ఢిల్లీ పోలీసులకు జనవరిలో చిక్కిన ముఠా(ఫైల్)
సాక్షి, హైదరాబాద్ : ఎవరైనా బెదిరించి డబ్బు దండుకోవడాన్ని ఎక్స్‌టార్షన్ అంటారు...ఆన్‌లైన్ అశ్లీలంతో ఎర వేసి బెదిరిస్తూ అందినకాడికి వసూలు చేయడాన్ని సెక్స్‌టార్షన్ అంటున్నారు. ఆన్‌లైన్ ఆధారంగా జరిగే ఈ నేరాలు ఇటీవల పెరిగిపోయాయి. సిటీ సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్‌కు తరచు ఈ బాధితులు వస్తున్నారు. అయితే తొలిసారిగా మలక్‌పేటకు చెందిన వ్యక్తి రూ.2 లక్షలు పోగొట్టుకుని శనివారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో ఢిల్లీ పోలీసులు ఓ గ్యాంగ్‌ను పట్టుకున్నారు. దీంతో ఇక్కడి అధికారులు ఆ పోలీసుల నుంచి వివరాలు సేకరించాలని నిర్ణయించారు.
ఈ–యాడ్స్ సైట్ ఓఎల్‌ఎక్స్‌లో సెకండ్ హ్యాండ్ వస్తువులు అంటూ ఆర్మీ అధికారులుగా ప్రకటనలు ఇచ్చి అందినకాడికి దండుకుంటున్న, నకిలీ ఫేస్‌బుక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి ‘ఫ్రెండ్స్’ నుంచి డబ్బు వసూలు చేస్తున్న నేరాలు చేసే రాజస్థాన్‌లోని భరత్‌పూర్ గ్యాంగే ఈ సెక్స్‌టార్షన్ క్రైమ్ మొదలెట్టింది. సైబర్ నేరగాళ్లు తొలుత నకిలీ వివరాలు, ఇంటర్‌నెట్ నుంచి సేకరించిన మహిళల ఫొటోలతో ఫేస్‌బుక్‌లో ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తున్నారు. వీటికి ఎదుటి వారిని ఇట్టే ఆకర్షించే ఫొటోలను ప్రొఫైల్ పిక్చర్స్‌గా ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రొఫైల్స్ ద్వారా ఫేస్‌బుక్‌లో ఉన్న అనేక మందికి ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపిస్తున్నారు.
ప్రత్యేక యాప్స్ ద్వారా
ఈ నేరగాళ్లు ఉత్తరాదికి చెందిన వారు కావడంతో ఎక్కువగా దక్షిణాదికి చెందిన వారినే టార్గెట్‌గా చేసుకుంటున్నారు. ఎక్కువగా ‘సింగిల్ స్టేటస్’ కలిగిన వారినే ఎంచుకుని..తామూ ‘సింగిల్’ అంటూ తన ప్రొఫైల్స్‌లో పొందుపరుస్తున్నారు. వీటిని చూస్తున్న వాళ్లు తక్షణం రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేసి ఫ్రెండ్స్‌గా మారిపోతున్నారు. ఇలా తమకు ఫ్రెండ్స్‌గా మారిన వాళ్లతో సైబర్ నేరగాళ్లు కొన్నాళ్ల పాటు సదరు యువతి మాదిరిగానే మెసెంజర్‌లో చాటింగ్ చేస్తున్నారు. ఆ త ర్వాత సెక్స్ చాటింగ్ మొదలు పెట్టి వాట్సాప్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకునేలా చేస్తున్నారు. ఇవి చేతికి అందిన తర్వాత అసలు కథ మొదలువుతోంది. ఇంటర్‌నెట్ సంగ్రహించిన అర్ధనగ్న, నగ్న వీడియోలను సైబర్ నేరగాళ్లు ప్రత్యేక యాప్స్ ద్వారా తమ ఫోన్‌లో ఉంచి టార్గెట్ చేసిన వ్యక్తులకు ఫోన్లు చేస్తున్నారు. వాళ్లతో మాట్లాడుతూ తామే నగ్నంగా తయారవుతున్నామంటూ ఆ యాప్‌లోని వీడియోను ప్లే చేస్తున్నారు.
