‘ఈ కాలమ్ మీదే’ చర్చావేదికకు మాకు అందిన అభిప్రాయాల్లో నుంచి ఇక్కడ మూడింటిని ప్రచురిస్తున్నాం. ఈ మూడిట్లో ఏ అంశంపై అయినా మీరు చర్చలో పాల్గొనవచ్చు. మీ విలువైన అభిప్రాయాన్ని ఇతరులతో పంచుకోవచ్చు.
తెలుగులో మాట్లాడటం తప్పా?
ఇప్పుడు ఎక్కడ చూసినా ఇంగ్లిష్ వాతావరణమే కనిపిస్తోంది. ఇద్దరు తమిళులు కలిస్తే తమిళం మాట్లాడతారని, ఇద్దరు కన్నడిగులు కలిస్తే కన్నడంలో మాట్లాడతారని... ఇద్దరు తెలుగు వాళ్లు కలిస్తే మాత్రం... కచ్చితంగా ఇంగ్లిష్‌లో మాత్రమే మాట్లాడుకుంటారనే మాట హాస్యం కోసం అన్నది కాదని, నిజమేనని నిత్యజీవిత సంఘటనలను చూస్తే అర్థమవుతుంది.
‘ఇంగ్లిష్ రాకపోతే జీవనం లేదు. ఇంగ్లిష్ లేకపోతే జీవితం లేదు’ అని తల్లిదండ్రులు ఆలోచించడం వల్లే తెలుగు లేని ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. పిల్లలు ఇంగ్లిష్‌లో మాట్లాడడం నేరమైపోయింది. మరోవైపు పిల్లలు ఇంట్లో ఇంగ్లిష్‌లో మాట్లాడుకోవడాన్ని తల్లిదండ్రులు గర్వంగా భావిస్తున్నారు. ఏ రాష్ట్రాల్లో లేని విధంగా మన తెలుగు రాష్ట్రాల్లోనే ఇంగ్లిష్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వడం కనిపిస్తుంది. ఇది సమంజసమేనా? ఏం చేస్తే తెలుగు రాష్ట్రాల్లో తెలుగుకి పూర్వవైభవం వస్తుంది?
- నల్లపాటి సురేంద్ర, కొత్తగాజువాక
ఇక మన సినిమాల్లో కొత్తదనం కనిపించదా?
ఒకప్పుడు నేను విపరీతంగా సినిమాలు చూసేవాడిని. ఇప్పుడు మాత్రం సంవత్సరానికి ఒక్క సినిమా చూడడం కూడా కష్టమైపోయింది. దీనికి కారణం అన్ని సినిమాలు ఒకేలా ఉండడమే. మన తెలుగులో గతంలో ఎన్నో గొప్ప సినిమాలు వచ్చాయి. వాటి గురించి గొప్పగా పదే పదే చెప్పుకోవడం తప్ప కొత్త సినిమాలను చూడలేమా?
ఒకవేళ అడపాదడపా మంచి చిత్రాలు వచ్చినా... అవి రీమేక్‌లే తప్ప మనదంటూ దాంట్లో ఏమీ ఉండదు. రీమేక్‌లు చేసే బదులు తెలుగులోనే అలాంటి చిత్రాలు చేయవచ్చుకదా! కొద్దిమంది దర్శకులు ఇంటర్వ్యూలలో... ‘‘ప్రయోగాలు చేయడం అనేది రిస్క్‌తో కూడిన వ్యవహారం. ఒక్క సినిమా పోయిందంటే... వందలాది కుటుంబాలు వీధిన పడతాయి’’ అని తరచు చెబుతుంటారు. ‘రిస్క్’ అనుకున్నప్పుడు సినిమాలు తీయడం ఎందుకు? వ్యాపారం చేసుకుంటే డబ్బులు ఎక్కువ సంపాదించవచ్చు కదా! ఎంత కాదనుకున్నా సినిమా అనేది కళాత్మక ప్రక్రియ. దీంట్లో లాభనష్టాలు బేరీజు వేసుకోవడం తగదు.
ఒక్కసారి మన పాత తెలుగు క్లాసిక్‌లను తీసుకుంటే... కళాత్మక విలువలు తప్ప... మనం తరచు చెప్పుకునే ‘కమర్శియల్ హిట్’ ఫార్ములా కనిపించదు. ‘హిట్ ఫార్ములా’ అంటే ఒక్కడే హీరో వందమందిని ఒంటి చేత్తో కొట్టడమే అనుకుంటే... భారీలొకేషన్లు, విదేశాల్లో పాటలే- అనుకుంటే ఇప్పుడొస్తున్న అన్ని సినిమాలు హిట్ కావాలి కదా! మరి అలా ఎందుకు జరగడం లేదు? అసలు మనం ఉత్తమచిత్రాలు తీయలేమా? తీయాలనుకునేవాళ్లకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి? ప్రేక్షకుల అభిరుచిలో కొత్తదనం ఉండడం లేదా?... ఇలాంటి విషయాలపై చర్చిస్తే బాగుంటుంది.
- కొమ్ము రఘువీర్ యాదవ్, వరంగల్
...అయినా కాలుస్తూనే ఉన్నారు!
చట్టం అనేది ఆచరణలోకి వచ్చినప్పుడే విలువ ఉంటుంది. అలా కాకపోతే ఎన్ని చట్టాలు చేసుకొని ఏంలాభం? బహిరంగంగా ధూమపానం చేయడం తప్పు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇది తెలిసి కూడా చాలామంది బహిరంగంగానే సిగరెట్ కాలుస్తున్నారు. ఒకసారి నేను బస్‌స్టాప్‌లో నిల్చొని బస్సు కోసం ఎదురుచూస్తున్నాను. నా పక్కన నిల్చొన్న వ్యక్తి తన జేబులో నుంచి సిగరెట్ తీసి తాగడం మొదలుపెట్టాడు.
‘‘అలా దూరంగా వెళ్లి కాల్చండి. ఇబ్బందిగా ఉంది’’ అన్నాను అతడితో.
‘‘ఇబ్బందిగా ఉంటే నువ్వే దూరంగా వెళ్లు. నా సిగరెట్ పూర్తయిన తరువాత వచ్చి నిల్చో’’ అన్నాడు దురుసుగా. ఇలా మా మధ్య మాటా మాటా పెరిగి వాదులాడుకోవడం ప్రారంభించాము. ఇంత జరుగుతున్నా... చుట్టుపక్కల ఉన్నవాళ్లలో ఒక్కరు కూడా ‘‘ఏమయ్యా... తప్పు చేయడమే కాకుండా... అతి తెలివి ప్రదర్శిస్తున్నావా?’’ అని అతన్ని మందలించే ప్రయత్నం చేయలేదు. ఇంతకీ తప్పు ఎవరిది? తప్పు అని తెలిసినా... సిగరెట్ తాగిన ఆ పెద్ద మనిషిదా? తప్పు చేస్తున్నాడని తెలిసినా ఉదాసీనంగా ఉన్న ప్రయాణికులదా?
- డి.ప్రభావతి, చిత్తూరు
పాఠకులకు ఆహ్వానం
‘ఈ కాలమ్ మీదే’ అనే ఈ చర్చావేదికలో పాల్గొనండి. చర్చనీయాంశం మీ ఇష్టం. ఏ సామాజిక అంశాన్నయినా, ఆలోచననైనా మీరు చర్చకు పెట్టొచ్చు. మీ వాదనను వినిపించవచ్చు. దానిపై మిగతా పాఠకులనూ చర్చకు ఆహ్వానిస్తుంది సాక్షి ఫ్యామిలీ. వీటిని ప్రతి సోమవారం ప్రచురిస్తుంది. వెంటనే రాసి పంపండి. మీ చర్చనీయాంశం పంపవలసిన చిరునామా
‘ఈ కాలమ్ మీదే’ సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 . ఇ-మెయిల్: sakshireaders@gmail.com
ఈ కాలమ్ మీదే : చర్చా వేదిక
Published Mon, Jan 12 2015 2:50 AM | Last Updated on Thu, Aug 9 2018 7:28 PM
Advertisement