సాక్షి, విశాఖపట్నం: 1996 నాటి శిరోముండనం కేసులో విశాఖ ఎస్సీ, ఎస్టీ కోర్టు మంగళవారం కీలక తీర్పు వెల్లడించింది. శిరోముండనం చేసినట్లు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. దాడి కేసులో మాత్రం మొత్తం 10 మందిని దోషులుగా కోర్టు గుర్తించింది. ఈ పది మందిలో ఒకరు మృతి చెందారు. నిందితులకు అట్రాసిటీ కేసులో 18 నెలల జైలు శిక్ష విధించింది. ఒక్కొక్కరికి 42,000 రూపాయల చొప్పున 3,78,000 జరిమానా విధించింది.
ఈ కేసులో 28 ఏళ్లపాటు వివిధ కోర్టుల్లో కేసు విచారణ కొనసాగింది. విశాఖ కోర్టులోనూ సుదీర్ఘకాలం విచారణ జరగ్గా.. ఎట్టకేలకు తీర్పు వెల్లడించింది. కోర్టు దోషులుగా గుర్తించిన పది మందిలో రాజకీయ నాయకుడు తోట త్రిమూర్తులు ఒకరు. నేరం జరిగినప్పుడు త్రిమూర్తులు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు.
1996లో చంద్రబాబు సీఎంగా ఉండగా డిసెంబర్ 29న ఈ ఘటన జరిగింది. వెంకటాయపాలెంలో అయిదుగురు దళితులను చిత్రహింసలు పెట్టారని, వారికి శిరోముండనం చేశారని కేసు నమోదయింది. భారతీయ శిక్షాస్మృతి 342, 324, 506 లతోపాటు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం సెక్షన్ 3 లతో రామచంద్రాపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు 28 ఏళ్ల పాటు విచారణ జరిగి ఈ రోజు తుది తీర్పు వెలువడింది.
తోట త్రిమూర్తులు భవితవ్యమేంటీ?
1994లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రామచంద్రపురం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా తోట త్రిమూర్తులు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అనంతరం1995లో తెలుగుదేశం పార్టీలో చేరి పార్టీ అభ్యర్థిగా రామచంద్రపురం నుంచి1999లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అదే సమయంలో ఈ ఘటన జరిగింది. 2024లో జరుగుతున్న ఎన్నికల్లోనూ ఆయన పోటీ చేయనున్నారు. తొలుత శిక్ష విషయంపై ఆందోళన చెందినా.. కోర్టు 18 నెలల జైలు శిక్ష మాత్రమే విధించడంతో పోటీ చేయడానికి ఎలాంటి ఇబ్బందులు లేవని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈ కేసులో బెయిల్ కోసం త్రిమూర్తులుతో సహా నిందితులందరూ దరఖాస్తు చేసుకున్నారు. నిందితులు హైకోర్టులో అప్పీలు చేసుకోవడానికి గడువు కావాలని కోరడంతో న్యాయమూర్తి వారికి తాత్కాలిక బెయిల్ మంజూరు చేశారు.
చట్టాన్ని గౌరవిస్తాను
చట్టాన్ని గౌరవించడం నా బాధ్యత, ఈ కేసుపై హైకోర్టులో అప్పీల్ చేసుకోవాలని భావిస్తున్నాను, అందుకే గడువు కోసం బెయిల్ విజ్ఞప్తి చేయగా... కోర్టు అంగీకరించింది : తోట త్రిమూర్తులు
Comments
Please login to add a commentAdd a comment