కోడలికి అసభ్య ఎస్ఎంఎస్
సాక్షి, చెన్నై(టీ.నగర్) : కోడలికి అసభ్య ఎస్ఎంఎస్ పంపిన మామను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ సంఘటన తురైపాక్కంలో సంచలనం రేకెత్తించింది. చెన్నై గూడువాంజేరి సమీపానగల కన్నివాక్కంకు చెందిన కపాలీశ్వరన్ (52) కుమారుడు దీపక్ (26). ఇతని భార్య సురేఖ (25). వీరికి గత రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు ఏడాది వయసుగల దీక్షిత అనే కుమార్తె ఉంది. ఇలావుండగా సురేఖకు ఒక యువకునితో అక్రమ సంబంధం ఉన్నట్లు, వారిరువురూ కలిసి జీవించకూడదని, సురేఖ ఆత్మహత్య చేసుకోవాలని కపాలీశ్వరన్ సెల్‌ఫోన్‌కు ఒక ఎస్ఎంఎస్ వచ్చింది. దీని గురించి అతను కుమారుడితో చెప్పాడు. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు ఏర్పడడంతో దీపక్ చెంగల్పట్టు కోర్టులో విడాకులు కోరుతూ కేసు దాఖలు చేశారు.
దీంతో ఒక్కియం తురైపాక్కంలో తన పుట్టింట్లో నివశిస్తున్న సురేఖ సెల్‌ఫోన్‌కు వరుసగా అసభ్య ఎస్ఎంఎస్లు వస్తుండేవి. దీనిగురించి తురైపాక్కం కన్నగినగర్ పోలీసులకు గత రెండు రోజుల క్రితం సురేఖ ఫిర్యాదు చేశారు. దీంతో ఇన్స్పెక్టర్ శివకుమార్ కేసు నమోదు చేసి సురేఖ సెల్‌ఫోన్‌కు వచ్చిన నెంబర్ల ఆధారంగా విచారణ జరిపారు. ఇందులో మామ కపాలీశ్వరన్ వేరొక సిమ్‌కార్డు ద్వారా సురేఖకు అసభ్య ఎస్ఎంఎస్లు పంపినట్లు తేలింది. దీంతో కపాలీశ్వరన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరపగా అతను ఈ ఎస్ఎంఎస్లు పంపినట్లు ఒప్పుకున్నాడు. అక్రమ సంబంధం ఎస్ఎంఎస్లో కుమారుడికి, కోడలికి తరచుగా గొడవలు జరిగేవని, దీంతో కుమారుడు విచారంతో కనిపించేవాడని, దీంతో కోడలికి అసభ్య ఎస్ఎంఎస్ పంపినట్లు కపాలీశ్వరన్ తెలిపాడు. దీంతో పోలీసులు కపాలీశ్వరన్ను అరెస్టు చేసి ఆలందూరు కోర్టులో హాజరుపరిచి జైల్లో నిర్బంధించారు.