ఈ కాలమ్ మీదే : చర్చా వేదిక | This column is yours: Discussion vedikasan | Sakshi
Sakshi News home page

ఈ కాలమ్ మీదే : చర్చా వేదిక

Published Sun, Mar 8 2015 11:51 PM | Last Updated on Sat, Sep 2 2017 10:31 PM

This column is yours: Discussion vedikasan

ర్యాంకులు ముఖ్యం కాదు...
 నేను గత ఇరవై సంవత్సరాలుగా స్కూల్ నడుపుతున్నాను. ఎందరో తల్లిదండ్రులు వారి ఆలోచనలను నాతో పంచుకుంటూ ఉంటారు. బాధాకరమైన విషయం ఏమిటంటే, అందరూ మాట్లాడేది మార్కులు, ర్యాంకుల గురించే.
 ‘పిల్లలు పరిపూర్ణమైన వ్యక్తిత్వాన్ని పెంపొందించుకుంటున్నారా?’
 ‘జీవితంలో ఎదురయ్యే సమస్యలను తట్టుకునే విధంగా ఎదుగుతున్నారా?’


 ‘తోటివారితో కలిసి మెలసి ఉంటున్నారా?’
 ‘ఆడా, మగా సమానమనే భావాన్ని కలిగి ఉన్నారా?’
 ... ఇలాంటి వాటి గురించి ఎవరూ అడగడం లేదు.
 ర్యాంకుల కంటే జీవితాన్ని గెలవగలిగేలా తయారుచేసేదే నిజమైన విద్య. అప్పుడే ఆత్యన్యూనత అనేది దూరంగా పారిపోతుంది. నిజమైన జ్ఞానంతో మనిషి ప్రకాశిస్తూ లోకకళ్యాణానికి దోహదం చేయగలుగుతాడు. తల్లిదండ్రులు ఆ దిశగా ఆలోచించాలని కోరుకుంటున్నాను.
 - కాసర లక్ష్మిసరోజారెడ్డి, జంగారెడ్డి గూడెం, పశ్చిమగోదావరి.
 
అది ప్రయివేట్ విషయం ఎలా అవుతుంది?!

నూజివీడు నుంచి ఒక పాఠకుడు ‘అయ్యో పాపం... తులసీ’ అనే హెడ్డింగ్‌తో రాసిన ఉత్తరాన్ని చదివిన తరువాత చాలా బాధ కలిగింది. ‘చెట్లను కాపాడండి... అవి మనల్ని కాపాడుతాయి’ అనే మాటను మరిచిపోతున్నారు. ‘చెట్లను కాపాడడం వల్ల మనకు వచ్చే లాభం ఏమిటి? కొట్టేస్తే అనేక లాభాలు ఉన్నాయిగానీ..’’ అని తాత్కాలిక లాభాల గురించి స్వార్థపూరితంగా ఆలోచిస్తున్నారు తప్ప వేరే రకంగా ఆలోచించడం లేదు.
  ఇంట్లో ఫర్నీచర్ చేయించుకోవడానికి మా ఇంటి పక్కాయన కూలీలను నియమించి చెట్టును కొట్టేయిస్తున్నాడు.
 ‘‘అదేంటయ్యా... ఆ చెట్టు ఏం పాపం చేసింది?’’ అన్నాను కాస్త కోపంగా.
 ‘‘ఫర్నీచర్ చేయించుకోవాలి’’ అని తాపీగా ఒక్క ముక్కలో చెప్పాడు.
 ‘‘ఫర్నీచర్ కోసం చెట్టు కొట్టేయడం తప్పు కదా!’’ అన్నాను.
 ‘‘తప్పు ఒప్పుల గురించి మాట్లాడడానికి నువ్వెవరు? ఇది మా సొంత విషయం’’ అని నాతో తగాదా పడ్డాడు ఆ పుణ్యాత్ముడు.
 నేను షాక్ అయ్యాను! చెట్లను నరకడం అనేది ప్రయివేట్ విషయమా?!
 కఠిన చట్టాలు లేకపోవడం వల్ల, ఉన్న చట్టాలు కూడా చప్పగా ఉండడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. దేవుడి కోసం వందలు, వేలు ఖర్చు చేయనక్కర్లేదు. మన బాధ్యతను మనం సక్రమంగా నిర్వహిస్తే చాలు... దేవుడే న్యాయం చేస్తాడు.
 నిజానికి చెట్లు అనేవి మనకు కనిపించే ప్రత్యక్షదైవాల్లాంటివి. నిలవ నీడను ఇచ్చే చెట్ల పట్ల అమానుషంగా ప్రవర్తించడం ఏ రకంగానూ సమంజసం కాదు. క్రూరమైన జంతువులు కూడా ఇలాంటి క్రూరమైన పనులు చేయవు.
 - జి.ప్రభాకర్, కనపర్తి, వరంగల్ జిల్లా.
 
