‘బహిరంగ ధూమపానం’పై చర్చకు స్పందన
ముతకతనం పోవాలి...
నేను అమెరికా, సింగపూర్‌లోలలోని మా అమ్మాయిల ఇళ్ళకి వెళ్లినప్పుడు, దారిలో దుబాయ్, పారిస్‌లను చూసినప్పడు అక్కడి ప్రజలు ఇతరులతో ఎంతో మర్యాదగా ప్రవర్తించే సంస్కృతిని గమనించాను. వారు ఏదైనా పొరపాటు చేస్తే తక్షణం ‘సారీ’ చెబుతారు. ఇతరులు తమ తప్పును ఎత్తి చెబితే సిగ్గు పడుతారు తప్ప మనలాగా అహాలకి పోయి పొగరుగా ప్రవర్తించరు.
ఒక వృద్ధుడు విజయవాడ నుంచి మంగళగిరి దాకా నించొని ప్రయాణిస్తే ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులలో ఒక్కరు కూడా ఆయనకు సీటు ఇవ్వలేదు. బహిరంగ ధూమపానం కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు...మనలో పేరుకు పోయిన ముతకతనాన్ని తొలిగించుకోవాలి. తల్లిదండ్రులు పిల్లలకు చదువు మాత్రమే కాదు...మర్యాదమన్ననలు కూడా నేర్పాలి.
- జె.సుధారాణి, మాచవరం డౌన్, విజయవాడ
పూర్తిగా నిషేధించాలి
బహిరంగ ధూమపానం గురించి మాట్లాడుకునే ముందు.. ధూమపానం గురించి మొదట మాట్లాడుకోవాలి. ధూమపానాన్ని నిషేధిస్తే... బహిరంగ ధూమపానమే కాదు... ఎలాంటి ధూమపానం ఉండదు కదా! ధూమపానాన్ని ప్రభుత్వం ఒక సామాజిక సమస్యగా చూసి దాని సంపూర్ణ నిషేధానికి ఒక సమగ్రమైన ప్రణాళిక తయారు చేయాలి. దీనికి సంబంధించి ఒక కమిటీని కూడా నియమిస్తే మంచిది.
చిన్న కుర్రాళ్ల నుంచి పెద్దవారి వరకు... సిగరెట్టు తాగడం అనేది గొప్ప విషయం అనుకుంటున్నారు. ఆదాయం గురించి ఆలోచించకుండా... ప్రభుత్వం ధూమపానాన్ని పూర్తిగా నిషేధిస్తే మంచిది.
- సి.రమణ, కర్నూల్
పొగతాగడం వీరత్వమా?
సినిమాల్లో హీరో తన వీరత్వాన్ని చాటుకోవడానికి తప్పనిసరిగా సిగరెట్ తాగుతాడు. పదిమంది గూండాలను చితక్కొట్టాలంటే కూడా సిగరెట్ తాగుతాడు. ఒక గంభీరమైన డైలాగ్ కొట్టడానికి కూడా సిగరెట్ తాగుతాడు. దీంతో సిగరెట్ తాగడం అనేది గ్లామరైజైపోయి యువతకు ఆదర్శమైపోయింది. సినిమాల్లో పొగతాగే దృశ్యాలను పూర్తిగా నిషేధించాలి. కేవలం హెచ్చరిక టైటిల్ వేసినంత మాత్రాన ప్రయోజనం ఉండదు.
- డి.రంగాచారి, అమలాపురం
తెలుగు భాషపై చర్చకు స్పందన
ప్రజలే పూనుకోవాలి
వినియోగంలో ఉంటేనే భాష బతుకుతుంది. లేదంటే పుస్తకాలకు మాత్రమే పరిమితమైపోతుంది. మన తెలుగు భాష గొప్పదనం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి గొప్ప భాషను బతికించుకోవడానికి ప్రభుత్వాలు, అవి ఏర్పాటు చేసిన కమిటీల వల్ల ప్రయోజనం లేదు. ప్రజలే పూనుకోవాలి.
దైనందిన జీవితంలో మనం ఎంత వరకు ఇంగ్లీష్‌ను ఉపయోగిస్తున్నాం, ఎంత వరకు మాతృభాషలో మాట్లాతున్నాం? అనేది బేరిజు వేసుకొని...అందుకనుగుణంగా ప్రణాళిక రూపొందించుకోవాలి. మాట్లాడే మాటల్లో తెలుగు మాత్రమే వినబడేలా జాగ్రత్త పడాలి.
- సి.రజిత, హైదరాబాద్
తెలుగు గొప్పదనం తెలియాలంటే...
నేటి తరానికి తెలుగు గొప్పదనం తెలియాలంటే పనిగట్టుకొనైనా వారి చేత తెలుగులో ఉత్తమ సాహిత్యం చదివించాలి. మా అబ్బాయి ఇంగ్లీష్ నవలలు తెగ చదివేవాడు.
‘‘ఎప్పుడు చూసినా ఇంగ్లీష్ నవలలేనా? తెలుగు సాహిత్యం కూడా చదవచ్చు కదా!’’ అన్నానోసారి.
‘‘ఆ... మన తెలుగులో ఏముంది!’’ అన్నాడు.
‘‘ఏమి ఉందో లేదో తెలుసుకోవడానికి... ముందు నువ్వు తెలుగు సాహిత్యం చదవాలి కదా. నీ కోసం కాదు... నా కోసం కొన్ని తెలుగు పుస్తకాలు చదువు’’ అన్నాను.
‘‘అలాగే’’ అని ఒప్పుకున్నాడు.
నేను కొన్ని పుస్తకాలు సెలెక్ట్ చేసి వాడికి ఇచ్చాను. నెల రోజుల్లో ఆ పుస్తకాలను చదివాడు. ఒకరోజు నా దగ్గరకు వచ్చి - ‘‘సారీ నాన్నా. నా అభిప్రాయం తప్పు. నువ్వు ఇచ్చిన పుస్తకాల వల్ల తెలుగు గొప్పదనం తెలిసింది’’ అన్నాడు. ఇక అప్పటి నుంచి పాత తెలుగు పుస్తకాలు చదవడంతో పాటు, తెలుగులో ఏ కొత్త పుస్తకం వచ్చినా చదవడం అలవాటు చేసుకున్నాడు.
తెలుగు భాషను అభిమానించే తల్లిదండ్రులు...నాలా ఒక ప్రయత్నం చేస్తే మంచిది కదా!
- కంది సత్యనారాయణ, విశ్రాంత ఉపాధ్యాయులు, నిజామాబాద్
‘తెలుగు సినిమా’పై చర్చకు స్పందన
దర్శకులతో చర్చా కార్యక్రమం ఏర్పాటు చేయాలి
ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా... తెలుగు సినిమాల్లో మార్పు కనిపించడం లేదు అనేది వాస్తవం. పది సినిమాలు చూసి ఒక సినిమాను చుట్టేస్తున్నారు. అందుకే ఎన్ని సినిమాలు చూసినా ఒకే సినిమా చూసినట్లే అనిపిస్తుంది. ముఖం మొత్తుతుంది.
ఒక మంచి సందర్భం చూసుకొని మన తెలుగు దర్శకులందరితో ‘మనం విలక్షణమైన సినిమాలు ఎందుకు తీయలేకపోతున్నాం?’ అనే దానిపై చర్చావేదిక ఏర్పాటు చేస్తే ఎన్నో కొత్త విషయాలు తెలుస్తాయి. ఈ ప్రయత్నం వీలైనంత త్వరగా జరిగితే మంచిది.
- రామారపు వీరన్న, గుండ్రపల్లి, వరంగల్ జిల్లా
పాఠకులకు ఆహ్వానం
‘ఈ కాలమ్ మీదే’ అనే ఈ చర్చావేదికలో పాల్గొనండి. చర్చనీయాంశం మీ ఇష్టం. ఏ సామాజిక అంశాన్నయినా, ఆలోచననైనా మీరు చర్చకు పెట్టొచ్చు. మీ వాదనను వినిపించవచ్చు. దానిపై మిగతా పాఠకులనూ చర్చకు ఆహ్వానిస్తుంది సాక్షి ఫ్యామిలీ. వీటిని ప్రతి సోమవారం ప్రచురిస్తుంది. వెంటనే రాసి పంపండి. మీ చర్చనీయాంశం పంపవలసిన చిరునామా: ‘ఈ కాలమ్ మీదే’ సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 ఇ-మెయిల్: sakshireaders@gmail.com
ఈ కాలమ్ మీదే : చర్చా వేదిక
Published Sun, Feb 15 2015 11:53 PM | Last Updated on Sat, Sep 2 2017 9:23 PM
Advertisement