Discussion Forum
-
బెయిల్ నిబంధనలు బేఖాతర్!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని కొందరు రాజకీయ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం న్యాయ వ్యవస్థను అభాసుపాల్జేస్తున్నారని పలువురు న్యాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనారోగ్య కారణాలతో కండిషనల్ బెయిల్‌పై వచ్చి న వ్యక్తి న్యాయస్థానం విధించిన నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించి విజయోత్సవాలు చేసుకోవడం ద్వారా ప్రజలకు తప్పుడు సంకేతాలిస్తున్నారని విమర్శించారు. ఇలాంటి వారు తప్పులు చేసి పట్టుబడినా చట్టాల నుంచి తప్పించుకునే మార్గాలను అన్వేషిన్నారని దుయ్యబట్టారు. ఇందుకు చంద్రబాబు విషయమే ఉదాహరణగా పేర్కొన్నారు. ‘చంద్రబాబు వ్యవహార శైలి– బెయిల్ నిబంధనల ఉల్లంఘన– శిక్షలు’ అంశంపై ఏపీ ఇంటిలెక్చువల్స్– సిటిజన్స్ ఫోరం(ఎపిక్) ఆధ్వర్యంలో చర్చ నిర్వహించారు. విజయవాడలో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు మేధావులు, న్యాయవాదులు పాల్గొని తమ అభిప్రాయాలు పంచుకున్నారు. బెయిల్ మంజూరు విషయంలో జాతీయ స్థాయిలో చర్చ జరగాలని, కోర్టు నిబంధనలను ఉల్లంఘిస్తే వెంటనే బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో ఓ వర్గం పెత్తందారి, నియంతృత్వ పోకడలకు పోతోందని, కోర్టులను, న్యాయమూర్తులపైనా ఆరోపణలు చేస్తోందన్నారు. చంద్రబాబు కేసులో తాము చెప్పినట్టుగా తీర్పు ఇవ్వాలంటూ బెదిరింపులకు దిగిన తీరు ఇటీవల కోర్టులో చూశామన్నారు. తీవ్ర నేరాలు చేసిన చంద్రబాబు, రామోజీరావులు తాము చట్టాలకతీతమన్నట్టుగా వ్యవహరిస్తూ.. వాటి నుంచి తప్పించుకునేందుకు యత్ని స్తున్నారని ధ్వజమెత్తారు. కోర్టులను బాబు మేనేజ్ చేస్తున్నారు తన రాజకీయ జీవితంలో కోర్టులను చంద్రబాబు మాత్రమే మేనేజ్ చేసినట్టు అనేక సందర్భాల్లో రుజువైంది. న్యాయస్థానాలు చట్ట ప్రకారం పనిచేస్తుంటే మాత్రం దు్రష్పచారం చేస్తున్నారు. చంద్రబాబు తీవ్రమైన ఆర్థిక నేరం కేసులో జైలుకు వెళితే.. తాము చేప్పినట్టు తీర్పు ఇవ్వలేదని ఆయన వర్గం వారు న్యాయమూర్తులపైనా తీవ్రమైన ఆరోపణలు చేశారు. చివరికి బెయిల్ రాకపోయేసరికి ‘అనారోగ్యం’ సాకుగా చూపారు. కోర్టు కండిషన్లు పెట్టి బెయిల్ మంజూరు చేసింది. జైలు నుంచి బయటికొచ్చాక ఆస్పత్రికో, ఇంటికో వెళ్లాల్సి చంద్రబాబు.. 14 గంటల పాటు ర్యాలీ చేశారు. ప్రసంగాలు చేశారు. ఇది పూర్తిగా బెయిల్ నిబంధనలు ఉల్లంఘించడమే. – విజయ్‌బాబు, ఎపిక్ ఫోరం వ్యవస్థాపకుడు ఇది పూర్తిగా న్యాయ ధిక్కరణే చంద్రబాబు కేసులో దాదాపు 53 రోజులు దేశంలో ప్రముఖ న్యాయవాదులు కేసును వాదించారు. చివరికి ‘వైద్యం’ పేరుతో అబద్ధం చెప్పి బెయిల్ తీసుకుని రాజకీయ ర్యాలీలు, ప్రసంగాలు చేశారు. ఇది పూర్తిగా న్యాయ ధిక్కరణ. ఆయన బెయిల్ రద్దు చేయాలి. లేకుంటే తప్పు చేసిన ప్రతి ఒక్కరూ ఇలాగే బయటకొచ్చే అవకాశం ఉంది. – పిళ్లా రవి, న్యాయవాది న్యాయ వ్యవస్థలో ఏం లోపాలు ఉన్నాయో పురందేశ్వరి చెప్పాలి పురందేశ్వరి, టీడీపీ నాయకులు న్యాయ వ్యవస్థపైనా, న్యాయమూర్తులపైనా తీవ్ర ఆరోపణలు చేశారు. గతంలో వారు బెయిళ్లు తెచ్చుకున్నప్పుడు.. ఇప్పుడు అవే చట్టాలు. తనకు అనుకూలంగా బెయిళ్లు వచ్చినప్పుడు చట్టం తనపని చేసుకుపోతుందన్నారు, ఇప్పుడేమో మేనేజ్ చేస్తున్నారంటున్నారు. చంద్రబాబు ఆరి్థక నేరాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. న్యాయ వ్యవస్థలో ఏం లోపాలున్నాయో పురందేశ్వరి చెప్పాలి. – విఠల్‌రావు, న్యాయవాది బెయిల్ నిబంధనలపై చర్చ అవసరం దేశంలో రూల్ ఆఫ్ లా సరిగా అమలు కావడం లేదు. ఏదైనా కేసులో అండర్ ట్రైల్ కింద జైలుకు వెళ్లిన వారు బెయిల్ కోసం అప్లై చేసుకోవడం వారి హక్కు. కానీ ఇక్కడ అందరికీ ఈ హక్కు లభించడం లేదు. వ్యవస్థలను మేనేజ్ చేసుకునేవారికి, ఆర్థికంగా శక్తిమంతమైన వారికి సులభంగా బెయిల్ వచ్చేస్తోంది. కానీ చాలామంది సామాన్యులు అండర్ ట్రైల్‌లోనే ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గిపోతున్నారు. బెయిల్ మంజూరుపై సుప్రీంకోర్టు న్యాయ సమీక్ష చేయాలి. ప్రభుత్వంలో ఉండి ఆరి్థక నేరాలకు పాల్పడిన వారికి బెయిల్ ఇవ్వకూడదు. – కృష్ణంరాజు, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పురందేశ్వరి టీడీపీలో పదవి ఆశిస్తున్నట్టున్నారు.. చంద్రబాబు సీఎంగా 2014–19 మధ్య చట్టాలను యథేచ్ఛగా ఉల్లంఘించారు. ఇప్పుడు దొరికిపోయాక అరెస్టు నుంచి బెయిల్ వరకు చట్టాలను ఉల్లంఘించారు. చివరికి న్యాయమూర్తులపైనా ఆరోపణలు చేస్తున్నారు. మెడికల్ కండిషన్‌పై బెయిల్ తెచ్చుకుని నిబంధనలు ఉల్లంఘించారు. పురందేశ్వరికి ఇవన్నీ కనిపించడం లేదా? ఆమె బీజేపీ పదవి కంటే టీడీపీ పదవి ఆశిస్తున్నట్టు కనిపిస్తోంది. – సాయిరామ్, అడ్వకేట్ వారికి చట్టాలంటే గౌరవం లేదు ఒకరు నేరం చేశారని కేసు నమోదైతే కింది కోర్టులో తీర్పు వెలువడ్డాక పైకోర్టులకు వెళతారు. కానీ చంద్రబాబు కేసులో మాత్రం అందుకు విరుద్ధం. చేసిన నేరం నుంచి బయటపడేందుకు కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు పిటిషన్లు వేశారంటే జరిగింది ఎంత పెద్ద నేరమో అర్థం చేసుకోవచ్చు. పైగా వ్యవస్థను ఎలా మేనేజ్ చేయాలో తెలిసినవారే ఇలా చేస్తారు. ఈ కేసులో చంద్రబాబు వర్గానికి చట్టాలు, న్యాయస్థానాలు, న్యాయమూర్తులపై గౌరవం లేదు. యథేచ్ఛగా చట్టాలను ఉల్లఘించారు. – నరహరిశెట్టి శ్రీహరి, హైకోర్టు న్యాయవాది బాబుకు స్టేలు ఇచ్చి నంత కాలం న్యాయస్థానాలు మంచివయ్యాయి.. సామాన్యులు బెయిల్ రాకుండా అండర్ ట్రైల్‌లోనే ఉండిపోతున్నారు. కానీ చంద్రబాబు, రామోజీరావులు కోర్టు మెట్లు ఎక్కకుండానే బెయిల్ తెచ్చుకుంటున్నారు. స్కిల్ స్కాం తప్ప మరే కేసులోను బాబు కోర్టుకు, జైలుకు వెళ్లింది లేదు. తనకు స్టేలు ఇచ్చి నంత కాలం న్యాయస్థానాలు మంచివే అన్నారు, ఈ ఒక్క కేసులో బెయిల్ రాకపోయేసరికి ఆరోపణలు చేస్తున్నారు. బెయిల్ నిబంధనలపై న్యాయ సమీక్ష అవసరం – ధనలక్ష్మి, న్యాయవాది అబద్ధాలు చెప్పి బయటికొచ్చారు చంద్రబాబుకు వైద్యం కోసం కోర్టు బెయిల్ ఇచ్చి ంది. బయట ప్రసంగాలు చేయొద్దని చెప్పింది. కానీ బాబు మాత్రం తన హక్కును కాపాడిన కోర్టు హక్కులనూ కాలరాశారు. అబద్ధం చెప్పి బయటకు వచ్చి ర్యాలీలు చేశారు. – ఎన్.జ్యోతి, న్యాయవాది రోజుకో రోగమని చెప్పారు.. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు రోజుకో రోగమని చెప్పారు. వైద్యం కోసం బెయిల్ తెచ్చుకుని బయటికి రాగానే ర్యాలీలు చేశారు. బాబు అరెస్ట్ సమయంలోనూ ఇలాగే ప్రవర్తించారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి ప్రమాదం. – జె.జయలక్ష్మి, న్యాయవాది ఇలాంటి చర్యలను న్యాయస్థానాలు గమనించాలి చంద్రబాబు అన్ని రకాల బెయిళ్లకు అప్లై చేసి, ఏదీ రాకపోయేసరికి ‘అనారోగ్యాన్ని’ అడ్డుపెట్టుకుని బయటపడ్డారు. జైలు నుంచి విడుదలయ్యాక ఆస్పత్రికి వెళ్లాల్సింది పోయి.. రాజకీయ ర్యాలీలు చేశారు. న్యాయస్థానాలు ఇలాంటివి గమనించాలి. – ఉషాజ్యోతి, న్యాయవాది -
ఈ కాలమ్ మీదే : చర్చా వేదిక
గోవు మాలక్ష్మికి కోటి దండాలు! మా ఇంటి గేటును ఆనుకొని రోడ్డుపై రెండు పెద్ద కానుగ చెట్లు ఉన్నాయి. ఎక్కడి నుంచి వస్తాయో, ఎవరికి చెందినవో తెలియదు కానీ, తెల్లవారేటప్పటికీ డజన్ల సంఖ్యలో ఆవులు, గిత్తలు, దూడలు గుంపులుగా ఈ చెట్లక్రింద చేరుతాయి. ఒక్క మా వీధిలోనే కాదు, ఎక్కడ పడితే అక్కడ ఊరంతా ఇదే తంతు. మనం విధించుకున్న ట్రాఫిక్ ఆంక్షల గురించి వాటికి తెలియదు. రోడ్డుకు మధ్యలో కొన్ని నిలబడతాయి. ఎక్కువ రద్దీ ఉండే ప్రాంతంలో ఇలా జరగడం వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలిగి ఎంతో మంది రూట్ మార్చుకొని వారి గమ్యస్థానానికి వెళ్లాల్సి వస్తుంది.వాటిని గట్టిగా అదిలిస్తే పక్కకు తప్పుకుంటాయి. కానీ ఎవరూ ఆ పని చేయరు. ఎందుకంటే ‘గోమాత’ కదా! ఇటువంటి మూఢత్వం వల్ల వాటికి ఎన్నోసార్లు ప్రమాదాలు కూడా జరిగాయి. కొందరైతే ఈ ఆవులకి తోక మొదలుకొని పసుపుకుంకాలతో బొట్లుపెట్టి, కొండొకచో దాని మూత్రాన్ని శిరస్సుపై చల్లుకొని తమ భక్తి ప్రపత్తులు చాటుకుంటారు. ఇక్కడ విచిత్రమేమిటంటే గోమూత్రం ఔషధగుణాలతో ఉంటుంది కాబట్టి ఆ పని చేసాం అంటారు. కానీ దాని నోటికి మాత్రం కాసింత పచ్చగడ్డో, పండో కాయో తోచినది ఏదైనా పెట్టాలనుకోరు. వాటి యజమానులు ఎవరో, ఎక్కడ ఉంటారో ఎవరికి తెలియదు. తెల్లవారేటప్పటికి వాటిని రోడ్లపైకి వదిలి చేతులు దులుపుకుంటారు. ఆవులు మాత్రం బక్కచిక్కి, ఎవరైనా తినడానికి ఏమైనా పెడతారేమో అని దీనంగా చూస్తుంటాయి. వాటికి మనం ప్రత్యేకంగా వండి పెట్టనక్కర్లేదు. మనం తరిగిన కూరగాయల తొక్కలు, మాగిన పండ్లు.. ఇవి వేసినా వాటిని అవి ఎంతో తృప్తిగా తింటాయి. ఎవరు వాటికి తిండి పెడతారో ఆ ఇంటి గుమ్మం వదలదు కాబట్టి ..గోవుల యాజమానుల్లారా! మీ పశువులను రక్షిత ప్రదేశాలలో కట్టి వాటికి కాసింత నీడ, నీళ్లు, గడ్డి మీకున్నంతలో ఏర్పాటు చేయండి. అంతేకానీ రోడ్లపైకి వదిలి వాటికి, ప్రజలకీ ప్రమాదాలు కొని తేకండి.వాటిని పోషించే స్థోమత లేనప్పుడు ఏదైనా గోశాలకి వాటిని ఇచ్చి వాటి పోషణార్థం మీకు కలిగినది నిర్వాహకులకి ఇవ్వండి. - దుర్గాసూరి, పాతపేట, నూజివీడు, కృష్ణాజిల్లా. డొల్లతనాన్ని ప్రశ్నిస్తోంది! ఢిల్లీ ఉదంతం తర్వాత ఉరికెక్కించే చట్టాలొచ్చాయి కదా అని మగాడు ఊరికే లేడు. ఆ తర్వాత దేశ రాజధాని ఢిల్లీ సహా 11 మహా నగరాల్లో ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన సర్వేలో మగాళ్లలో మార్పు మేడిపండు చందమేనని రుజువైంది. మహిళల వస్త్రధారణ పురుషులను రెచ్చగొట్టేవిధంగా ఉంటుందని.. అది అనివార్యంగా స్త్రీలపట్ల హింసాత్మకంగా మారుతోందని 60 శాతం మంది విద్యార్థులు అభిప్రాయపడడం దేనికి సంకేతం? మన పిల్లల పాఠ్యాంశాలు(కరిక్యులమ్) లింగవివక్షను రూపుమాపే, మానవీయ విలువలు గల పౌరులుగా తీర్చిదిద్దే విధంగా లేవన్నది నిజం. ఇండియా డాటర్‌తో దేశం పరువుపోతోందంటున్నవారు.. మన సినిమాలు (కొన్ని మినహా) ప్రజలకు ఏం ప్రబోధిస్తున్నాయో ఆలోచించారా? కామెడీ పేరుతో వావివరసలు మరచి డైలాగులు. ఇక రేప్‌లలో వైవిధ్యం.. పరాకాష్టకు చేరిన హింస.. నానాటికీ తీసికట్టుగా హీరోయిన్ల వస్త్రధారణ.. టీచర్, స్టూడెంట్ బాంధవ్యాన్ని అధమావస్థకు చేర్చిన వైనం.. ఏ సంస్కృతికి చిహ్నాలు? దేశంలోని పేదరికంపైనా, మురికివాడలపైనా బయటి వ్యక్తులు సినిమాలు తీసి అంతర్జాతీయ స్థాయిలో పరువు తీస్తున్నారని గగ్గోలు పెడతారు. కానీ ద్వంద్వార్థ సినిమాలతో హిట్లుకొట్టిన కొందరు హీరోలు రాజ్యసభసభ్యులు, మంత్రులు కూడా అయ్యారు. వీళ్ల అనేక సినిమాల్లో కథానాయిక ఓ ఆటబొమ్మ? అశ్రుధారాపాతం.. ఇండియా డాటర్! ఈ డాక్యుమెంటరీ చూసి ఒక్క కన్నీటి చుక్కైనా రాలకుంటే ముఖేష్‌కు మనకు తేడా లేనట్టే! ఈ కేసులో నిందితుల తరఫున డిఫెన్స్లాయర్లమైనట్టే!! ఎందువలనంటే.. ఇందులో జ్యోతి గురించి ఆమె తల్లితండ్రులు, ఆమె ట్యూటర్ చెప్పిన విషయాలు మనల్ని చకితుల్ని చేస్తాయి. వివశుల్ని చేస్తాయి.. అప్రయత్నంగా మన కళ్లు చెమ్మగిల్లక మానవు. ఆమె నిండైన వ్యక్తిత్వం, సంస్కరణాభిలాష మనల్ని సిగ్గుపడేలా చేస్తాయి. ముఖ్యంగా ఆ తల్లి పడుతున్న వేదన మనల్ని నిలువనీయదు. అలాగే నిందితుల కుటుంబాల దుర్భర దారిద్య్రం.. వారి దీనస్థితి పట్ల సానుభూతి కలగక మానదు. లేశమైనా పశ్చాత్తాపం కనిపించని ముఖంతో ముఖేష్, నిందితుల తరఫున వాదించిన లాయర్ల తిరోగమన ఆలోచనాధోరణి.. అసహ్యాన్నీ, ఆగ్రహాన్ని కలిగిస్తాయి. ఇండియాడాటర్ మనకు నేర్పుతోంది అవకాశవాదం కాదు. ఆమె లొంగలేదు. లొంగదీసుకున్నారు. నిబిడాకాశం నివ్వెరపోయేలా ఆమె ప్రతిఘటించింది. ఆ రాత్రి హెల్ప్‌మీ.. హెల్ప్‌మీ.. అని ఆమె అర్థించింది.. తనను రక్షించమని కాదు. దురాలోచనలతో, దుర్లక్షణాలతో కుళ్లికంపుకొడుతున్న సమస్త మానవజాతినీ కాపాడమని! మన విలువలు, ఆలోచనల్లోని డొల్లతనాన్ని ప్రశ్నిస్తోంది ఇండియా డాటర్ !! - ఎం.జి.నజీర్, హైదరాబాద్ ఉద్యమకారులు బయలుదేరాలి! తెలుగు రాష్ట్రాల్లోని ఆంగ్లమాధ్యమ పాఠాశాలల్లో విద్యార్థులు తెలుగులో మాట్లాడితే తప్పెందుకో ఆ పాఠాశాల యాజమాన్యులే సమాధానం చెప్పాలి. కర్నాటక, తమిళనాడుతో పాటు మిగిలిన రాష్ట్రాల ఆంగ్లపాఠశాలల్లోనూ ఇలాంటి నిబంధనలు ఉన్నాయా? అంటే లేవనే చెప్పాలి. మరి మన తెలుగు రాష్ట్రాల్లోనే ఈ ప్రకటిత, అప్రకటిత నిబంధనలు ఎందుకు? ప్రభుత్వం కన్నడ భాష అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేయకపోయిన అక్కడి కన్నడ సంఘాలు తమిళనాడును ఆదర్శంగా తీసుకొని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి కన్నడ భాషను అభివృద్ధి చేసుకుంటున్నాయి. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వంతో పాటు ప్రజలదీ ఒకే బాట. తెలుగు భాష పట్ల నిర్లక్ష్యం! తెలుగు భాషకు పూర్వవైభవం రావాలంటే ఒకటే మార్గం.... తెలుగు భాషాభిమానుల నుంచి ఉద్యమకారులు బయలుదేరాలి. తెలుగు భాష అభివృద్ధికి నిర్దిష్టమైన విధానాన్ని అమలు పరిచేలా కృషి చేయాలి. - ఆర్.శ్రీనివాస్, సింగసంద్ర, బెంగళూరు పాఠకులకు ఆహ్వానం ‘ఈ కాలమ్ మీదే’ అనే ఈ చర్చావేదికలో పాల్గొనండి. చర్చనీయాంశం మీ ఇష్టం. ఏ సామాజిక అంశాన్నయినా, ఆలోచననైనా మీరు చర్చకు పెట్టొచ్చు. మీ వాదనను వినిపించవచ్చు. దానిపై మిగతా పాఠకులనూ చర్చకు ఆహ్వానిస్తుంది సాక్షి ఫ్యామిలీ. వీటిని ప్రతి సోమవారం ప్రచురిస్తుంది. వెంటనే రాసి పంపండి. మీ చర్చనీయాంశం పంపవలసిన చిరునామా: ‘ఈ కాలమ్ మీదే’ సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 ఇ-మెయిల్: sakshireaders@gmail.com -
ఈ కాలమ్ మీదే : చర్చా వేదిక
ర్యాంకులు ముఖ్యం కాదు... నేను గత ఇరవై సంవత్సరాలుగా స్కూల్ నడుపుతున్నాను. ఎందరో తల్లిదండ్రులు వారి ఆలోచనలను నాతో పంచుకుంటూ ఉంటారు. బాధాకరమైన విషయం ఏమిటంటే, అందరూ మాట్లాడేది మార్కులు, ర్యాంకుల గురించే. ‘పిల్లలు పరిపూర్ణమైన వ్యక్తిత్వాన్ని పెంపొందించుకుంటున్నారా?’ ‘జీవితంలో ఎదురయ్యే సమస్యలను తట్టుకునే విధంగా ఎదుగుతున్నారా?’ ‘తోటివారితో కలిసి మెలసి ఉంటున్నారా?’ ‘ఆడా, మగా సమానమనే భావాన్ని కలిగి ఉన్నారా?’ ... ఇలాంటి వాటి గురించి ఎవరూ అడగడం లేదు. ర్యాంకుల కంటే జీవితాన్ని గెలవగలిగేలా తయారుచేసేదే నిజమైన విద్య. అప్పుడే ఆత్యన్యూనత అనేది దూరంగా పారిపోతుంది. నిజమైన జ్ఞానంతో మనిషి ప్రకాశిస్తూ లోకకళ్యాణానికి దోహదం చేయగలుగుతాడు. తల్లిదండ్రులు ఆ దిశగా ఆలోచించాలని కోరుకుంటున్నాను. - కాసర లక్ష్మిసరోజారెడ్డి, జంగారెడ్డి గూడెం, పశ్చిమగోదావరి. అది ప్రయివేట్ విషయం ఎలా అవుతుంది?! నూజివీడు నుంచి ఒక పాఠకుడు ‘అయ్యో పాపం... తులసీ’ అనే హెడ్డింగ్‌తో రాసిన ఉత్తరాన్ని చదివిన తరువాత చాలా బాధ కలిగింది. ‘చెట్లను కాపాడండి... అవి మనల్ని కాపాడుతాయి’ అనే మాటను మరిచిపోతున్నారు. ‘చెట్లను కాపాడడం వల్ల మనకు వచ్చే లాభం ఏమిటి? కొట్టేస్తే అనేక లాభాలు ఉన్నాయిగానీ..’’ అని తాత్కాలిక లాభాల గురించి స్వార్థపూరితంగా ఆలోచిస్తున్నారు తప్ప వేరే రకంగా ఆలోచించడం లేదు. ఇంట్లో ఫర్నీచర్ చేయించుకోవడానికి మా ఇంటి పక్కాయన కూలీలను నియమించి చెట్టును కొట్టేయిస్తున్నాడు. ‘‘అదేంటయ్యా... ఆ చెట్టు ఏం పాపం చేసింది?’’ అన్నాను కాస్త కోపంగా. ‘‘ఫర్నీచర్ చేయించుకోవాలి’’ అని తాపీగా ఒక్క ముక్కలో చెప్పాడు. ‘‘ఫర్నీచర్ కోసం చెట్టు కొట్టేయడం తప్పు కదా!’’ అన్నాను. ‘‘తప్పు ఒప్పుల గురించి మాట్లాడడానికి నువ్వెవరు? ఇది మా సొంత విషయం’’ అని నాతో తగాదా పడ్డాడు ఆ పుణ్యాత్ముడు. నేను షాక్ అయ్యాను! చెట్లను నరకడం అనేది ప్రయివేట్ విషయమా?! కఠిన చట్టాలు లేకపోవడం వల్ల, ఉన్న చట్టాలు కూడా చప్పగా ఉండడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. దేవుడి కోసం వందలు, వేలు ఖర్చు చేయనక్కర్లేదు. మన బాధ్యతను మనం సక్రమంగా నిర్వహిస్తే చాలు... దేవుడే న్యాయం చేస్తాడు. నిజానికి చెట్లు అనేవి మనకు కనిపించే ప్రత్యక్షదైవాల్లాంటివి. నిలవ నీడను ఇచ్చే చెట్ల పట్ల అమానుషంగా ప్రవర్తించడం ఏ రకంగానూ సమంజసం కాదు. క్రూరమైన జంతువులు కూడా ఇలాంటి క్రూరమైన పనులు చేయవు. - జి.ప్రభాకర్, కనపర్తి, వరంగల్ జిల్లా. చెట్లను నిర్లక్ష్యం చేస్తే... గత వారం ప్రచురించిన ‘అయ్యో పాపం తులసీ’ ఉత్తరం, ‘పీకే’ సినిమాపై వచ్చిన ఉత్తరాలు చదివాక ఇది రాయాలనిపించింది. నిజానికి రెండిటికీ సంబంధం ఉంది. భక్తి అనేది వాణిజ్యపరం కావడాన్ని గురించి ‘పీకే’ సినిమాలో ప్రశ్నించారు. బయట పరిస్థితి కూడా అలా ఉందనే విషయం ‘అయ్యో పాపం తులసీ’ ఉత్తరం చెప్పకనే చెప్పింది. ‘దేవుడిని మొక్కుకుంటే చాలు... ఇక మిగతా విషయాలను గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు’ అనే భావన పెరిగిపోతుంది. ఇతరులతో మర్యాదగా వ్యవహరించడం, పర్యావరణ స్పృహ కలిగి ఉండడం, నైతిక విలువలతో ప్రవర్తించడం... ఇవి కూడా భక్తిశ్రద్ధలతో చూడాల్సిన విషయాలు. ‘దేవుడు అన్నిచోట్ల ఉంటాడు’ అంటుంటారు. మనం మనసు పెట్టి చూడాలేగానీ... చెట్టులో కూడా దైవం ఉంది. చెట్టును నిర్లక్ష్యం చేస్తే దైవాన్ని నిర్లక్ష్యం చేసినట్లే కదా!! - ఆర్.శ్యాంసుందర్, శ్రీకాకుళం పైపై చర్యల వల్ల ప్రయోజనం ఉండదు ‘స్వచ్ఛభారత్’ మంచి కార్యక్రమమేగానీ ‘నామ్‌కే స్వచ్ఛభారత్’గా మారింది. ఒకరోజు శుభ్రం చేయడం, ఫొటోలకు పోజులు ఇవ్వడం వల్ల ‘స్వచ్ఛభారత్’ రాదు. పై పై చర్యల వల్ల ప్రయోజనం ఉండదు. సమస్య మూలాన్ని గుర్తించి దాన్ని నిర్మూలించడం వల్లే ఫలితం ఉంటుంది. - సొల్లేటి కొండల్రావు, పామూరు, ప్రకాశం జిల్లా. చిత్తశుద్ధి లేని చెత్తశుద్ధి ఏల? స్వచ్ఛభారత్ కార్యక్రమం ‘ఫొటో సెషన్’ కార్యక్రమంగా మారిందా? అనిపిస్తుంది. ఒక పని చేస్తే చిత్తశుద్ధితో చేయాలి. లేదంటే చేయకూడదు. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో చాలామంది మొక్కుబడిగా పాల్గొంటున్నారు. స్వచ్ఛభారత్ అనేది ప్రభుత్వ కార్యక్రమం కాదు... అది మన కార్యక్రమం అనుకున్నరోజు ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది. చెత్తశుద్ధి చేయడానికే ఎక్కడెక్కడికో వెళ్లనక్కర్లేదు. ఎవరి ఇంటి దగ్గర వాళ్లు, ఎవరు ఆఫీసు దగ్గర వాళ్లు, ఎవరి కాలేజీల దగ్గర వాళ్లు చెత్తను శుభ్రం చేస్తే మంచిది. ప్రచారానికి వెచ్చించే డబ్బును శుభ్రతకు ప్రాధాన్యత ఇచ్చే గ్రామాలు, వీధులకు ప్రోత్సాహక బహుమతిగా ఇస్తే మంచిది. - సి.ప్రతాప్, మధిర పాఠకులకు ఆహ్వానం ‘ఈ కాలమ్ మీదే’ అనే ఈ చర్చావేదికలో పాల్గొనండి. చర్చనీయాంశం మీ ఇష్టం. ఏ సామాజిక అంశాన్నయినా, ఆలోచననైనా మీరు చర్చకు పెట్టొచ్చు. మీ వాదనను వినిపించవచ్చు. దానిపై మిగతా పాఠకులనూ చర్చకు ఆహ్వానిస్తుంది సాక్షి ఫ్యామిలీ. వీటిని ప్రతి సోమవారం ప్రచురిస్తుంది. వెంటనే రాసి పంపండి. మీ చర్చనీయాంశం పంపవలసిన చిరునామా: ‘ఈ కాలమ్ మీదే’ సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 ఇ-మెయిల్: sakshireaders@gmail.com -
ఈ కాలమ్ మీదే: చర్చా వేదిక
అయ్యో పాపం... తులసి మొక్క! మా ఊళ్లో ఒక పురాతనమైన శివాలయం ఉంది. ఆవరణలోనే ఒక వారగా తులసి మొక్క ఒకటి ఉంది. ఆరోజు కార్తీకమాసం కావడంతో అందరిలాగే స్వామి దర్శనం కోసం నేను కూడా శివాలయానికి వెళ్లాను. అక్కడి దృశ్యం నన్ను విస్మయానికి గురి చేసింది. తులసి మొక్క చుట్టూ సుమారు ఇరవై, ముప్పై దీపాలు దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నాయి. అక్కడ ఉన్న భక్తులు, తులసి మొక్కపై పసుపు, కుంకాలు, పుష్పాలు పోటాపోటీగా చల్లి పూజలు చేస్తున్నారు. పసుపు కుంకాలతో ముంచెత్తబడిన ఆ తులసి మొక్క రంగు మారి దీనంగా కనిపించింది. చిత్రమేమిటంటే ఎవరూ కూడా ఆ మొక్కకు చెంబెడు నీళ్లు పోయాలని అనుకోవడం లేదు. నీరు లేకపోతే మొక్క బతకదు అనే విషయం పామరుడికి కూడా తెలుసు. అక్కడికి వచ్చిన వాళ్లలో చదువుకున్నవాళ్లు, లోకజ్ఞానం ఉన్నవాళ్లు ఉన్నారు. ఎవరూ కూడా ఆ విషయం గురించి ఆలోచించే స్థితిలో లేరు భక్తి పారవశ్యంలో మునిగి. చేరువలోనే ఉన్న రాతి శివలింగానికి మాత్రం చేతిపంపు దగ్గర నీటిని శుభ్రమైన పాత్రలలో పట్టి తెచ్చి అభిషేకం చేస్తున్నారు. నీటి అవసరం ఉన్న మొక్కకి నీరు పోయకుండా, నీరు లేకపోయినా అస్తిత్వం కోల్పోని శివలింగానికి మాత్రం కడవలతో నీరు గుమ్మరిస్తున్నారు! నా వంతు బాధ్యతగా చేతిపంపు దగ్గర నీటిని ఒక లోటాతో పట్టి తులసి మొక్కకు కరువు తీరా పోశాను. దాహంతో ఉన్న మనిషికి గుక్కెడు నీళ్లు పోస్తే ఎలా ఆనందిస్తాడో, అదే భావం ఆ మొక్కలో కనిపించింది నాకు. హాయిగా ఆ మొక్క కదులుతూ ఉంటే... శివుడు, తులసిమాత ఇద్దరూ నన్ను ఆశీర్వదిస్తున్నట్లే అనిపించింది నాకు. తులసి మొక్కని పసుపు కుంకాలతో పూజించి, దీపాలు పెట్టగానే పని అయిపోయినట్లు కాదు. అన్ని మొక్కల్లాగే తులసి కూడా ఒక మొక్కే! కాస్త ఔషధ గుణాలు ఎక్కువ. దానికీ నీరు కావాలి. పసుపుకుంకాలతో అర్చించే బదులు దానికి చెంబెడు నీళ్లు పోస్తే వచ్చే పుణ్యం ఎక్కువ. - దుర్గాసూరి, పాతపేట, నూజివీడు, కృష్ణా జిల్లా. కార్యాచరణ మొదలు కావాలి... బాధ పడుతూ కూర్చోవడం కంటే కార్యాచరణ అనేది ముఖ్యమైనది. అప్పుడే తెలుగు భాషను రక్షించుకోగలుగుతాము. ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన ఉత్తరప్రత్యుత్తరాలు, న్యాయస్థానాలలో తీర్పులు, బోర్డులు, సూచికలు... మొదలైనవి తెలుగు భాషలో ఉండాలి. పాఠశాలల్లో నీతిశతకాలను చదవడం తప్పనిసరి చేయాలి. పెద్దబాల శిక్షను ప్రవేశ పెట్టాలి. తెలుగును చిన్నచూపు చూసే, అవమానించే విద్యాలయాలపై కఠిన చర్యలు తీసుకోవాలి. మరోవైపు... తల్లిదండ్రులు తమ పిల్లలను తెలుగు భాషపై అభిమానం కలిగించే రీతిలో ప్రోత్సహించాలి. ఉద్యోగావకాశాల్లోనూ తెలుగులో చదువుకున్న వారికి ప్రాముఖ్యత ఇవ్వాలి. - టి.అప్పలస్వామి, విశ్రాంత తెలుగు ఉపాధ్యాయులు, గజపతినగరం, విజయనగరం జిల్లా. ఇలా అయితే... ఎలా?! గత వారం ప్రచురించిన అశోక్, విజయవాడ రాసిన ఉత్తరాన్ని చదివి ఇది రాస్తున్నాను. ‘మన సినిమాల్లో మంచి సినిమాలు ఎన్ని?’ అని ప్రశ్నించుకుంటే వేళ్ల మీద లెక్కపెట్టుకోవడం కూడా కష్టమే. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో గొప్ప సినిమాలు వస్తున్నాయి. వాటితో పోల్చితే మన సినిమా ఎక్కడో ఉంటుంది. ఇది నిజంగా దురదృష్టకరమైన విషయం. ఎప్పుడోగానీ మంచి సినిమాలు రావడం లేదు. అలా వచ్చిన సినిమాలను ఆదరించాలి తప్ప ప్రతీది భూతద్దంలో చూసి విమర్శించడం తగదు. ‘పీకె’ అనేది చాలా మంచి సినిమా. మన వ్యవస్థలోని తప్పుడు విధానాలను బయట పెట్టిన సినిమా. ‘బాబాల బండారం’ గురించి తొలిసారిగా చెప్పింది ‘పీకె’ సినిమా మాత్రమే కాదు... అంతకుముందు కూడా ఎన్నో సినిమాలు వచ్చాయి. ఫక్తు కమర్షియల్ సినిమా అయిన ‘ఆఖరి పోరాటం’ సినిమాలో కూడా బాబాల గురించి ఉంది. అమ్రిష్‌పురి పాత్రను ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే సరి. వివాదం వల్లే సినిమా హిట్ అయిందని అశోక్ అంటున్న మాటలు చాలా అమాయకంగా ఉన్నాయి. ఈ లెక్కన వివాదాస్పదమైన ప్రతీ సినిమా హిట్ కావాలి. ఇక దర్శకులు, రచయితలు ‘కథ’ గురించి ఆలోచించనక్కర్లేదు. ‘వివాదం’ గురించి ఆలోచిస్తే సరిపోతుంది! ముగింపుగా... నేను చెప్పే ముఖ్యమైన విషయం ఏమిటంటే, అరుదుగా వచ్చే సినిమాలను గురించి గొప్పగా మాట్లాడకున్నా ఫరవాలేదు. కానీ... నిరాశపరిచేలా మాత్రం మాట్లాడకండి! - సి.రజిత, గోదావరిఖని, కరీంగనర్. జాలి, భయం కలుగుతున్నాయి! నేటి యువతను చూస్తే, జాలితో పాటు భయం వేస్తోంది. చిన్న చిన్న కారణాలకే ఇంటి నుంచి పారిపోతున్నారు. ఆత్యహత్యప్రయత్నాలు చేస్తున్నారు. మా ఇంటి పక్కన ఉండే వాళ్లు పేదవాళ్లు. వాళ్ల అబ్బాయి ఇంజనీరింగ్ చదువుతున్నాడు. తను ఇంజనీరింగ్‌లో రెండు సబ్జెక్ట్‌లు ఫెయిలయ్యాడు. ఫ్రెండ్స్ అవమానం చేస్తారని, తల్లిదండ్రులు తిడతారని భయపడి యాసిడ్ తాగాడు. చనిపోలేదుగానీ నోటి లోపల చాలా దెబ్బతింది. ‘‘ఎంతో కష్టపడి చదివిస్తే... ఇలా చేశాడు’’ అని తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. కేవలం అతడు మాత్రమే కాదు... ఈ తరంలో చాలా మంది యువకులు నెగటివ్‌గా ఆలోచిస్తున్నారు. నెగిటివ్‌గా కాకుండా పాజిటివ్‌గా ఆలోచించే శక్తి రావాలంటే, మంచి మంచి కథలు, నవలలు, జీవిత చరిత్రలు చదవాలి. దీనివల్ల ‘సానుకూల ఆలోచనశక్తి’ పెరుగుతుంది. ఫేస్‌బుక్‌లోనో, ట్విటర్‌లోనో సమయాన్ని వృథా చేయకుండా, ఆ సమయాన్ని పుస్తకాలు చదవడానికో, సేవ చేయడానికో, ధ్యానం చేయడానికో ఉపయోగిస్తే యువత అభివృద్ధి చెంది దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుంది. - ఆవులపాటి ఉమామహేష్, హుజూర్నగర్, నల్గొండ జిల్లా. పాఠకులకు ఆహ్వానం ‘ఈ కాలమ్ మీదే’ అనే ఈ చర్చావేదికలో పాల్గొనండి. చర్చనీయాంశం మీ ఇష్టం. ఏ సామాజిక అంశాన్నయినా, ఆలోచననైనా మీరు చర్చకు పెట్టొచ్చు. మీ వాదనను వినిపించవచ్చు. దానిపై మిగతా పాఠకులనూ చర్చకు ఆహ్వానిస్తుంది సాక్షి ఫ్యామిలీ. వీటిని ప్రతి సోమవారం ప్రచురిస్తుంది. వెంటనే రాసి పంపండి. మీ చర్చనీయాంశం పంపవలసిన చిరునామా: ‘ఈ కాలమ్ మీదే’ సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 ఇ-మెయిల్: www.sakshireaders@gmail.com -
ఈ కాలమ్ మీదే : చర్చా వేదిక
‘బహిరంగ ధూమపానం’పై చర్చకు స్పందన ముతకతనం పోవాలి... నేను అమెరికా, సింగపూర్లోలలోని మా అమ్మాయిల ఇళ్ళకి వెళ్లినప్పుడు, దారిలో దుబాయ్, పారిస్‌లను చూసినప్పడు అక్కడి ప్రజలు ఇతరులతో ఎంతో మర్యాదగా ప్రవర్తించే సంస్కృతిని గమనించాను. వారు ఏదైనా పొరపాటు చేస్తే తక్షణం ‘సారీ’ చెబుతారు. ఇతరులు తమ తప్పును ఎత్తి చెబితే సిగ్గు పడుతారు తప్ప మనలాగా అహాలకి పోయి పొగరుగా ప్రవర్తించరు. ఒక వృద్ధుడు విజయవాడ నుంచి మంగళగిరి దాకా నించొని ప్రయాణిస్తే ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులలో ఒక్కరు కూడా ఆయనకు సీటు ఇవ్వలేదు. బహిరంగ ధూమపానం కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు...మనలో పేరుకు పోయిన ముతకతనాన్ని తొలిగించుకోవాలి. తల్లిదండ్రులు పిల్లలకు చదువు మాత్రమే కాదు...మర్యాదమన్ననలు కూడా నేర్పాలి. - జె.సుధారాణి, మాచవరం డౌన్, విజయవాడ పూర్తిగా నిషేధించాలి బహిరంగ ధూమపానం గురించి మాట్లాడుకునే ముందు.. ధూమపానం గురించి మొదట మాట్లాడుకోవాలి. ధూమపానాన్ని నిషేధిస్తే... బహిరంగ ధూమపానమే కాదు... ఎలాంటి ధూమపానం ఉండదు కదా! ధూమపానాన్ని ప్రభుత్వం ఒక సామాజిక సమస్యగా చూసి దాని సంపూర్ణ నిషేధానికి ఒక సమగ్రమైన ప్రణాళిక తయారు చేయాలి. దీనికి సంబంధించి ఒక కమిటీని కూడా నియమిస్తే మంచిది. చిన్న కుర్రాళ్ల నుంచి పెద్దవారి వరకు... సిగరెట్టు తాగడం అనేది గొప్ప విషయం అనుకుంటున్నారు. ఆదాయం గురించి ఆలోచించకుండా... ప్రభుత్వం ధూమపానాన్ని పూర్తిగా నిషేధిస్తే మంచిది. - సి.రమణ, కర్నూల్ పొగతాగడం వీరత్వమా? సినిమాల్లో హీరో తన వీరత్వాన్ని చాటుకోవడానికి తప్పనిసరిగా సిగరెట్ తాగుతాడు. పదిమంది గూండాలను చితక్కొట్టాలంటే కూడా సిగరెట్ తాగుతాడు. ఒక గంభీరమైన డైలాగ్ కొట్టడానికి కూడా సిగరెట్ తాగుతాడు. దీంతో సిగరెట్ తాగడం అనేది గ్లామరైజైపోయి యువతకు ఆదర్శమైపోయింది. సినిమాల్లో పొగతాగే దృశ్యాలను పూర్తిగా నిషేధించాలి. కేవలం హెచ్చరిక టైటిల్ వేసినంత మాత్రాన ప్రయోజనం ఉండదు. - డి.రంగాచారి, అమలాపురం తెలుగు భాషపై చర్చకు స్పందన ప్రజలే పూనుకోవాలి వినియోగంలో ఉంటేనే భాష బతుకుతుంది. లేదంటే పుస్తకాలకు మాత్రమే పరిమితమైపోతుంది. మన తెలుగు భాష గొప్పదనం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి గొప్ప భాషను బతికించుకోవడానికి ప్రభుత్వాలు, అవి ఏర్పాటు చేసిన కమిటీల వల్ల ప్రయోజనం లేదు. ప్రజలే పూనుకోవాలి. దైనందిన జీవితంలో మనం ఎంత వరకు ఇంగ్లీష్‌ను ఉపయోగిస్తున్నాం, ఎంత వరకు మాతృభాషలో మాట్లాతున్నాం? అనేది బేరిజు వేసుకొని...అందుకనుగుణంగా ప్రణాళిక రూపొందించుకోవాలి. మాట్లాడే మాటల్లో తెలుగు మాత్రమే వినబడేలా జాగ్రత్త పడాలి. - సి.రజిత, హైదరాబాద్ తెలుగు గొప్పదనం తెలియాలంటే... నేటి తరానికి తెలుగు గొప్పదనం తెలియాలంటే పనిగట్టుకొనైనా వారి చేత తెలుగులో ఉత్తమ సాహిత్యం చదివించాలి. మా అబ్బాయి ఇంగ్లీష్ నవలలు తెగ చదివేవాడు. ‘‘ఎప్పుడు చూసినా ఇంగ్లీష్ నవలలేనా? తెలుగు సాహిత్యం కూడా చదవచ్చు కదా!’’ అన్నానోసారి. ‘‘ఆ... మన తెలుగులో ఏముంది!’’ అన్నాడు. ‘‘ఏమి ఉందో లేదో తెలుసుకోవడానికి... ముందు నువ్వు తెలుగు సాహిత్యం చదవాలి కదా. నీ కోసం కాదు... నా కోసం కొన్ని తెలుగు పుస్తకాలు చదువు’’ అన్నాను. ‘‘అలాగే’’ అని ఒప్పుకున్నాడు. నేను కొన్ని పుస్తకాలు సెలెక్ట్ చేసి వాడికి ఇచ్చాను. నెల రోజుల్లో ఆ పుస్తకాలను చదివాడు. ఒకరోజు నా దగ్గరకు వచ్చి - ‘‘సారీ నాన్నా. నా అభిప్రాయం తప్పు. నువ్వు ఇచ్చిన పుస్తకాల వల్ల తెలుగు గొప్పదనం తెలిసింది’’ అన్నాడు. ఇక అప్పటి నుంచి పాత తెలుగు పుస్తకాలు చదవడంతో పాటు, తెలుగులో ఏ కొత్త పుస్తకం వచ్చినా చదవడం అలవాటు చేసుకున్నాడు. తెలుగు భాషను అభిమానించే తల్లిదండ్రులు...నాలా ఒక ప్రయత్నం చేస్తే మంచిది కదా! - కంది సత్యనారాయణ, విశ్రాంత ఉపాధ్యాయులు, నిజామాబాద్ ‘తెలుగు సినిమా’పై చర్చకు స్పందన దర్శకులతో చర్చా కార్యక్రమం ఏర్పాటు చేయాలి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా... తెలుగు సినిమాల్లో మార్పు కనిపించడం లేదు అనేది వాస్తవం. పది సినిమాలు చూసి ఒక సినిమాను చుట్టేస్తున్నారు. అందుకే ఎన్ని సినిమాలు చూసినా ఒకే సినిమా చూసినట్లే అనిపిస్తుంది. ముఖం మొత్తుతుంది. ఒక మంచి సందర్భం చూసుకొని మన తెలుగు దర్శకులందరితో ‘మనం విలక్షణమైన సినిమాలు ఎందుకు తీయలేకపోతున్నాం?’ అనే దానిపై చర్చావేదిక ఏర్పాటు చేస్తే ఎన్నో కొత్త విషయాలు తెలుస్తాయి. ఈ ప్రయత్నం వీలైనంత త్వరగా జరిగితే మంచిది. - రామారపు వీరన్న, గుండ్రపల్లి, వరంగల్ జిల్లా పాఠకులకు ఆహ్వానం ‘ఈ కాలమ్ మీదే’ అనే ఈ చర్చావేదికలో పాల్గొనండి. చర్చనీయాంశం మీ ఇష్టం. ఏ సామాజిక అంశాన్నయినా, ఆలోచననైనా మీరు చర్చకు పెట్టొచ్చు. మీ వాదనను వినిపించవచ్చు. దానిపై మిగతా పాఠకులనూ చర్చకు ఆహ్వానిస్తుంది సాక్షి ఫ్యామిలీ. వీటిని ప్రతి సోమవారం ప్రచురిస్తుంది. వెంటనే రాసి పంపండి. మీ చర్చనీయాంశం పంపవలసిన చిరునామా: ‘ఈ కాలమ్ మీదే’ సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 ఇ-మెయిల్: sakshireaders@gmail.com -
ఈ కాలమ్ మీదే : చర్చా వేదిక
‘ఈ కాలమ్ మీదే’ చర్చావేదికకు మాకు అందిన అభిప్రాయాల్లో నుంచి ఇక్కడ మూడింటిని ప్రచురిస్తున్నాం. ఈ మూడిట్లో ఏ అంశంపై అయినా మీరు చర్చలో పాల్గొనవచ్చు. మీ విలువైన అభిప్రాయాన్ని ఇతరులతో పంచుకోవచ్చు. తెలుగులో మాట్లాడటం తప్పా? ఇప్పుడు ఎక్కడ చూసినా ఇంగ్లిష్ వాతావరణమే కనిపిస్తోంది. ఇద్దరు తమిళులు కలిస్తే తమిళం మాట్లాడతారని, ఇద్దరు కన్నడిగులు కలిస్తే కన్నడంలో మాట్లాడతారని... ఇద్దరు తెలుగు వాళ్లు కలిస్తే మాత్రం... కచ్చితంగా ఇంగ్లిష్‌లో మాత్రమే మాట్లాడుకుంటారనే మాట హాస్యం కోసం అన్నది కాదని, నిజమేనని నిత్యజీవిత సంఘటనలను చూస్తే అర్థమవుతుంది. ‘ఇంగ్లిష్ రాకపోతే జీవనం లేదు. ఇంగ్లిష్ లేకపోతే జీవితం లేదు’ అని తల్లిదండ్రులు ఆలోచించడం వల్లే తెలుగు లేని ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. పిల్లలు ఇంగ్లిష్‌లో మాట్లాడడం నేరమైపోయింది. మరోవైపు పిల్లలు ఇంట్లో ఇంగ్లిష్‌లో మాట్లాడుకోవడాన్ని తల్లిదండ్రులు గర్వంగా భావిస్తున్నారు. ఏ రాష్ట్రాల్లో లేని విధంగా మన తెలుగు రాష్ట్రాల్లోనే ఇంగ్లిష్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వడం కనిపిస్తుంది. ఇది సమంజసమేనా? ఏం చేస్తే తెలుగు రాష్ట్రాల్లో తెలుగుకి పూర్వవైభవం వస్తుంది? - నల్లపాటి సురేంద్ర, కొత్తగాజువాక ఇక మన సినిమాల్లో కొత్తదనం కనిపించదా? ఒకప్పుడు నేను విపరీతంగా సినిమాలు చూసేవాడిని. ఇప్పుడు మాత్రం సంవత్సరానికి ఒక్క సినిమా చూడడం కూడా కష్టమైపోయింది. దీనికి కారణం అన్ని సినిమాలు ఒకేలా ఉండడమే. మన తెలుగులో గతంలో ఎన్నో గొప్ప సినిమాలు వచ్చాయి. వాటి గురించి గొప్పగా పదే పదే చెప్పుకోవడం తప్ప కొత్త సినిమాలను చూడలేమా? ఒకవేళ అడపాదడపా మంచి చిత్రాలు వచ్చినా... అవి రీమేక్‌లే తప్ప మనదంటూ దాంట్లో ఏమీ ఉండదు. రీమేక్‌లు చేసే బదులు తెలుగులోనే అలాంటి చిత్రాలు చేయవచ్చుకదా! కొద్దిమంది దర్శకులు ఇంటర్వ్యూలలో... ‘‘ప్రయోగాలు చేయడం అనేది రిస్క్‌తో కూడిన వ్యవహారం. ఒక్క సినిమా పోయిందంటే... వందలాది కుటుంబాలు వీధిన పడతాయి’’ అని తరచు చెబుతుంటారు. ‘రిస్క్’ అనుకున్నప్పుడు సినిమాలు తీయడం ఎందుకు? వ్యాపారం చేసుకుంటే డబ్బులు ఎక్కువ సంపాదించవచ్చు కదా! ఎంత కాదనుకున్నా సినిమా అనేది కళాత్మక ప్రక్రియ. దీంట్లో లాభనష్టాలు బేరీజు వేసుకోవడం తగదు. ఒక్కసారి మన పాత తెలుగు క్లాసిక్‌లను తీసుకుంటే... కళాత్మక విలువలు తప్ప... మనం తరచు చెప్పుకునే ‘కమర్శియల్ హిట్’ ఫార్ములా కనిపించదు. ‘హిట్ ఫార్ములా’ అంటే ఒక్కడే హీరో వందమందిని ఒంటి చేత్తో కొట్టడమే అనుకుంటే... భారీలొకేషన్లు, విదేశాల్లో పాటలే- అనుకుంటే ఇప్పుడొస్తున్న అన్ని సినిమాలు హిట్ కావాలి కదా! మరి అలా ఎందుకు జరగడం లేదు? అసలు మనం ఉత్తమచిత్రాలు తీయలేమా? తీయాలనుకునేవాళ్లకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి? ప్రేక్షకుల అభిరుచిలో కొత్తదనం ఉండడం లేదా?... ఇలాంటి విషయాలపై చర్చిస్తే బాగుంటుంది. - కొమ్ము రఘువీర్ యాదవ్, వరంగల్ ...అయినా కాలుస్తూనే ఉన్నారు! చట్టం అనేది ఆచరణలోకి వచ్చినప్పుడే విలువ ఉంటుంది. అలా కాకపోతే ఎన్ని చట్టాలు చేసుకొని ఏంలాభం? బహిరంగంగా ధూమపానం చేయడం తప్పు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇది తెలిసి కూడా చాలామంది బహిరంగంగానే సిగరెట్ కాలుస్తున్నారు. ఒకసారి నేను బస్‌స్టాప్‌లో నిల్చొని బస్సు కోసం ఎదురుచూస్తున్నాను. నా పక్కన నిల్చొన్న వ్యక్తి తన జేబులో నుంచి సిగరెట్ తీసి తాగడం మొదలుపెట్టాడు. ‘‘అలా దూరంగా వెళ్లి కాల్చండి. ఇబ్బందిగా ఉంది’’ అన్నాను అతడితో. ‘‘ఇబ్బందిగా ఉంటే నువ్వే దూరంగా వెళ్లు. నా సిగరెట్ పూర్తయిన తరువాత వచ్చి నిల్చో’’ అన్నాడు దురుసుగా. ఇలా మా మధ్య మాటా మాటా పెరిగి వాదులాడుకోవడం ప్రారంభించాము. ఇంత జరుగుతున్నా... చుట్టుపక్కల ఉన్నవాళ్లలో ఒక్కరు కూడా ‘‘ఏమయ్యా... తప్పు చేయడమే కాకుండా... అతి తెలివి ప్రదర్శిస్తున్నావా?’’ అని అతన్ని మందలించే ప్రయత్నం చేయలేదు. ఇంతకీ తప్పు ఎవరిది? తప్పు అని తెలిసినా... సిగరెట్ తాగిన ఆ పెద్ద మనిషిదా? తప్పు చేస్తున్నాడని తెలిసినా ఉదాసీనంగా ఉన్న ప్రయాణికులదా? - డి.ప్రభావతి, చిత్తూరు పాఠకులకు ఆహ్వానం ‘ఈ కాలమ్ మీదే’ అనే ఈ చర్చావేదికలో పాల్గొనండి. చర్చనీయాంశం మీ ఇష్టం. ఏ సామాజిక అంశాన్నయినా, ఆలోచననైనా మీరు చర్చకు పెట్టొచ్చు. మీ వాదనను వినిపించవచ్చు. దానిపై మిగతా పాఠకులనూ చర్చకు ఆహ్వానిస్తుంది సాక్షి ఫ్యామిలీ. వీటిని ప్రతి సోమవారం ప్రచురిస్తుంది. వెంటనే రాసి పంపండి. మీ చర్చనీయాంశం పంపవలసిన చిరునామా ‘ఈ కాలమ్ మీదే’ సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 . ఇ-మెయిల్: sakshireaders@gmail.com