
తెలుగుకు వెలుగునివ్వండి
తమిళనాడులోని తెలుగువారి పిల్లలు తమ మాతృభాషను అభ్యసించేలా మరికొంత కాలం వెసులుబాటు కల్పించాలని
తమిళనాడులోని తెలుగువారి పిల్లలు తమ మాతృభాషను అభ్యసించేలా మరికొంత కాలం వెసులుబాటు కల్పించాలని తదితర డిమాండ్లపై చెన్నైలోని వివిధ తెలుగు సంఘాల ప్రతినిధులు రాష్ట్ర పశుసంవర్ధక శాఖా మంత్రి బాలకృష్ణారెడ్డిని మంగళవారం కలిశాయి.
సాక్షి ప్రతినిధి, చెన్నై:డీఎంకే ప్రభుత్వం 2006లో తీసుకొచ్చిన నిర్బంధ తమిళ చట్టం రాష్ట్రంలోని మైనార్టీ భాషల విద్యార్థుల పాలిట గుదిబండగా మారింది. పదోతరగతి పరీక్షల్లో విధిగా తమిళ పరీక్ష రాయాలన్న నిబంధనతో కూడిన ఈ చట్టాన్ని వెనక్కు తీసుకోవాలని, కొన్నేళ్లపాటు వెసులుబాటు కల్పించాలని కోరుతూ చెన్నైలోని తెలుగు సంఘాలు గత కొంతకాలంగా ప్రభుత్వంతో పోరాడుతున్నాయి. చివరకు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించాయి. 2015-16 విద్యాసంవత్సర పదో తరగతి విద్యార్థులు తొలిసారిగా నిర్బంధ తమిళం చట్టంకు గురి అయ్యే ప్రమాదం నుండి మద్రాసు హైకోర్టు కాపాడింది.
అయితే మళ్లీ ఈ విద్యాసంవత్సరంలో మైనార్టీ భాషల విద్యార్థులు నిర్బంధ తమిళం చట్టం చట్రంలో చిక్కుకోకుండా తెలుగు సంఘాలు అప్రమత్తమైనాయి. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగువారి కోటాలో హోసూరు నుండి అన్నాడీఎంకే ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా బాధ్యతలు చేపట్టిన బాలకృష్ణారెడ్డిని చెన్నైలోని ప్రభుత్వ అతిధి గృహంలో తెలుగు సంఘాల ప్రతినిధులు మంగళవారం కలుసుకున్నారు. ఈ సందర్బంగా వివిధ కోర్కెల వినతిపత్రాన్ని ద్రవిడ దేశం అధ్యక్షులు వి కృష్ణారావు, అఖిలభారత తెలుగు సమాఖ్య, లింఫాట్ అధ్యక్షులు డాక్టర్ సీఎంకే రెడ్డి మంత్రికి అందజేశారు.
నిర్బంధ తమిళం చట్టాన్ని రద్దు చేయాలని లేదా మరో నాలుగేళ్లపాటు మాతృభాషల్లోనే పది పరీక్షలు రాసే అవకాశం కల్పించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు, తమిళ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని, మైనార్టీ మాతృభాషల సిలబస్‌లో చేర్చి 1-9 తరగతుల వరకు నామమాత్ర మార్కులతో ఉత్తీర్ణులయ్యే విధానాన్ని ప్రవేశపెట్టాలని, ఆంధ్రప్రదేశ్‌లోలా మూడు భాషల విధానాన్ని అమలు చేయాలని వారు మంత్రిని కోరారు. ఈ సందర్భంగా మంత్రి బాలకృష్ణారెడ్డి తమ విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించారని సీఎంకే రెడ్డి, కృష్ణారావు మీడియాకు తెలిపారు. 2006లో ప్రవేశపెట్టిన నిర్బంధ తమిళం చట్టం అమలులో విఫలమైందని మంత్రి కూడా అంగీకరించారని తెలిపారు.
దక్షిణాదిలోని తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం..ఈ నాలుగు భాషలను తమ ప్రభుత్వం ద్రవిడ భాషలుగా పరిగణిస్తూ సమభావంతో చూస్తున్నదని మంత్రి అన్నారని తెలిపారు. మైనార్టీ సంఘాల కోర్కెలను ముఖ్యమంత్రి జయలలిత దృష్టికి తీసుకెళుతానని మంత్రి హామీ ఇచ్చారని వారు వివరించారు. జనని ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య, ప్రముఖ గాయకులు ఘంటసాల రత్నకుమార్, మద్రాసు యూనివర్సిటీ తెలుగు విభాగాధిపతి మాడభూషి సంపత్‌కుమార్, ఉర్దూ కాలేజీ ప్రిన్సిపాల్ ఎం యతిరాజులు, ఎస్ గజేంద్రబాబు, టీ బాబు, పీఆర్ కేశవులు, గంగన్న మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.