Speak Telugu
-
అమెరికా యువతి నోట తెలుగు మాట
దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. తెలుగు భాష తియ్యదనం తెలుసుకున్న వారికే అర్థం అవుతుంది. కాకపోతే మన భాషను మనమే పరాయి భాషగా చూస్తున్నాం. ఇప్పుడున్న యువతలో చాలా మంది తెలుగు మాట్లాడటానికే నామోషిగా భావిస్తున్నారు. ఇప్పటి తరం యువత తెలుగు స్పష్టంగా చూస్తూ చదవడానికే చాలా కష్టపడుతున్నారు. పాఠశాల స్థాయి నుంచే తెలుగు భాష అంటే మార్కుల కోసం అన్నట్టు చెబుతున్నారు. నాలుగు పద్యాలు బట్టీ పట్టిస్తే చాలు అన్నట్లుంది పరిస్థితి. కానీ అమెరికాలో పుట్టి.. అమెరికాలో పెరిగి తెలుగుపై మక్కువ పెంచుకుని తెలుగులో అనర్గళంగా మాట్లాడుతున్నారు ఏనా . ఆమె గురించిన మరిన్ని వివరాలు.. తెలుగు భాష నేర్చుకోవడం చాలా కష్టమంటూనే ప్రావీణ్యం సంపాదించారు. మాట్లాడటమే కాదు.. రాయడం, చదవడం కూడా నేర్చుకున్నారు. అంతేకాదు యూట్యూబ్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా.. హైదరాబాద్‌తో తనకున్న అనుభవాలను వీక్షకులతో పంచుకుంటూనే.. తెలుగు భాష గొప్పతనాన్ని చాటిచెబుతున్నారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, తెలుగు భాష అంటే ఎంతో ఇష్టమని చెబుతున్నారు. ఆమె పేరే ఏనా రెమిల్లార్డ్. ఇతర భాషలపై ఆసక్తితో.. ‘చిన్నప్పటి నుంచే కొత్త భాషలు, కొత్త సంస్కృతుల గురించి తెలుసుకోవడం అంటే ఆసక్తి ఉండేది. అమెరికాలోని యూనివర్సిటీల్లో నాలుగేళ్ల డిగ్రీ కోర్సుల్లో మూడో సంవత్సరం వేరే దేశాల్లోని వర్సిటీల్లో చదువుకోవాల్సి వస్తుంది. అందులో భాగంగానే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్నాను. హెచ్‌సీయూలో తోటి విద్యార్థులతో కలసి భారత్‌లోని మతాలు, కులాల గురించి అధ్యయనం చేసేందుకు చాలా ప్రాంతాలు తిరిగాను. అప్పుడే దేశంలోని అనేక సంప్రదాయాల గురించి అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాను. ఆ సమయంలోనే తెలుగు నేర్చుకోవాలనే ఆసక్తితో పాటు సంస్కృతి, సంప్రదాయాల గురించి తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాను’ అని రెమిల్లార్డ్ వివరించారు. అద్భుతమైన ఉచ్చారణ.. అమెరికాలో పుట్టినప్పటికీ రెమిల్లార్డ్ తెలుగు భాష ఉచ్ఛారణ మాత్రం అద్భుతంగా ఉంటుంది. ప్రతి పదాన్నీ ఎలా పలకాలో ఇక్కడి తెలుగు గురువుల నుంచి ఇప్పటికీ అడిగి తెలుసుకుంటారు. మొదట్లో తెలుగు భాష ఎవరైనా మాట్లాడితే భయంగా ఉండేదట. కానీ, చాలా సీరియస్‌గా సాధన చేసి తెలుగులో అనర్గళంగా మాట్లాడుతున్నారు. అయితే ఇంకా తాను నేర్చుకోవాల్సింది చాలా ఉందని, ఇంకా ప్రావీణ్యం సాధించాల్సిన అవసరం ఉందని, తెలుగులో నిత్య విద్యారి్థనేనని చెప్పుకొచ్చారు. భారత సంస్కృతి అంటే ఇష్టం.. ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు అంటే తనకు చాలా ఇష్టమని రెమిల్లార్డ్ పేర్కొన్నారు. ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలకు, అమెరికాకు చాలా వ్యత్యాసం ఉందని చెప్పారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అంటే ఎంతో ఇష్టమని వివరించారు. అమెరికాలో ఇలా తక్కువగా ఉంటారన్నారు. కాగా, వేరే దేశాలకు వెళ్లి వారి భాష మాట్లాడితే అంతగా పట్టించుకోరని, అదే ఇక్కడి ప్రజలతో వారి భాషలో మాట్లాడితే చాలా సంతోíÙస్తారని చెప్పారు. తెలుగుతో పాటు హిందీ కూడా నేర్చుకున్నానని, ఇక్కడి వారు ఎంతో స్నేహపూర్వకంగా మాట్లాడతారని ఆనందం వ్యక్తం చేశారు. కాకపోతే చాలా మంది తమ మాతృభాష అయిన తెలుగు భాషలో మాట్లాడేందుకు అయిష్టత చూపుతున్నారని, అలా చేయొద్దని విజ్ఞప్తి చేశారు. మరింత నైపుణ్యం సాధిస్తా.. తెలుగులో ఇంకా ఓనమాలు నేర్చుకుంటున్నానని, ఇంకా నైపుణ్యం సాధించేందుకు కష్టపడుతున్నానని రెమిల్లార్డ్ చెప్పుకొచ్చారు. హాలీవుడ్ సినిమాల్లో చూపించినట్టు అమెరికా సమాజం ఉండదని, సినిమాలకు, నిజజీవితానికి చాలా వ్యత్యాసం ఉంటుందని వివరించారు. సినిమాల వల్ల కూడా అమెరికా సమాజాన్ని వేరే దేశాల వారు అపార్థం చేసుకుంటున్నారని చెప్పారు. అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ స్టడీస్ అనే సంస్థలో తెలుగు నేర్చుకున్నట్టుగా ఆమె తెలిపారు.భాషతో పాటు సంస్కృతి కూడా.. విదేశీ విద్యార్థులకు 20 ఏళ్లుగా తెలుగు చెబుతున్నాను. వీరికి కొత్త భాష నేర్చుకోవాలనే తపన ఎక్కువగా ఉంటుంది. వాళ్లకు తెలుగుతో పాటు ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలను బోధిస్తుంటాం. – కొల్లాపురం విమల, తెలుగు ప్రొఫెసర్ ఎంతో కష్టపడుతుంటారు.. రెమిల్లార్డ్ తెలుగు నేర్చుకునేందుకు ఎంతో కష్టపడేవారు. ప్రతి అంశాన్నీ క్షుణ్నంగా అడిగి తెలుసుకునేవారు. ఉచ్చారణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు. తెలుగులో ఏ డౌట్ వచి్చనా ఇప్పటికీ అడుగుతుంటారు. ఆమెతో పాటు చాలా మంది విద్యార్థులు మా వద్ద తెలుగు నేర్చుకున్నారు. – డాక్టర్ చంద్రయ్య శివన్న, తెలుగు ప్రొఫెసర్ -
ఈ కాలమ్ మీదే : చర్చా వేదిక
‘ఈ కాలమ్ మీదే’ చర్చావేదికకు మాకు అందిన అభిప్రాయాల్లో నుంచి ఇక్కడ మూడింటిని ప్రచురిస్తున్నాం. ఈ మూడిట్లో ఏ అంశంపై అయినా మీరు చర్చలో పాల్గొనవచ్చు. మీ విలువైన అభిప్రాయాన్ని ఇతరులతో పంచుకోవచ్చు. తెలుగులో మాట్లాడటం తప్పా? ఇప్పుడు ఎక్కడ చూసినా ఇంగ్లిష్ వాతావరణమే కనిపిస్తోంది. ఇద్దరు తమిళులు కలిస్తే తమిళం మాట్లాడతారని, ఇద్దరు కన్నడిగులు కలిస్తే కన్నడంలో మాట్లాడతారని... ఇద్దరు తెలుగు వాళ్లు కలిస్తే మాత్రం... కచ్చితంగా ఇంగ్లిష్‌లో మాత్రమే మాట్లాడుకుంటారనే మాట హాస్యం కోసం అన్నది కాదని, నిజమేనని నిత్యజీవిత సంఘటనలను చూస్తే అర్థమవుతుంది. ‘ఇంగ్లిష్ రాకపోతే జీవనం లేదు. ఇంగ్లిష్ లేకపోతే జీవితం లేదు’ అని తల్లిదండ్రులు ఆలోచించడం వల్లే తెలుగు లేని ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. పిల్లలు ఇంగ్లిష్‌లో మాట్లాడడం నేరమైపోయింది. మరోవైపు పిల్లలు ఇంట్లో ఇంగ్లిష్‌లో మాట్లాడుకోవడాన్ని తల్లిదండ్రులు గర్వంగా భావిస్తున్నారు. ఏ రాష్ట్రాల్లో లేని విధంగా మన తెలుగు రాష్ట్రాల్లోనే ఇంగ్లిష్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వడం కనిపిస్తుంది. ఇది సమంజసమేనా? ఏం చేస్తే తెలుగు రాష్ట్రాల్లో తెలుగుకి పూర్వవైభవం వస్తుంది? - నల్లపాటి సురేంద్ర, కొత్తగాజువాక ఇక మన సినిమాల్లో కొత్తదనం కనిపించదా? ఒకప్పుడు నేను విపరీతంగా సినిమాలు చూసేవాడిని. ఇప్పుడు మాత్రం సంవత్సరానికి ఒక్క సినిమా చూడడం కూడా