇదీ హర్షిణికి సంబంధించిన ప్రాథమిక సమాచారం. తన జీవితంలోని మిగిలిన విషయాల గురించి ఆమె మాటల్లోనే... ‘‘అబ్బాయిగానే పుట్టినా ఆలోచనలన్నీ అమ్మాయిలాగే ఉండేవి. స్కూల్‌ నుంచి రాగానే అక్క వాళ్ల బట్టలు వేసుకునేదాన్ని. కళ్లాపి చల్లి ముగ్గుపెట్టడం వంటివి చేసేదాన్ని. అమ్మ వారించేది. కౌన్సెలింగ్‌ ఇచ్చేది. 

వినకపోగా వయసు పెరుగుతున్నకొద్దీ మరీ నేను అమ్మాయిలాగే ప్రవర్తిస్తుంటే అమ్మ.. వీడి శరీరం అబ్బాయిదే కాని మైండ్‌ అమ్మాయిదే అని ఒక అభిప్రాయానికి వచ్చేసింది. కుటుంబంలో మిగిలిన వాళ్లు నా పట్ల ఎలా ఉన్నా అమ్మ మాత్రం నన్ను అర్థంచేసుకోవడానికే ప్రయత్నించింది. నిజం చెప్పాలంటే నాకొక స్నేహితురాలిగా ఉంది. అమ్మాయిలాంటి నా నడత చూసి బయట, స్కూల్లోని అబ్బాయిలు గేలిచేసేవారు, భయంకరంగా ఏడిపించేవారు. భరించలేక ఇంటికొచ్చి అమ్మను పట్టుకొని ఏడ్చేసేదాన్ని. ‘ఇంత చిన్నవాటికే భయపడి ఏడిస్తే ఎలా? రేప్పొద్దున జీవితంలో చాలా ఎదుర్కోవాలి. బాగా చదవాలి.. మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి. గొప్పగా బతకాలి’’ అంటూ ధైర్యం చెప్పేది. ఎంత ధైర్యం కూడదీసుకున్నా హేళనలు, అవమానాలు తప్పలేదు. వాటిమధ్యే పెరిగాను.

ముంబైకి
నేను డిగ్రీ సెకండియర్‌లో ఉన్నప్పుడు ఓ ఎన్‌జీవోలో పనిచేసే ఒక ట్రాన్స్‌ ఉమన్‌ పరిచయమై ‘‘ముంబైకి వెళితే నువ్వు మొత్తం అమ్మాయిలా మారిపోవచ్చు’’అని సలహా ఇచ్చారు. అది మనసులో పెట్టుకొని డిగ్రీ పూర్తయ్యాక ఇంట్లో వాళ్లకు చెప్పకుండా ముంబై వెళ్లిపోయా. కానీ ఆ వాతావరణంలో ఇమడలేక మూడు రోజులకే తిరిగొచ్చేశా. ఈలోపు మా అమ్మ నా మీద బెంగపెట్టుకొని ఆసుపత్రిపాలైంది. గుండె జబ్బు అని తేలింది. ‘‘ఇంకోసారి ఇలాంటివి చేయొద్దు.. నువ్వు గౌరవంగా బతకాలి’’ అంటూ ఏడ్చేసింది అమ్మ. బాగా చదువుకొని, చక్కగా  స్థిరపడాలని ఒట్టుపెట్టించుకుంది నాతో. అప్పుడు పీజీ ఎంట్రెన్స్‌ రాశా. ఆచార్య యూనివర్సిటీ, ఎమ్‌.ఏ. ఎకనామిక్స్‌లో సీట్‌ వచ్చింది.

పూర్తయ్యాక నేను డిగ్రీ చేసిన కాలేజ్‌లోనే లెక్చరర్‌గా చేరా. యేడాదిన్నరకు అమ్మ చనిపోయింది. అంతా చీకటయిపోయినట్టే అనిపించింది. నా దుఃఖం, సంతోషం, కష్టం, సుఖం అన్నీ ఎరిగిన మనిషి.. నాకున్న ఏకైక స్నేహితురాలు అమ్మ.. ఆమె లేని ప్రపంచాన్ని ఊహించుకోలేకపోయా. కుంగిపోయి.. ఆత్మహత్యా ప్రయత్నమూ చేశా. అక్కా, తమ్ముడు రక్షించారు. అప్పటికే మా అక్కలిద్దరికీ పెళ్లిళ్లయి పిల్లలు కూడా. పెద్దక్క భర్త చనిపోవడంతో మా ఇంటికే తెచ్చేసుకున్నాం. తమ్ముడు చదువుకుంటున్నాడు. అమ్మ పోయిన బాధలో నాన్న తాగుడికి బానిసయ్యాడు. 

