ఫేస్'బుక్కైపోయాడు'
హైదరాబాద్ : సామాజిక వెబ్సైట్ ఫేస్బుక్లో యువతుల పేర్లతో అకౌంట్లు క్రియేట్ చేసి అభ్యంతరకర సందేశాలు, అశ్లీల ఫోటోలు పోస్ట్ చేస్తున్న ఓ యువకుడిని సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. డీసీపీ పాలరాజు కథనం ప్రకరాం బేగంపేటలోని గన్ బజార్ నివాసి మహ్మద్ ఖాలేద్ ఓల్డ్ బోయిన్పల్లిలోని ఓ పెస్ట్ కంట్రోల్ సంస్థలో టెక్నీషియన్. గతంలో ఇతడితో కలిసి మరో సంస్థలో విధులు నిర్వర్తించిన యువతిపై ఆశలు పెంచుకున్న ఖాలేద్ ఫేస్బుక్లో ఆమె అకౌంట్ను గుర్తించి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు.
ఆమె నుంచి ఎలాంటి స్పందన లేకపోవటంతో కక్షకట్టాడు. యువతికి చెందిన ఫోటోను ఆమె పేరుతో నకిలీ అకౌంట్ తెరిచాడు. దీన్ని వినియోగించి యువతి ఫ్రెండ్స్ లిస్ట్లో ఉన్న మహిళలు/యువతులకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. రిసీవ్ చేసుకున్న వారంతా సదరు యువతే పంపిందని భావించి యాక్సెప్ట్ చేశారు. ఇలా ఫ్రెండ్స్గా మారిన వారిలో ఓ యువతితో అసభ్యకర పదజాలంతో చాటింగ్ చేశాడు. ఆమె ద్వారా సమాచారం అందుకున్న బాధితురాలు సీసీఎస్ డీసీపీ పాలరాజుకు ఫిర్యాదు చేసింది.
దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన ఇన్స్పెక్టర్ రాజు నేతృత్వంలోని బృందం సాంకేతిక దర్యాప్తు చేపట్టి నిందితుడైన ఖాలేద్ను గుర్తించారు. శుక్రవారం ఇతడిని అరెస్ట్ చేసి విచారించగా... ఇదే తరహాలో మరో ఏడు బోగస్ అకౌంట్లు క్రియేట్ చేసి,అశ్లీల ఫోటోలు పోస్ట్ చేయడంతో పాటు వారి పేర్లతో చాటింగ్స్ చేసినట్లు వెల్లడైంది.