ఎవరీ ఐరన్‌మ్యాన్?
మీరు ఇంటర్నెట్‌లో డబ్బు చెల్లించేందుకు పే పాల్‌ను ఉపయోగించినా, హాలీవుడ్ సినిమా ఐరన్‌మ్యాన్‌ను చూసి ఉన్నా ఎలన్‌మ్‌స్క్ మీకు చిరపరిచితుడే. పేపాల్ సృష్టికర్తగానే కాకుండా ఐరన్‌మ్యాన్ సినిమా ఈయన జీవిత కథ ఆధారంగానే తీశారని టాక్. ఈ 43 ఏళ్ల యువ మేధావి పే పాల్ తరువాత అనేక కొత్త సంస్థలు ఏర్పాటు చేశాడు. స్పేస్ ఎక్స్ కంపెనీ ద్వారా ప్రపంచంలోనే తొలి ప్రైవేట్ రాకెట్ తయారీ సంస్థను ఏర్పాటు చేశాడు.
స్పేస్ ఎక్స్ తయారు చేసిన ఫాల్కన్ 1, ఫాల్కన్ 9 రాకెట్లు నాసా తరఫున అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సరుకులు రవాణా చేశాయి. దీంతోపాటు అమెరికాలోనే రెండో అతిపెద్ద సౌరశక్తి కంపెనీ ‘సోలార్ సిటీ’ వెనుక, ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన, అత్యధిక మైలేజీనిచ్చే ఎలక్ట్రిక్ కార్లు తయారు చేసే ‘టెస్లా’ కంపెనీ యజమానిగా మస్క్ గుర్తింపు పొందారు. మస్క్ ఫౌండేషన్ ద్వారా పసిపిల్లల వైద్యం కోసం, భూతాపోన్నతిని తగ్గించేందుకు సంప్రదాయేతర ఇంధనవరులను ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తూ తన దాతృత్వాన్ని చాటుతారు మస్క్!