బాధ్యతగా మసలుకోవాలన్న  స్పృహ వచ్చింది. ఊళ్లోనే ఉంటే అమ్మ జ్ఞాపకాలతో దిగులు పెరగడం తప్ప ఏమీ చేయలేనని గ్రహించి మళ్లీ ముంబై వెళ్లిపోయా. అక్కడ ‘త్రివేణి సమాజ్‌ వికాస్‌ కేంద్ర’ అనే స్వచ్ఛంద సంస్థలో ప్రాజెక్ట్‌ మేనేజర్‌గా కొన్నాళ్లు, క్రిస్టియన్‌ ఎన్‌జీవో ‘సేవానికేతన్‌’లో కొన్నాళ్లు పనిచేశా. ఆ టైమ్‌లోనే ఢిల్లీ వెళ్లి స్త్రీగా మారిపోయే సర్జరీ చేయించుకొని ‘పూర్తిగా అమ్మాయే’అనే సర్టిఫికెట్‌ తీసుకున్నా. దీంతో నా ‘ఐడెంటిటీ’ మార్చుకోవాలని కోర్టు అఫిడవిట్‌ కూడా తెచ్చుకొని ‘హర్షిణి’ నయ్యాను. ఎమ్‌ఎన్‌సీలలో ఉద్యోగం సంపాదించాలనుకున్నా. జేఎల్‌లో సాధించా. స్టాఫ్‌ దగ్గర నేనెవరో చెప్పొద్దన్న నా పై అధికారులే నేను చేరిన ఆరునెలలకు నా గురించి స్టాఫ్‌కి చెప్పారు గర్వంగా. అందరూ షాక్‌. నిజమే అంటూ నా స్ట్రగుల్‌ని నేను  చెబితేగాని నమ్మలేదు ఎవరూ.

బ్యూటిఫుల్‌ స్మైల్‌
ఉద్యోగం చేస్తూనే ట్రాన్స్‌ విమెన్‌ కోసం ప్రారంభించిన అందాల పోటీల్లో పాల్గొన్నా. ‘టాప్‌ సిక్స్‌’లో నిలిచి, ‘బ్యూటిఫుల్‌ స్మైల్‌’ టైటిల్‌నూ గెలుచుకున్నా. అలా జాతీయ అందాల పోటీలో పాల్గొన్న మొదటి తెలుగు ట్రాన్స్‌ ఉమన్‌ని నేనే. మోడలింగ్‌ కూడా చేశా. రెండు హిందీ లఘుచిత్రాల్లో నటించా. ముంబైలోని మరాఠీ, హిందీ, ఇంగ్లిష్‌ పత్రికలు నా గురించి రాశాయి. ఇదంతా మా ఊరికి ఇంకోరకంగా చేరి మా అక్కతో కొందరు ‘మీ చెల్లెలు ముంబైలో బెగ్గింగ్‌ చేసుకుంటోందట కదా’ అన్నారట. దాంతో మా అక్క ఏడుస్తూ ఫోన్‌ చేసింది ‘ముంబై వద్దు.. ఏమొద్దు ఇక్కడికి వచ్చెయ్‌’ అని. హైదరాబాద్‌లో ఉన్న మా ఆఫీస్‌ బ్రాంచ్‌కి బదిలీ చేయించుకుని వచ్చేశా.

నటి కావాలనే కోరిక చిన్నప్పటి నుంచీ ఉంది. ఇక్కడికి వచ్చాక సినిమాల్లో చాన్స్‌కోసం ప్రయత్నించడం మొదలుపెట్టా. నా గురించి తెలిసి రచయిత, దర్శకుడు అమాన్‌ అహ్మద్‌  ‘బద్లావ్‌’ అనే హిందీ నాటకంలో నాకు వేషం ఇచ్చారు. దానికి మంచి పేరు వచ్చింది. సినిమా చాన్సే ఇంకా రాలేదు. తమిళంలో, మలయాళంలో ట్రాన్స్‌ ఉమన్‌కు హీరోయిన్‌ అవకాశాలు ఇస్తున్నారు. మమ్ముట్టి లాంటి పెద్ద పెద్ద హీరోల పక్కనా చేస్తున్నారు. కానీ మన తెలుగులో కనీసం క్యారెక్టర్‌ రోల్స్‌ కూడా ఇవ్వడం లేదు. సీరియళ్లలో ‘ట్రాన్స్‌ ఉమన్‌’ పాత్రనూ ఆడవాళ్లే  చేస్తున్నారు. కానీ మాకు ఇవ్వడం లేదు’’ అంటుంది హర్షిణి మేకల.

►ఏ ఊళ్లో అయితే ఒకప్పుడు అవమానాలు, అవహేళనలు ఎదుర్కొన్నానో ఆ ఊరి వాళ్లే ఇప్పుడు అభిమానిస్తున్నారు. నా లైఫ్‌ స్టైల్‌ చూసి సంతోషపడుతున్నారు. ఈ ఆనందాన్ని పంచుకోవడానికి అమ్మ లేదనే దిగులు వెంటాడుతూనే ఉంది. అమ్మా.. నువ్వు కోరుకుంటున్నట్టే గౌరవంగా బతుకుతున్నాను అని చెప్పాలనుంటుంది.
– హర్షిణి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement