మహిళలకు మంత్రి సవిత క్షమాపణలు చెప్పాలి: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు
సాక్షి, అమరావతి: ఏపీ శాసనమండలిలో మంత్రి సవిత చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో డీబీటీ డబ్బుల ద్వారా మహిళలు గంజాయి, మద్యానికి బానిసలు అయ్యారని మంత్రి వ్యాఖ్యలు చేయడంపై ఎమ్మెల్సీలు మండిపడ్డారు. మంత్రి సవిత.. తక్షణమే రాష్ట్ర మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ..‘సభలో మంత్రి సవిత తీవ్ర అభ్యంతరమైన వ్యాఖ్యలు చేశారు. మంత్రి సవిత తక్షణమే రాష్ట్రంలోని మహిళలకు క్షమాపణ చెప్పాలి. మంత్రి పదే పదే సభలో కాపుల గురించి ప్రస్తావించారు. కాపులు ఓటేశారు కాబట్టే కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ ఆరు నెలల్లో కాపులకు ఏం చేశారో మీరు సమాధానం చెప్పాలి. పది వేల కోట్లు ఇస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం బడ్జెట్లో ఒక్క రూపాయి ఇవ్వలేదు. దేశంలో ఎవరూ చేయనంత సంక్షేమం కాపులకు వైఎస్ జగన్ చేశారు. బటన్ నొక్కడం వల్ల మహిళలు గంజాయికి, మద్యానికి అలవాటు పడ్డారనడం దుర్మార్గం అని మండిపడ్డారుఎమ్మెల్సీ కుంభా రవిబాబు మాట్లాడుతూ..‘సభలో బాధ్యత గల మంత్రులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. అనుచితమైన వ్యాఖ్యలతో కించపరిచేలా మాట్లాడుతున్నారు. మంత్రి సవిత మహిళలను అవమానించేలా మాట్లాడారు. సంక్షేమాన్ని అద్భుతంగా అమలు చేసిన నాయకుడు వైఎస్ జగన్. మహిళలు గంజాయి, మద్యానికి బానిసలైపోయారనడం దారుణం. సభ్య సమాజం తలదించుకునేలా మంత్రి సవిత వ్యాఖ్యానించారుఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ మాట్లాడుతూ.. ఎస్సీ, బీసీ, మైనార్టీలను అవమానించేలా కూటమి నేతల వైఖరి ఉంది. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్..హోంమంత్రిని చులకన చేసి మాట్లాడారు. దళిత హోంమంత్రి పదవిలో ఉండటం వల్లే చులకనగా మాట్లాడారని మేం భావిస్తున్నాం. మంత్రి సత్యకుమార్ ముస్లిం, మైనార్టీలను కించపరిచేలా మాట్లాడారు. ఈరోజు మంత్రి సవిత.. మహిళలు గంజాయి, మద్యానికి అలవాటైపోయారంటున్నారు. మంత్రులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక పెద్దలు ఉన్నారని మేం భావిస్తున్నాం. ఇలాంటి వ్యాఖ్యలు మానుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారు. ప్రతీ ప్రైవేట్ స్కూల్లో 25 శాతం పేదలకు సీట్లు కేటాయించాలని చట్టం చెబుతోంది. వైఎస్ జగన్ అమ్మఒడి ద్వారా పేదలు చదువుకునేలా చర్యలు తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్ధుల కోసం ఎలాంటి చర్యలు తీసుకున్నారో సమాధానం చెప్పాలి.ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. మంత్రి సవిత వ్యాఖ్యలు చాలా హేయమైనవి. ఒక మహిళా మంత్రిగా ఉండి ఇలా మాట్లాడటం సిగ్గుచేటు. ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలకు కనీస విలువ లేదు. వైఎస్ జగన్ మహిళలకు పెద్దపీట వేశారు. మహిళలను కించపరిచే సంస్కృతి చంద్రబాబుది. 2014-19లో సాక్షాత్తూ చంద్రబాబు సీఎంగా మహిళలను కించపరిచేలా మాట్లాడారు. నోటితో చెప్పలేని విధంగా బాలకృష్ణ మహిళలను అవమానపరిచారు. తక్షణమే మహిళలందరికీ మంత్రి సవిత క్షమాపణ చెప్పాలి.ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ..‘సోషల్ మీడియా పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోంది. అమాయకులను స్టేషన్లకు తీసుకెళ్లి చిత్రహింసలకు గురిచేస్తున్నారు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే చర్యలు తీసుకుంటామని చంద్రబాబు, పవన్, హోంమంత్రి చెబుతున్నారు. సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన పెట్టిన తప్పుడు పోస్టులపై ఎందుకు మాట్లాడరు. మంత్రులను చెప్పులతో కొడతానని పవన్ మాట్లాడలేదా?. వైఎస్ జగన్పై నోటికొచ్చినట్లు పవన్ మాట్లాడలేదా?. పవన్ కళ్యాణ్ చేసింది నేరం కాదా?. మేం మాట్లాడితేనే నేరమా?. ప్రజా గొంతుకై మాట్లాడితే మాగొంతు నొక్కేస్తారా. కేసులకు మేం భయపడం.. ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటాం అని అన్నారు.