టైమ్‌పాస్ వెబ్‌సైట్లు... | Timepass websites ... | Sakshi
Sakshi News home page

టైమ్‌పాస్ వెబ్‌సైట్లు...

Published Wed, May 7 2014 11:06 PM | Last Updated on Thu, Jul 26 2018 5:21 PM

టైమ్‌పాస్ వెబ్‌సైట్లు... - Sakshi

టైమ్‌పాస్ వెబ్‌సైట్లు...

అనుకుంటాంగానీ... టైమ్‌పాస్ చేసేందుకు ఫేస్‌బుక్, ట్విటర్‌లను మించినవి ఇంటర్నెట్‌లో బోలెడున్నాయి. కళ్లముందు అలా అలా కదిలిపోయే కుక్కపిల్లలు... చిత్రవిచిత్రమైన ఆకారాలు... మౌస్‌తో కదులుతూ అడ్డూ ఆపు లేకుండా బోలెడంత సేపు వినోదాన్ని పంచేవి... ఇలా ఎన్నో రకాల వెబ్‌సైట్లతో ఆ బోరుకొట్టే క్షణాలను ఇట్టే గడిపేయవచ్చు. ఉన్న బోలెడింటిలో మచ్చుకు కొన్ని మీ కోసం...
 
 1. theuselessweb.com

 తెల్లటి హోంపేజీపై...‘నన్ను ఏదైనా ఓ చెత్త వెబ్‌సైట్‌కు తీసుకెళ్లు’ అన్న మెసేజ్ మాత్రమే ఉంటుంది. కింద క్లిక్ చేస్తే... ఒక్కోసారి ఒక్కో రకమైన వెబ్‌సైట్‌కు తీసుకెళుతుంది. ఎన్ని రకాలు ఉన్నాయో చూసుకునేలోపు నిమిషాలు గడిచిపోతాయి.
 
 2. staggeringbeauty.com


 నల్లటి గొట్టంలాంటి ఆకారం... మధ్యలో రెండు కళ్లు. అంతే ఈ వెబ్‌సైట్‌లో ఉండేది. మౌస్ కదలికలకు అనుగుణంగా ఈ ఆకారమూ కదులుతూ ఉంటుంది. కదిలిస్తూ.. కదిలిస్తూ అలసిపోవాల్సిందే!
 
 3. dontevenreply.com

 చిత్ర విచిత్రమైన ఈమెయిళ్లు, ప్రకటనలతో నిండి ఉంటుంది ఈ వెబ్‌సైట్. ఈ చెత్త మెయిళ్లలోనూ టాప్ రేటెడ్ కోసం ప్రత్యేకమైన సెక్షన్‌లు కూడా ఉన్నాయి దీంట్లో.
 
 4. shutupandtakemymoney.com

 చిత్ర విచిత్రమైన గాడ్జెట్‌లు అమ్మకానికి ఉంచిన వెబ్‌సైట్ ఇది. వీటిల్లో ఏవీ మనకు ఉపయోగపడవు కానీ... ఉంటే బాగుంటుందేమో అని అనిపించేలా ఉంటాయి వీటిల్లోని పరికరాలు. ఎన్ని ఉన్నాయో... అవి ఎలా పనిచేస్తాయో తెలుసుకుంటూ పోతే.. కాలం గడిచిపోతుందన్నమాట!
 
 5. onreadz.com

 టైమ్‌పాస్‌కు పుస్తకానికి మించిన స్నేహితుడు ఉండడని అంటారు. ఇది నిజం కూడా. ఈ వెబ్‌సైట్‌లోకి వెళితే.. కావాల్సినన్ని పుస్తకాలు ఈ బుక్ వెర్షన్‌లో అందుబాటులో ఉంటాయి. నచ్చినదాన్ని డౌన్‌లోడ్ చేసుకుని చదువుకుంటే సరి!
 
6. wolframalpha.com

 గూగుల్ కంటే కొంచెం భిన్నమైన సెర్చ్ ఇంజిన్ వెబ్‌సైట్ ఇది. రకరకాల అంశాల గురించి తెలుసుకోవాలనుకుంటే హోంపేజీలోని సెర్చ్ బాక్స్‌లో కీవర్డ్‌లను టైప్ చేయాలి. ఉదాహరణకు ఇండియా అని టైప్ చేస్తే... మనదేశానికి సంబంధించిన వివరాలు వివరంగా ప్రత్యక్షమవుతాయి.
 
 7. lizardpoint.com/geography/

 భూగోళ శాస్త్రం, గణితం వంటి సబ్జెక్ట్‌లతోపాటు పిల్లల కోసం ఆటలు కూడా ఉన్న వెబ్‌సైట్ ఇది. బ్రౌజర్ ఆధారిత లెర్నింగ్ యాక్టివిటీ ఈ వెబ్‌సైట్ ముఖ్య ఉద్దేశం. రకరకాల క్విజ్‌లు, గణితశాస్త్ర వర్క్‌షీట్లు ఉంటాయి దీంట్లో.
 
 8. weavesilk.com

 మీలో ఓ మంచి కళాకారుడు, చిత్రకారుడు ఉన్నాడని మీరు అనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం. ఈ వెబ్‌సైట్‌లోకి ఎంటరైపోండి. మౌస్‌ను అటు ఇటు కదిలించండి. మీ కల్లముందు అద్భుతమైన సిమెట్రిక్ చిత్రాలు ప్రత్యక్షమవుతాయి. వీటిని సేవ్ చేసుకోవచ్చు. షేర్ కూడా చేసుకోవచ్చు.
 
 9. freerice.com

 చిన్న చిన్న ప్రశ్నలతో కూడిన క్విజ్‌లు ఈ వెబ్‌సైట్‌లో ఉంటాయి. అయితే వీటికి సమాధానాలు చెప్పడం ద్వారా మిమ్మల్ని మీరు పరీక్షించుకోవడంతోపాటు ఇంకొకరికి ఉపకారం కూడా చేయవచ్చు. రిజిస్టర్ చేసుకుని లాగిన్ అవండి.. వేర్వేరు సబ్జెక్టుల క్విజ్‌లు ఆన్సర్ చేయండి. సరైన సమాధానం ఒక్కోదానికి పది గింజల బియ్యం బహుమతి. మీకు కాదండోయ్. పేదరికంతో మగ్గిపోతున్న వారికి ఈ బియ్యం అందిస్తామని అంటోంది వెబ్‌సైట్.!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement