ఎంపీలు, ఎమ్మెల్యేల గౌరవ చర్య
చెన్నై: అమ్మకోసం కన్నీటి సంద్రమైన తమిళనాడులో మరో అరుదైన ఘట్టం నమోదైంది. జయలలితకు అంత్యక్రియలు నిర్వహించిన మెరీనా బీచ్ వేలాదిమందితో మరోసారి పోటెత్తింది. దీంతో ఎంజీఆర్, జయలలితను సమాధుల ప్రదేశం పుణ్యక్షేత్రాన్ని తలపిస్తోంది. వేలాదిగా తరలి వచ్చిన మహిళలు, పురుషులతో పాటు ఏఐడీఎంకే ఎంపీలు, ఎమ్మెల్యేలూ అమ్మకు నివాళిగా తలనీలాలు సమర్పిస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
అమ్మపై అభిమానంతో తలనీలాలు సమర్పించిన ఎంపీ సెంథిల్ నాథన్ మాట్లాడుతూ.. అమ్మ కేవలం ఓ నాయకురాలు మాత్రమే కాదని తమ కుటుంబసభ్యుల్లో ఆమె ఒకరని అన్నారు. కుటుంబసభ్యుల్లో ఒకరిని పోగొట్టుకున్నందుకు అందరం గుండు గీయించుకుంటున్నట్లు తెలిపారు. జయలలిత ఆఖరి విశ్రాంత స్థలంవద్ద అన్నాడీఎంకే ఎంపీలు, ఎమ్మెల్యేలు కార్యకర్తలు, అభిమానులు గౌరవం సూచకంగా తలనీలాలు సమర్పిస్తూ నివాళులర్పిస్తున్నారు. అసంఖ్యాకంగా హాజరైన జయలలిత అభిమానులు సమాధిని దర్శించుకొని కన్నీరు మున్నీరవుతున్నారు.