చెట్లను నిర్లక్ష్యం చేస్తే...
 
గత వారం ప్రచురించిన ‘అయ్యో పాపం తులసీ’ ఉత్తరం, ‘పీకే’ సినిమాపై వచ్చిన ఉత్తరాలు చదివాక ఇది రాయాలనిపించింది. నిజానికి రెండిటికీ సంబంధం ఉంది. భక్తి అనేది వాణిజ్యపరం కావడాన్ని గురించి ‘పీకే’ సినిమాలో ప్రశ్నించారు. బయట పరిస్థితి కూడా అలా ఉందనే విషయం ‘అయ్యో పాపం తులసీ’ ఉత్తరం చెప్పకనే చెప్పింది.
 ‘దేవుడిని మొక్కుకుంటే చాలు... ఇక మిగతా విషయాలను గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు’ అనే భావన పెరిగిపోతుంది. ఇతరులతో మర్యాదగా వ్యవహరించడం, పర్యావరణ స్పృహ కలిగి ఉండడం, నైతిక విలువలతో ప్రవర్తించడం... ఇవి కూడా భక్తిశ్రద్ధలతో చూడాల్సిన విషయాలు.
 ‘దేవుడు అన్నిచోట్ల ఉంటాడు’ అంటుంటారు.
 మనం మనసు పెట్టి చూడాలేగానీ... చెట్టులో కూడా దైవం ఉంది. చెట్టును నిర్లక్ష్యం చేస్తే దైవాన్ని నిర్లక్ష్యం చేసినట్లే కదా!!
 - ఆర్.శ్యాంసుందర్, శ్రీకాకుళం
 
పైపై చర్యల వల్ల ప్రయోజనం ఉండదు
 
‘స్వచ్ఛభారత్’ మంచి కార్యక్రమమేగానీ ‘నామ్‌కే స్వచ్ఛభారత్’గా మారింది. ఒకరోజు శుభ్రం చేయడం, ఫొటోలకు పోజులు ఇవ్వడం వల్ల ‘స్వచ్ఛభారత్’ రాదు. పై పై చర్యల వల్ల ప్రయోజనం ఉండదు. సమస్య మూలాన్ని గుర్తించి దాన్ని నిర్మూలించడం వల్లే ఫలితం ఉంటుంది.
 - సొల్లేటి కొండల్‌రావు, పామూరు, ప్రకాశం జిల్లా.
   
చిత్తశుద్ధి లేని చెత్తశుద్ధి ఏల?

స్వచ్ఛభారత్ కార్యక్రమం ‘ఫొటో సెషన్’ కార్యక్రమంగా మారిందా? అనిపిస్తుంది. ఒక పని చేస్తే చిత్తశుద్ధితో చేయాలి. లేదంటే చేయకూడదు. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో చాలామంది మొక్కుబడిగా పాల్గొంటున్నారు. స్వచ్ఛభారత్ అనేది ప్రభుత్వ కార్యక్రమం కాదు... అది మన కార్యక్రమం అనుకున్నరోజు ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది. చెత్తశుద్ధి చేయడానికే ఎక్కడెక్కడికో వెళ్లనక్కర్లేదు. ఎవరి ఇంటి దగ్గర వాళ్లు, ఎవరు ఆఫీసు దగ్గర వాళ్లు, ఎవరి కాలేజీల దగ్గర వాళ్లు చెత్తను శుభ్రం చేస్తే మంచిది. ప్రచారానికి వెచ్చించే డబ్బును శుభ్రతకు ప్రాధాన్యత ఇచ్చే గ్రామాలు, వీధులకు ప్రోత్సాహక బహుమతిగా ఇస్తే మంచిది.
 - సి.ప్రతాప్, మధిర
 
పాఠకులకు ఆహ్వానం

 
‘ఈ కాలమ్ మీదే’ అనే ఈ చర్చావేదికలో పాల్గొనండి. చర్చనీయాంశం మీ ఇష్టం. ఏ సామాజిక అంశాన్నయినా, ఆలోచననైనా మీరు చర్చకు పెట్టొచ్చు. మీ వాదనను వినిపించవచ్చు. దానిపై మిగతా పాఠకులనూ చర్చకు ఆహ్వానిస్తుంది సాక్షి ఫ్యామిలీ. వీటిని ప్రతి సోమవారం ప్రచురిస్తుంది. వెంటనే రాసి పంపండి. మీ చర్చనీయాంశం పంపవలసిన చిరునామా: ‘ఈ కాలమ్ మీదే’ సాక్షి ఫ్యామిలీ,
 సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34
ఇ-మెయిల్: sakshireaders@gmail.com

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement