అమెరికాను మించిపోయాం! | Indians beat americans In internet usage | Sakshi
Sakshi News home page

అమెరికాను మించిపోయాం!

Published Thu, Aug 28 2014 8:57 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

అమెరికాను మించిపోయాం! - Sakshi

అమెరికాను మించిపోయాం!

అమెరికాలో భారతీయులు, భారతీయ సంతతి వారు సాధించిన విజయాలు మనకు గర్వకారణంగా అనిపించడంలో ఆశ్చర్యం లేదు. కానీ... తాజాగా భారతీయులు మరో ఘనత సాధించారు. ఇంటర్నెట్ వినియోగదారుల విషయంలో ఈ ఏడాది చివరికల్లా మనం అమెరికాను మించిపోనున్నాం. ఇప్పటికే ఇందుకు తగిన తార్కాణాలు కనిపిస్తున్నాయి కూడా. కొన్ని వెబ్‌సైట్లకు అక్కడికంటే భారతీయ వినియోగదారులు ఎక్కువగా ఉండటం. కొన్నింటిలో దాదాపు సమానంగా ఉండటం గమనార్హమని ఇంటర్నెట్ ట్రాఫిక్‌పై ఓ కన్నేసి ఉంచే సంస్థ అలెక్సా తెలిపింది. ఇవేవీ చెత్త వెబ్‌సైట్లు కాకపోవడం..మేధో సమాజంగా భారత్ ఎదుగుతోందనేందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇంతకీ ఆ వెబ్‌సైట్లు ఏవంటే...
 
కోరా... ప్రశ్న, జవాబు మనవే..!
 
ఫేస్‌బుక్ మాజీ ఉద్యోగులు ఇద్దరు కలిసి మొదలుపెట్టిన వెబ్‌సైట్ ఇది. ఇది సెర్చ్ ఇంజిన్‌లా పనిచేస్తుంది. అదే సమయంలో వికీపీడియా మాదిరిగా సందేహాలపై వివరాలనూ అందిస్తుంది. వికీపీడియాలో ఏదైనా అంశం గురించి తెలుసుకోవాలంటే ఒక చిక్కు ఉంది. ఆ అంశానికి సంబంధించిన పదాలను ఎంటర్ చేయగానే విసృ్తత స్థాయిలో సమాచారం స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతుంది. దాంట్లో మనకు కావాల్సిన సమాచారం ఏమిటో తెలుసుకునేందుకు చాలా సమయం పడుతుంది. కోరాలో ఇలా కాదు. ఇందులో ఎలాంటి ప్రశ్న అయినా అడగవచ్చు. సింపుల్ కీవర్డ్‌తో సెర్చ్ చేయవచ్చు. కోరాలో కనిపించే కొన్ని ప్రశ్నలు ఇలా ఉంటాయి. ‘How is school life in different countries?" or "What is the worst part about working at Google?"భారతీయ వినియోగదారులు పెరిగిన తరువాత "What does it feel like to get married through BharatMatrimony?"వంటి ప్రశ్నలు పెరిగిపోతున్నాయి!!! భారత్‌లో వినియోగదారులు 35.6 శాతమైతే అమెరికాలో ఇది 25.6 శాతంగా ఉంది.
 
చాటింగ్ కోసం ఒమెగ్లే...
 
అమెరికాతో సమానమైన వినియోగదారులు ఉన్న ఛాటింగ్ వెబ్‌సైట్ ఇది. అపరిచితులతో మాటామాటా కలిపేందుకు, అభిరుచులు పంచుకునేందుకు ఉపయోగపడుతుంది. 2009లో మొదలైన ఈ వెబ్‌సైట్‌కు భారత్‌లో 18 శాతం వినియోగదారులుంటే అమెరికాలో ఒక శాతం ఎక్కువ వినియోగదారులు ఉన్నారు. టెక్ట్స్, వీడియో ఛాటింగ్ రెండింటికీ అవకాశముంది. అసలు పేరు పెట్టుకోవాల్సిన అవసరం లేని కారణంగా కొంతమంది ఈ సైట్‌ను అడల్ట్ ఛాటింగ్‌కూ ఉపయోగిస్తున్నట్లు అలెక్సా చెబుతోంది.
 
స్టంబుల్ అపాన్....
 
గూగుల్‌లో మనం కొన్ని వేలసార్లు వివిధ అంశాలపై సెర్చ్ చేసి ఉంటాం. ఎప్పటికప్పుడు వెతుక్కోవడం, ఆ తరువాత మరచిపోవడం మనకు అలవాటు. స్టంబుల్ అపాన్ అలా కాదు. మీరు గతంలో జరిపిన సెర్చ్‌ల హిస్టరీని గుర్తుంచుకుని ఆ అంశానికి సంబంధించిన సమాచారాన్ని అప్పుడప్పుడూ ఇస్తూంటుంది. అదే సమయంలో మనం కూడా ఏదైనా ఆసక్తికరమైన సమాచారాన్ని గుర్తించినప్పుడు ఆ లింక్‌లను వెబ్‌సైట్‌లో పోస్ట్ చేయవచ్చు. భారతీయ వినియోగదారులు ఎప్పటికప్పుడు పెరిగిపోతూండటం వల్ల ఈ వెబ్‌సైట్‌లో త్వరలోనే ఇదే తరహా కంటెంట్ కూడా పెరిగిపోతుందని అంచనా.
 
ప్రోగ్రామర్ల కోసం స్టాక్‌ఓవర్‌ఫ్లో...
 
ఇది ప్రోగ్రామర్లు పరస్పర సహకారం అందించుకునేందుకు ఏర్పాటు చేసుకున్న ఓ వేదిక. ప్రోగ్రామింగ్‌లో వచ్చే సమస్యలను ఇక్కడ పోస్ట్ చేస్తూంటారు. ఈ సమస్యలకు ఎవరు సరైన సమాధానం పోస్ట్ చేస్తారో వారికి ‘రెప్యుటేషన్ పాయింట్లు’ దక్కుతాయి. ఎవరికి ఎన్ని పాయింట్లు ఉంటే అంత పాపులర్ అన్నమాట. భారతీయ ఐటీ ఇంజినీర్లు ఈ వెబ్‌సైట్‌ను వాడటం ఎక్కువ కావడంతో మిగిలిన వినియోగదారులు పాపులారిటీ చార్ట్‌లో బాగా వెనుకబడి పోతున్నారట. సహజంగానే భారతీయ ఐటీ ఇంజినీర్లే ఈ వెబ్‌సైట్ టాప్‌లిస్ట్‌లో ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement