గోవు మాలక్ష్మికి కోటి దండాలు!
మా ఇంటి గేటును ఆనుకొని రోడ్డుపై రెండు పెద్ద కానుగ చెట్లు ఉన్నాయి. ఎక్కడి నుంచి వస్తాయో, ఎవరికి చెందినవో తెలియదు కానీ, తెల్లవారేటప్పటికీ డజన్ల సంఖ్యలో ఆవులు, గిత్తలు, దూడలు గుంపులుగా ఈ చెట్లక్రింద చేరుతాయి. ఒక్క మా వీధిలోనే కాదు, ఎక్కడ పడితే అక్కడ ఊరంతా ఇదే తంతు. మనం విధించుకున్న ట్రాఫిక్ ఆంక్షల గురించి వాటికి తెలియదు.
రోడ్డుకు మధ్యలో కొన్ని నిలబడతాయి. ఎక్కువ రద్దీ ఉండే ప్రాంతంలో ఇలా జరగడం వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలిగి ఎంతో మంది రూట్ మార్చుకొని వారి గమ్యస్థానానికి వెళ్లాల్సి వస్తుంది.వాటిని గట్టిగా అదిలిస్తే పక్కకు తప్పుకుంటాయి. కానీ ఎవరూ ఆ పని చేయరు. ఎందుకంటే ‘గోమాత’ కదా! ఇటువంటి మూఢత్వం వల్ల వాటికి ఎన్నోసార్లు ప్రమాదాలు కూడా జరిగాయి.
కొందరైతే ఈ ఆవులకి తోక మొదలుకొని పసుపుకుంకాలతో బొట్లుపెట్టి, కొండొకచో దాని మూత్రాన్ని శిరస్సుపై చల్లుకొని తమ భక్తి ప్రపత్తులు చాటుకుంటారు. ఇక్కడ విచిత్రమేమిటంటే గోమూత్రం ఔషధగుణాలతో ఉంటుంది కాబట్టి ఆ పని చేసాం అంటారు. కానీ దాని నోటికి మాత్రం కాసింత పచ్చగడ్డో, పండో కాయో తోచినది ఏదైనా పెట్టాలనుకోరు. వాటి యజమానులు ఎవరో, ఎక్కడ ఉంటారో ఎవరికి తెలియదు. తెల్లవారేటప్పటికి వాటిని రోడ్లపైకి వదిలి చేతులు దులుపుకుంటారు. ఆవులు మాత్రం బక్కచిక్కి, ఎవరైనా తినడానికి ఏమైనా పెడతారేమో అని దీనంగా చూస్తుంటాయి.
వాటికి మనం ప్రత్యేకంగా వండి పెట్టనక్కర్లేదు. మనం తరిగిన కూరగాయల తొక్కలు, మాగిన పండ్లు.. ఇవి వేసినా వాటిని అవి ఎంతో తృప్తిగా తింటాయి. ఎవరు వాటికి తిండి పెడతారో ఆ ఇంటి గుమ్మం వదలదు కాబట్టి ..గోవుల యాజమానుల్లారా! మీ పశువులను రక్షిత ప్రదేశాలలో కట్టి వాటికి కాసింత నీడ, నీళ్లు, గడ్డి మీకున్నంతలో ఏర్పాటు చేయండి. అంతేకానీ రోడ్లపైకి వదిలి వాటికి, ప్రజలకీ ప్రమాదాలు కొని తేకండి.వాటిని పోషించే స్థోమత లేనప్పుడు ఏదైనా గోశాలకి వాటిని ఇచ్చి వాటి పోషణార్థం మీకు కలిగినది నిర్వాహకులకి ఇవ్వండి.
- దుర్గాసూరి, పాతపేట, నూజివీడు, కృష్ణాజిల్లా.
డొల్లతనాన్ని ప్రశ్నిస్తోంది!
ఢిల్లీ ఉదంతం తర్వాత ఉరికెక్కించే చట్టాలొచ్చాయి కదా అని మగాడు ఊరికే లేడు. ఆ తర్వాత దేశ రాజధాని ఢిల్లీ సహా 11 మహా నగరాల్లో ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన సర్వేలో మగాళ్లలో మార్పు మేడిపండు చందమేనని రుజువైంది. మహిళల వస్త్రధారణ పురుషులను రెచ్చగొట్టేవిధంగా ఉంటుందని.. అది అనివార్యంగా స్త్రీలపట్ల హింసాత్మకంగా మారుతోందని 60 శాతం మంది విద్యార్థులు అభిప్రాయపడడం దేనికి సంకేతం? మన పిల్లల పాఠ్యాంశాలు(కరిక్యులమ్) లింగవివక్షను రూపుమాపే, మానవీయ విలువలు గల పౌరులుగా తీర్చిదిద్దే విధంగా లేవన్నది నిజం.
ఇండియా డాటర్‌తో దేశం పరువుపోతోందంటున్నవారు.. మన సినిమాలు (కొన్ని మినహా) ప్రజలకు ఏం ప్రబోధిస్తున్నాయో ఆలోచించారా? కామెడీ పేరుతో వావివరసలు మరచి డైలాగులు. ఇక రేప్‌లలో వైవిధ్యం.. పరాకాష్టకు చేరిన హింస.. నానాటికీ తీసికట్టుగా హీరోయిన్ల వస్త్రధారణ.. టీచర్, స్టూడెంట్ బాంధవ్యాన్ని అధమావస్థకు చేర్చిన వైనం.. ఏ సంస్కృతికి చిహ్నాలు? దేశంలోని పేదరికంపైనా, మురికివాడలపైనా బయటి వ్యక్తులు సినిమాలు తీసి అంతర్జాతీయ స్థాయిలో పరువు తీస్తున్నారని గగ్గోలు పెడతారు. కానీ ద్వంద్వార్థ సినిమాలతో హిట్లుకొట్టిన కొందరు హీరోలు రాజ్యసభసభ్యులు, మంత్రులు కూడా అయ్యారు. వీళ్ల అనేక సినిమాల్లో కథానాయిక ఓ ఆటబొమ్మ?
అశ్రుధారాపాతం.. ఇండియా డాటర్!
ఈ డాక్యుమెంటరీ చూసి ఒక్క కన్నీటి చుక్కైనా రాలకుంటే ముఖేష్‌కు మనకు తేడా లేనట్టే! ఈ కేసులో నిందితుల తరఫున డిఫెన్స్‌లాయర్లమైనట్టే!! ఎందువలనంటే.. ఇందులో జ్యోతి గురించి ఆమె తల్లితండ్రులు, ఆమె ట్యూటర్ చెప్పిన విషయాలు మనల్ని చకితుల్ని చేస్తాయి. వివశుల్ని చేస్తాయి.. అప్రయత్నంగా మన కళ్లు చెమ్మగిల్లక మానవు. ఆమె నిండైన వ్యక్తిత్వం, సంస్కరణాభిలాష మనల్ని సిగ్గుపడేలా చేస్తాయి. ముఖ్యంగా ఆ తల్లి పడుతున్న వేదన మనల్ని నిలువనీయదు. అలాగే నిందితుల కుటుంబాల దుర్భర దారిద్య్రం.. వారి దీనస్థితి పట్ల సానుభూతి కలగక మానదు.
లేశమైనా పశ్చాత్తాపం కనిపించని ముఖంతో ముఖేష్, నిందితుల తరఫున వాదించిన లాయర్ల తిరోగమన ఆలోచనాధోరణి.. అసహ్యాన్నీ, ఆగ్రహాన్ని కలిగిస్తాయి. ఇండియాడాటర్ మనకు నేర్పుతోంది అవకాశవాదం కాదు. ఆమె లొంగలేదు. లొంగదీసుకున్నారు. నిబిడాకాశం నివ్వెరపోయేలా ఆమె ప్రతిఘటించింది. ఆ రాత్రి హెల్ప్‌మీ.. హెల్ప్‌మీ.. అని ఆమె అర్థించింది.. తనను రక్షించమని కాదు. దురాలోచనలతో, దుర్లక్షణాలతో కుళ్లికంపుకొడుతున్న సమస్త మానవజాతినీ కాపాడమని! మన విలువలు, ఆలోచనల్లోని డొల్లతనాన్ని ప్రశ్నిస్తోంది ఇండియా డాటర్ !!
- ఎం.జి.నజీర్, హైదరాబాద్
ఉద్యమకారులు బయలుదేరాలి!
తెలుగు రాష్ట్రాల్లోని ఆంగ్లమాధ్యమ పాఠాశాలల్లో విద్యార్థులు తెలుగులో మాట్లాడితే తప్పెందుకో ఆ పాఠాశాల యాజమాన్యులే సమాధానం చెప్పాలి. కర్నాటక, తమిళనాడుతో పాటు మిగిలిన రాష్ట్రాల ఆంగ్లపాఠశాలల్లోనూ ఇలాంటి నిబంధనలు ఉన్నాయా? అంటే లేవనే చెప్పాలి. మరి మన తెలుగు రాష్ట్రాల్లోనే ఈ ప్రకటిత, అప్రకటిత నిబంధనలు ఎందుకు? ప్రభుత్వం కన్నడ భాష అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేయకపోయిన అక్కడి కన్నడ సంఘాలు తమిళనాడును ఆదర్శంగా తీసుకొని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి కన్నడ భాషను అభివృద్ధి చేసుకుంటున్నాయి.
కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వంతో పాటు ప్రజలదీ ఒకే బాట. తెలుగు భాష పట్ల నిర్లక్ష్యం! తెలుగు భాషకు పూర్వవైభవం రావాలంటే ఒకటే మార్గం.... తెలుగు భాషాభిమానుల నుంచి ఉద్యమకారులు బయలుదేరాలి. తెలుగు భాష అభివృద్ధికి నిర్దిష్టమైన విధానాన్ని అమలు పరిచేలా కృషి చేయాలి.
- ఆర్.శ్రీనివాస్, సింగసంద్ర, బెంగళూరు
పాఠకులకు ఆహ్వానం
‘ఈ కాలమ్ మీదే’ అనే ఈ చర్చావేదికలో పాల్గొనండి. చర్చనీయాంశం మీ ఇష్టం. ఏ సామాజిక అంశాన్నయినా, ఆలోచననైనా మీరు చర్చకు పెట్టొచ్చు. మీ వాదనను వినిపించవచ్చు. దానిపై మిగతా పాఠకులనూ చర్చకు ఆహ్వానిస్తుంది సాక్షి ఫ్యామిలీ. వీటిని ప్రతి సోమవారం ప్రచురిస్తుంది. వెంటనే రాసి పంపండి.
మీ చర్చనీయాంశం పంపవలసిన చిరునామా: ‘ఈ కాలమ్ మీదే’ సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 ఇ-మెయిల్: sakshireaders@gmail.com
ఈ కాలమ్ మీదే : చర్చా వేదిక
Published Sun, Mar 15 2015 11:41 PM | Last Updated on Sat, Sep 2 2017 10:54 PM
Advertisement