ఇంటర్‌నెట్‌తో పెడదోవ పడుతున్న యువత
జన్నారం, న్యూస్‌లైన్ : ఇంటర్‌నెట్ ద్వారా భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాల్సిన యువత అశ్లీల అంశాలకు ప్రాధాన్యమిస్తూ ఉజ్వల భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారు. ఆటపాటలతో గడపాల్సిన వయసులో కుర్చీలో బందీలైపోతున్నారు. పాశ్చాత్య విష సంస్కృతికి బానిసలుగా మారుతున్నారు. గంటల తరబడి ఇంటర్‌నెట్‌తో గడుపుతున్నారు. గతంలో నగరాలకే పరిమితమైన ఈ వ్యసనం నేడు పల్లెలకూ విస్తరించింది.
సాంకేతిక పరిజ్ఞానం గ్రామాలకు సైతం అందడం ఓ విధంగా సంతోషకరమే అయినా.. అందిపుచ్చుకున్న విజ్ఞానం చెడుపోకడలకు దారితీయడం బాధాకరంగా పరిణమిస్తోంది. కంప్యూటర్, ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్, సెల్‌ఫోన్‌ల వాడకం విపరీతంగా పెరగడం ఇందుకు ప్రధాన కారణం. ఈ మెయిల్స్, ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్ వినియోగం ప్రధానంగా దుష్ర్పభావం చూపుతోంది. ఇంటర్‌నెట్ నుంచి అశ్లీల చిత్రాలను డౌన్‌లోడ్ చేసుకుంటూ ఇష్టం వచ్చినట్లు చాటింగ్ చేసుకుంటూ గంటల కొద్ది సమయాన్ని వృథా చేస్తున్నారు.
పిల్లలపై నెట్ ప్రభావం
పిల్లలపై ఇంటర్‌నెట్ ప్రభావం విపరీతంగా ఉంది. పెద్దల మాదిరిగానే సెల్‌ఫోన్, ఇంటర్‌నెట్‌లను పిల్లలు సైతం వినియోగిస్తున్నారు. ఎక్కువగా ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్, అశ్లీల వెబ్‌సెట్లు చూస్తున్నట్టు సర్వేలు చెప్తున్నాయి. ఫేస్‌బుక్‌లో యూజర్‌కు 12 ఏళ్ల పరిమిత వయస్సు ఉండాలని నిబంధన ఉంది. అయితే తప్పుడు వయస్సుతో అకౌంట్ ఓపెన్ చేసి చాటింగ్‌లు చేస్తున్నారు. పాఠశాల నుంచి ఇంటికి చేరుకోగానే నెట్ మాయాజాలం వారిని కట్టి పడేస్తోంది. ఈ కారణంతో చదువులో కూడా వెనుకబడిపోతున్నారు. తల్లిదండ్రులు తమ పనిలో బిజీగా ఉండటం, పిల్లల అలవాట్లపై దృష్టి పెట్టకపోవడం కూడా దీనికి కారణమవుతోంది.
ఏ సమాచారమైనా క్షణాల్లో..
ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా, ఏ సమాచారం కావాలన్నా, ఎలాంటి చరిత్రలు తెలుసుకోవాలన్నా, సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ చేసుకోవాలన్నా, దరఖాస్తులు, ఉద్యోగాలు, ఫలితాలు తదితర వివరాల కోసం గూగుల్ సెర్చ్‌లోకి వెళ్తే క్షణాల్లో సమాచారం వస్తుంది.
అశ్లీలతపై ఆసక్తి
సమాజంలో వ్యసనాలకు బానిసలైన యువకులపై ఇంటర్‌నెట్ ప్రభావం అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది. నెట్ వేగంగా విస్తరించినప్పటికీ మరోవైపు యువత భవిష్యత్తు ఆందోళనకరంగా మారింది. యూట్యూబ్‌లో అశ్లీల చిత్రాలు చూడడానికే యువత అత్యధిక ప్రాధాన్యమిస్తున్నట్లు పలు సర్వేల్లో వెల్లడైనట్లు తెలుస్తోంది. కంప్యూటర్, ల్యాప్‌ట్యాప్‌ల ద్వారా ఇంటర్‌నెట్‌ను వినియోగించే వారితో పాటుగా సెల్‌ఫోన్‌ను వినియోగిస్తున్న వారు కూడా ఈ విషయంలో పోటీ పడుతున్నారు.
అర్ధరాత్రి సమయంలో కూడా యువత ఇంటర్‌నెట్‌ను వినియోగిస్తున్నారని సర్వేలు చెప్తుతున్నాయి. ఫోర్న్‌సైట్‌ను బ్లాక్ చేయడంతో అసభ్యకర చిత్రాలు చూసే వీలు లేనందున యువత ఇంటర్‌నెట్ సెంటర్లకు వచ్చేందుకు సుముఖత చూపడం లేదని ఇంటర్‌నెట్ నిర్వాహకులు చెప్తుతున్నారు. దీంతో అరచేతిలో అందుబాటులో ఉండేలా స్మార్ట్‌ఫోన్, సెల్‌ఫోన్‌లను ప్రధానంగా ఉపయోగిస్తున్నారు.
ఫేస్‌బుక్ మాయలో...
ఫేస్‌బుక్ మాయలో పడి యువతులు సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు. అవగాహన లేని కారణంగా ఫేస్‌బుక్‌లో ఫొటోలు పెడితే ఆ ఫొటోలను కొందరు డౌన్‌లోడ్ చేసి అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి నెట్‌లో అందరికీ పంపుతున్నారు. ఇలాంటి విషయంలో హైదరాబాద్‌కు చెందిన ఒక అమ్మాయి సూసైడ్ చేసుకున్న విషాదకర ఘటన కూడా ఉంది. ఫొటోల అప్‌లోడ్ విషయంలో యువతులు జాగ్రత్తలు పాటించకపోతే సమస్యలు ఎదుర్కోక తప్పదు.
బినామీలు తస్మాత్ జాగ్రత్త
బినామీ పేరుతో, ప్రొఫైల్స్‌తో అకౌంట్లు కొనసాగిస్తున్న వారు ఇకపై జాగ్ర త్త వహించాలి. అసభ్యకరమైన మెసేజ్‌లు పంపితే సాంకేతిక నైపుణ్యంతో అటువంటి వారిని ఇట్టే పసిగట్టే పరిజ్ఞానం ఇప్పుడు అందుబాటులో ఉంది. సర్వర్ల ద్వారా ఆచూకీని తెలుసుకునే వెసులుబాటు ఉంది. సదరు వ్యక్తులు ఉపయోగించిన కంప్యూటర్లు, సెల్‌ఫోన్‌లను ఇట్టే కనిపెట్టేస్తారు.