కష్టమైపోయింది. దీనికి కారణం అన్ని సినిమాలు ఒకేలా ఉండడమే. మన తెలుగులో గతంలో ఎన్నో గొప్ప సినిమాలు వచ్చాయి. వాటి గురించి గొప్పగా పదే పదే చెప్పుకోవడం తప్ప కొత్త సినిమాలను చూడలేమా? ఒకవేళ అడపాదడపా మంచి చిత్రాలు వచ్చినా... అవి రీమేక్‌లే తప్ప మనదంటూ దాంట్లో ఏమీ ఉండదు. రీమేక్‌లు చేసే బదులు తెలుగులోనే అలాంటి చిత్రాలు చేయవచ్చుకదా! కొద్దిమంది దర్శకులు ఇంటర్వ్యూలలో... ‘‘ప్రయోగాలు చేయడం అనేది రిస్క్‌తో కూడిన వ్యవహారం. ఒక్క సినిమా పోయిందంటే... వందలాది కుటుంబాలు వీధిన పడతాయి’’ అని తరచు చెబుతుంటారు. ‘రిస్క్’ అనుకున్నప్పుడు సినిమాలు తీయడం ఎందుకు? వ్యాపారం చేసుకుంటే డబ్బులు ఎక్కువ సంపాదించవచ్చు కదా! ఎంత కాదనుకున్నా సినిమా అనేది కళాత్మక ప్రక్రియ. దీంట్లో లాభనష్టాలు బేరీజు వేసుకోవడం తగదు. ఒక్కసారి మన పాత తెలుగు క్లాసిక్‌లను తీసుకుంటే... కళాత్మక విలువలు తప్ప... మనం తరచు చెప్పుకునే ‘కమర్శియల్ హిట్’ ఫార్ములా కనిపించదు. ‘హిట్ ఫార్ములా’ అంటే ఒక్కడే హీరో వందమందిని ఒంటి చేత్తో కొట్టడమే అనుకుంటే... భారీలొకేషన్లు, విదేశాల్లో పాటలే- అనుకుంటే ఇప్పుడొస్తున్న అన్ని సినిమాలు హిట్ కావాలి కదా! మరి అలా ఎందుకు జరగడం లేదు? అసలు మనం ఉత్తమచిత్రాలు తీయలేమా? తీయాలనుకునేవాళ్లకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి? ప్రేక్షకుల అభిరుచిలో కొత్తదనం ఉండడం లేదా?... ఇలాంటి విషయాలపై చర్చిస్తే బాగుంటుంది. - కొమ్ము రఘువీర్ యాదవ్, వరంగల్ ...అయినా కాలుస్తూనే ఉన్నారు! చట్టం అనేది ఆచరణలోకి వచ్చినప్పుడే విలువ ఉంటుంది. అలా కాకపోతే ఎన్ని చట్టాలు చేసుకొని ఏంలాభం? బహిరంగంగా ధూమపానం చేయడం తప్పు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇది తెలిసి కూడా చాలామంది బహిరంగంగానే సిగరెట్ కాలుస్తున్నారు. ఒకసారి నేను బస్‌స్టాప్‌లో నిల్చొని బస్సు కోసం ఎదురుచూస్తున్నాను. నా పక్కన నిల్చొన్న వ్యక్తి తన జేబులో నుంచి సిగరెట్ తీసి తాగడం మొదలుపెట్టాడు. ‘‘అలా దూరంగా వెళ్లి కాల్చండి. ఇబ్బందిగా ఉంది’’ అన్నాను అతడితో. ‘‘ఇబ్బందిగా ఉంటే నువ్వే దూరంగా వెళ్లు. నా సిగరెట్ పూర్తయిన తరువాత వచ్చి నిల్చో’’ అన్నాడు దురుసుగా. ఇలా మా మధ్య మాటా మాటా పెరిగి వాదులాడుకోవడం ప్రారంభించాము. ఇంత జరుగుతున్నా... చుట్టుపక్కల ఉన్నవాళ్లలో ఒక్కరు కూడా ‘‘ఏమయ్యా... తప్పు చేయడమే కాకుండా... అతి తెలివి ప్రదర్శిస్తున్నావా?’’ అని అతన్ని మందలించే ప్రయత్నం చేయలేదు. ఇంతకీ తప్పు ఎవరిది? తప్పు అని తెలిసినా... సిగరెట్ తాగిన ఆ పెద్ద మనిషిదా? తప్పు చేస్తున్నాడని తెలిసినా ఉదాసీనంగా ఉన్న ప్రయాణికులదా? - డి.ప్రభావతి, చిత్తూరు పాఠకులకు ఆహ్వానం ‘ఈ కాలమ్ మీదే’ అనే ఈ చర్చావేదికలో పాల్గొనండి. చర్చనీయాంశం మీ ఇష్టం. ఏ సామాజిక అంశాన్నయినా, ఆలోచననైనా మీరు చర్చకు పెట్టొచ్చు. మీ వాదనను వినిపించవచ్చు. దానిపై మిగతా పాఠకులనూ చర్చకు ఆహ్వానిస్తుంది సాక్షి ఫ్యామిలీ. వీటిని ప్రతి సోమవారం ప్రచురిస్తుంది. వెంటనే రాసి పంపండి. మీ చర్చనీయాంశం పంపవలసిన చిరునామా ‘ఈ కాలమ్ మీదే’ సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 . ఇ-మెయిల్: sakshireaders@gmail.com