దోమ, న్యూస్‌లైన్: అంగన్‌వాడీ కేంద్రాల పనివేళల్లో మార్పు చేస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇకపై ప్రభుత్వ పాఠశాలల మాదిరిగా అంగన్‌వాడీ కేంద్రాలు పూర్తి సమయం పనిచేయాల్సి ఉంటుంది. ఈ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను సైతం పెంచారు. కేంద్రం నుంచి వచ్చే 75శాతం నిధులు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 25శాతం నిధులతో నడుస్తున్న ఈ కేంద్రాలు ప్రస్తుతం ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు కొనసాగాయి. తాజా ఉత్తర్వుల ప్రకారం సాయంత్రం 4 గంటల వరకు పనిచేయాల్సి ఉంది.
పని వేళల్లో మార్పు చేసిన కారణంగా అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాల వేతనాలను కూడా స్వల్పంగా పెంచారు. ఇప్పటివరకు కార్యకర్తలకు ఇస్తున్న రూ.3,700 వేతనాన్ని రూ4,200కు, ఆయాల ఇస్తున్న రూ.1,950 వేతనాన్ని రూ.2,200కు పెంచారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 12 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో 2,500 వరకు అంగన్‌వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. పరిగి ప్రాజెక్టు పరిధిలో ఉన్న దోమ, కుల్కచర్ల, పరిగి, గండేడ్, పూడూరు మండలాల్లో మొత్తం 230 అంగన్‌వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేసేందుకు ఐసీడీఎస్ అధికారులు చర్యలను ప్రారంభించారు.
అదనపు పనులు
అంగన్‌వాడీ కేంద్రాల పని వేళల్లో మార్పులు చేసిన ప్రభుత్వం ఆయా కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు చేపడుతున్న పనులు, అందిస్తున్న సేవలలోనూ మార్పులు చేసింది. ఇప్పటివరకు అంగన్‌వాడీ కార్యకర్తలు చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యనందించడం, పౌష్టికాహారం సరఫరా చేయడం, బాలింతలు, గర్భిణులకు తగు సలహాలు, సూచనలు ఇవ్వడం, జనన, మరణాల సంఖ్యను నమోదు చేయడం, వ్యాధి నిరోధక టీకాలు వేయడం, ఏఎన్‌ఎంలతో కలిసి ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం, కుటుంబ వివరాల సేకరణ వంటి పనులు చేసేవారు.
ఇకపై వారు సామాజిక కార్యకలాపాలపై కూడా దృష్టి పెట్టాలని ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది. ఆయా గ్రామాల్లో మహిళలు సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో రాణించేందుకు వీలుగా అవసరమైన శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటుచేసే బాధ్యతను కూడా అంగన్‌వాడీ సిబ్బందికి అప్పగించింది. అంగ న్‌వాడీల ద్వారా ఇస్తున్న పౌష్టికాహార పంపిణీలోనూ కొంత మార్పు చేశారు. ఈ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు ఇప్పటివరకు వారానికి రెండు గుడ్లు ఇచ్చే వారు. ఇకపై వారానికి నాలుగు గుడ్లు ఇస్తారు.
అంగన్‌వాడీల ఆగ్రహం
పని వేళలను పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం నామమాత్రంగా వేతనాలు పెంచిన ప్రభుత్వం తమతో వెట్టి చేయించుకోవాలని చూస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం 4 గంటల వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ పని చేయమని తేల్చిచెబుతున్నారు. ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలనే డిమాండ్‌తో అంగన్‌వాడీలు ఆందోళనకు కూడా సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ఆదేశాలు జారీ చేశాం
అంగన్‌వాడీ కేంద్రాలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటలవరకు కొనసాగించాలని ప్రభుత్వం ఇటీవలే జీఓ నెం.24 జారీ చేసింది. మారిన పనివేళలకు అనుగుణంగా కొనసాగించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశాం. అయితే పలు కారణాలతో సిబ్బంది 4గంటల వరకు పనిచేయడానికి అంగీకరించడం లేదు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం.
- రాణి, అంగన్‌వాడీ సూపర్‌వైజర్, కుల్కచర్ల మండలం