చదవండి:
నగ్నంగా కవ్వించి...ఆపై రికార్డు చేసి
'నేను చనిపోతున్నా.. పిల్లల్ని బాగా చూసుకో'
దీన్ని చూస్తున్న బాధితులకు ఆ యువతి/మహిళ ఫోన్ కెమెరా ముందే అలా చేస్తున్నట్లు కనిపిస్తుంది. దీంతో పూర్తిగా వారి వల్లో పడిపోతున్నారు. ఇలా ఒకటిరెండు సార్లు వీడియోలు చూపిస్తున్న సైబర్ నేరగాళ్లు ఆపై మాటల్లో దింపి బాధితులూ అలా చేసేలా చేస్తున్నారు. ఈ దృశ్యాలను స్క్రీన్ రికార్డింగ్ యాప్స్ ద్వారా రికార్డు చేస్తున్నారు. ఆపై వీటిని తాము సృష్టించిన యూ ట్యూబ్ చానల్స్‌లో ఉంచి ఆ లింకుల్ని బాధితులకు వాట్సాప్ చేస్తున్నారు. కంగుతింటున్న బాధితులు తొలగించాలంటూ వారిని ప్రాధేయపడుతున్నారు. తాము కోరిన మొత్తం చెల్లింకుండా వీటిని ఇతర సోషల్‌మీడియాలో పెట్టేస్తామంటూ నేరగాళ్లు బెదిరిస్తున్నారు.
ఇలా అందినకాడికి పేటీఎం, గూగుల్ పే, బ్యాంకు ఖాతాల ద్వారా డబ్బు డిపాజిట చేయించుకుంటున్నారు. ఆపై పోలీసుల మాదిరిగా బాధితులకు కాల్స్ చేస్తూ మరో అంకానికి తెరలేపుతున్నారు. నగ్న వీడియోలతో వేధించినందుకు నీపై ఫలానా యువతి ఫిర్యాదు చేసిందంటూ పోలీసుల మాదిరిగా నేరగాళ్లు బాధితులతో మాట్లాడుతున్నారు. ఆ పేరుతోనూ మరికొంత స్వాహా చేస్తున్నారు. వీరి వల్లోపడిన ఇద్దరు ఆర్మీ జవాన్లు రూ.10 వేల చొప్పున చెల్లించి గతంలో సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదయ్యాయి. తాజాగా మలక్‌పేటకు చెందిన వ్యక్తి రూ.2 లక్షలు పొగొట్టుకున్నాడు. బెదిరింపుల పాలైనా డబ్బు చెల్లించని వాళ్లు ప్రతి నెలా దాదాపు 20 మంది వరకు సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయిస్తున్నారు.
వీరి బలహీనతలే వారికి బలం
సైబర్ నేరగాళ్లకు ఎదుటి వారి బలహీనతలే బలంగా మారుతున్నాయి. ఆన్‌లైన్, సోషల్ మీడియాల్లో ఎంత క్రమశిక్షణతో ఉంటే అంతమేలు. అపరిచితులు..ప్రదానంగా మహిళలు, యువతుల పేర్లతో వచ్చే రిక్వెస్ట్‌లకు స్పందించకూడదు. ఈ నేరాల్లో బాధితులుగా మారితే ఒక్కోసారి ఆర్థికంగా, సామాజికంగా, కుటుంబ పరంగా నష్టపోవాల్సి ఉంటుంది. పరిచయం లేని వారితో వ్యక్తిగత, ఆంతరంగిక చాటింగ్స్, ఫొటోలు, వీడియోల మారి్పడిలు చేయకపోవడం ఉత్తమం.
– కేవీఎం ప్రసాద్, సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ
Comments
Please login to add a commentAdd a comment