‘ఫేస్‌బుక్’ మెసేజ్‌తో దుమారం | TDP,Congress Quarrel due to Facebook message | Sakshi
Sakshi News home page

‘ఫేస్‌బుక్’ మెసేజ్‌తో దుమారం

Published Fri, Dec 20 2013 4:22 AM | Last Updated on Thu, Jul 26 2018 12:57 PM

కాంగ్రెస్, టీడీపీ నాయకుల వాగ్వాదం - Sakshi

కాంగ్రెస్, టీడీపీ నాయకుల వాగ్వాదం

తూప్రాన్, న్యూస్‌లైన్ : ఫేస్‌బుక్‌లో ఓ నాయకుని పేరుతో అనుచిత వ్యాఖ్యలు రాసి మెసేజ్ చేసిన ఘటన కాళ్లకల్, తూప్రాన్‌లలో గురు దుమారం రేపింది. కాంగ్రెస్, టీడీపీ పార్టీలకు చెందిన ఇరువర్గాలు ఈ ఘటనపై బాహాబాహీకి దిగడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీస్ స్టేషన్ ఎదుట జరిగిన ఈ సంఘటన కలకలం రేపగా ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. వివరాలిలా ఉన్నాయి. తూప్రాన్ మండలం కాళ్లకల్‌లో కొందరు యువకులు బుధవారం రాత్రి  ఫేస్‌బుక్ ద్వారా మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడి పేరును అనుచిత వ్యాఖ్యలు రాసి మెసేజ్ చేశారు.
 
 ఈ విషయం తెలుసుకున్న ఆ పార్టీకి చెందిన నాయకులు సెల్‌ఫోన్ నంబరు ఆధారంగా మెసేజ్ పంపిన యువకులను గుర్తించి మందలించడంతో సదరు యువకులు క్షమాపణ చెప్పారు. అయితే అదే సమయంలో అటుగా వచ్చిన టీడీపీకి చెందిన నాయకుడు.. ‘ఎందుకు క్షమాపణ చెప్పారు. ఫేస్‌బుక్‌లో ఎవరి వారి ఇష్టాలను వ్యక్త పరుచవచ్చు’ అని తెలుపడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.  దీంతో ఒకరికొకరు వాగ్వాదానికి దిగారు. ఇరువర్గాల నాయకులు బుధవారం రాత్రి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
 
 గురువారం ఇరువర్గాల నాయకులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. వీరికి పోలీసులు నచ్చజెప్పడంతో ఇరువర్గాలూ రాజీపడ్డాయి. పోలీస్‌స్టేషన్ నుంచి బయటకు వచ్చిన అనంతరం ఇరుపార్టీలకు చెందిన వారు తిరిగి దూషించుకోవడంతో పోలీస్‌స్టేషన్ ఎదుట ఘర్షణ వాతావరణం నెలకొంది. స్పందించిన సీఐ రవీందర్‌రెడ్డి, ఎస్‌ఐ నిరంజన్‌రెడ్డిలు సిబ్బందితో ఇరుపార్టీల నాయకులను అక్కడి నుంచి చెదరగొట్టారు. అయితే ఈ విషయం మండలంలో చర్చనీయంశమైంది. ఈ విషయంపై ‘న్యూస్‌లైన్’ ఎస్‌ఐ నిరంజన్‌రెడ్డిని వివరణ కోరగా ఎవరిపై కేసు నమోదు చేయలేదన్నారు. ఇరువర్గాలను నచ్చజెప్పినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement