ఫేస్‌బుక్‌లో పరిచయం... ప్రేమ పేరుతో వంచన
బెంగళూరు : ఫేస్‌బుక్ పరిచయం ఓ యువతికి ప్రాణ సంకటంగా మారింది. ఆ యువతికి ప్రేమ పేరుతో వల వేసిన యువకుడు..తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మించి అవసరాలు తీర్చుకున్నాడు. మోసాన్ని గుర్తించిన యువతి నిలదీయగా, చంపేస్తామని బెదిరిస్తున్నాడు. ఈ ఘటన బుధవారం బెంగళూరులో వెలుగు చూసింది.
పోలీసులతో పాటు బాధితురాలి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నగరానికి చెందిన 26 ఏళ్ల యువతికి స్థానిక జేపీ నగర్‌లో నివసిస్తున్న కార్తీక్‌రెడ్డితో మే మొదటి వారంలో ఫేస్‌బుక్‌లో పరిచయమైంది. వారం పాటు ఛాటింగ్ చేసిన తర్వాత కార్తీక్‌రెడ్డి తన ప్రేమను వ్యక్తం చేశాడు. పెళ్లి కూడా చేసుకుంటానన్నాడు. ఇందుకు ఆమె ఒప్పుకోవడమే కాకుండా తల్లిదండ్రులకు కూడా తెలియజేసింది. వారి సమ్మతితో అప్పుడప్పుడు డేటింగ్‌కు వెళ్లేది. ఈ క్రమంలో శారీరకంగా ఒకటయ్యారు. తర్వాత కార్తీక్‌రెడ్డి ప్రవర్తనలో మార్పు వచ్చింది. అనుమానించిన యువతి ఫేస్‌బుక్‌లో అతనికి స్నేహితులుగా ఉన్నవారిని విచారించింది.
గతంలో కూడా కార్తీక్ ఇలానే పలువురిని మోసం చేసినట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో బాధితురాలు అతడిని నిలదీసింది. దీంతో ‘నా గురించి నా స్నేహితులతో విచారిస్తావా? నాకు చాలామంది రాజకీయ నాయకులు, కార్పొరేట్ వ్యక్తులతో సంబంధం ఉంది. నేను ఒక కంపెనీ సీఈఓను. నువ్వు ఏమీ చేయలేవు. నిన్ను వదిలిపెట్టను’ అని కార్తీక్ రెడ్డి బెదిరించాడు.
అంతేకాకుండా ఫోన్ చేసి యాసిడ్ పోస్తానని బెదిరింపులకు దిగాడు. కార్తీక్‌రెడ్డి స్నేహితుడిగా చెప్పుకునే జయదీప్ కూడా బాధితురాలికి ఫోన్ చేసి ‘నీ పై వాహనం పోనిచ్చి చంపేస్తా. రోడ్డు ప్రమాదమని అందరినీ నమ్మిస్తా’ అంటూ కొద్దిరోజులుగా బెదిరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో బాధితురాలు వైట్‌ఫీల్డ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కార్తీక్‌రెడ్డి, జయదీప్ కోసం గాలిస్తున్నారు.