
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీలు విద్వేషపూరిత ఉపన్యాసాలు చేశారని, వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలంటూ ఢిల్లీ హైకోర్టులో గురువారం పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఢిల్లీ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ముంబై మాజీ ఏఐఎంఐఎం ఎమ్మెల్యే వరీస్ పఠాన్‌లు విద్వేషపూరిత ఉపన్యాసాలు చేశారని, వారిపైనా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయాలంటూ ‘లాయర్స్ వాయిస్’ తరఫున గురువారం పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లను హైకోర్టు శుక్రవారం విచారించనుంది. ఆల్ ఇండియా మజ్లిస్ ఈ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) నేతలు అసదుద్దీన్ ఒవైసీ, అక్బరుద్దీన్ విద్వేషపూరిత ఉపన్యాసాలు చేశారని, వారిపైనా కేసులు నమోదు చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో హిందూసేన పిటిషన్ వేసింది.