వికారాబాద్: ఏడుగురు కూతుళ్ల తర్వాత పుట్టిన ఒక్కగానొక్క కుమారుడిని విద్యుత్ ప్రమాదం పొట్టన పెట్టుకున్న విషాదకర సంఘటన వికారాబాద్ జిల్లా దోమ పీఎస్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దతండాకు చెందిన నేనావత్ చందర్, జెమినీబాయి దంపతులకు ఏడుగురు కూతుళ్లు, ఒక కుమారుడు సంతానం. కూతుళ్ల వివాహాలను ఘనంగా చేసిన ఆయన.. అందరిలో చిన్నవాడైన కొడుకు రాము(22) పెళ్లి జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు.
ఇందులో భాగంగా బ్రాహ్మణపల్లిలో కుమారుడి కోసం నూతన గృహాన్ని నిర్మిస్తున్నాడు. ఈ క్రమంలో రాము ఇంటిపై ఉన్న స్టీల్‌రాడ్‌ను కిందికి తీసుకువస్తుండగా పైనున్న హైటెన్షన్ తీగలకు తగిలి విద్యుదాఘాతానికి గురయ్యాడు. క్షణాల్లో ప్రాణాలు విడిచి విగతజీవిగా పడిపోయాడు. చిన్ననాటి నుంచి అల్లారుముద్దుగా చూసుకుంటున్న తమ కుమారుడి మరణాన్ని తట్టుకోలేని చందర్ దంపతులు ఎంత పని చేశావ్ దేవుడా.. అంటూ కన్నీరుమున్నీరయ్యారు. పోస్టుమార్టం నిమిత్తం రాము మృతదేహాన్ని పరిగి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రవిగౌడ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment