చెన్నై: తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి తీరుపై అక్కడి అధికార పక్షం డీఎంకే తీవ్రస్థాయిలో అసంతృప్తితో రగిలిపోతోంది. అవినీతి ఆరోపణలతో అరెస్ట్ అయిన బాలజీ సెంథిల్‌ను ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే మంత్రి పదవి నుంచి తొలగించడం.. అదీ న్యాయపరమైన చిక్కుల్ని తెచ్చిపెట్టే అంశం కావడంతో గవర్నర్ రవి వెనక్కి తగ్గడం తెలిసిందే. ఈ వ్యవహారం తర్వాత డీఎంకే రోజుకో రీతిలో గవర్నర్ తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ వస్తోంది.
తాజాగా.. ఊహించని పరిణామం ఒకటి చోటు చేసుకుంది. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై, గవర్నర్ ఆర్‌ఎన్ రవి తీరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ చేస్తున్న విమర్శలు రాజకీయంగా బీజేపీకి మేలు చేసేవే అయినప్పటికీ.. అలాంటి ప్రకటనలకు గవర్నర్ దూరంగా ఉండాలనే తాను కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించారాయన.
విల్లుపురంలో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో మీడియాతో అన్నామలై పలు అంశాలపై మాట్లాడారు. ఈ క్రమంలో.. గవర్నర్ వ్యవహరశైలిపై మీడియా నుంచి ఆయనకు ప్రశ్న ఎదురైంది. ‘‘డీఎంకే సంధించే ప్రతీ ప్రశ్నకు గవర్నర్ రవి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, అది ఆయన పని కాదు. ఎందుకంటే ఆయన రాజకీయనేత కాదు. గవర్నర్ ప్రతిదానికీ సమాధానం చెప్పుకుంటూ పోతే.. ఈ వ్యవహారానికి పుల్‌స్టాప్ పడుతుందా?. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలన్నింటిపై ఆయన (రవి) రోజూ ప్రెస్‌మీట్లు పెడితే ఈ ప్రభుత్వం అంగీకరిస్తుందా? ఖచ్చితంగా అంగీకరించదు అని అన్నామలై వ్యాఖ్యానించారాయన. ఆ సమయంలో ఓ జర్నలిస్ట్ పొరుగు రాష్ట్రం తెలంగాణ ప్రస్తావన తెచ్చారు.
తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ సమస్యలపై రోజూ మీడియాతో మాట్లాడతారని.. అలాంటప్పుడు తమిళనాడు గవర్నర్ అదే చేస్తే అభ్యంతరం దేనికని ప్రశ్నించారు. దానికి అన్నామలై సమాధానమిస్తూ.. అలా జరిగితే అందరికంటే ఎక్కువ సంతోషించే వ్యక్తిని తానేనని, ఎందుకంటే గవర్నర్ అలా మీడియా ముందుకొచ్చి ప్రశ్నిస్తే అధికార పక్షం అక్రమాలు బయట పడతాయన్నారు. కానీ.. గవర్నర్ అలా చేయకూడదనే తాను బలంగా కోరుకుంటున్నట్లు చెప్పారాయన. ‘‘గవర్నర్ ఉంది రాజకీయాలు చేయడానికి కాదని అన్నామలై అభిప్రాయపడ్డారు.
గవర్నర్ రాజకీయాలు మాట్లాడకూడదు. ఎందుకంటే అది తప్పుడు సంకేతాలు పంపిస్తుంది. గవర్నర్ తన పని తాను చేసుకుంటూ పోవాలి. ఒకప్పుడు.. గవర్నర్లు ఆరు నెలలు లేదంటే సంవత్సరానికి ఒకసారి వార్తాపత్రికలకు ఇంటర్వ్యూలు ఇవ్వడం మనం చూశాం. అప్పుడది బాగానే ఉండేది. నేను ఇతర రాష్ట్రాల గవర్నర్లపై వ్యాఖ్యానించదలచుకోలేదు. ఎందుకంటే.. ఎవరి పని తీరు వారిది కాబట్టి. కానీ, తమిళనాడు విషయంలో అధికార డీఎంకే తప్పు చేసినప్పుడు.. ఆ పార్టీని బీజేపీ నేత విమర్శించడానికి.. ఓ గవర్నర్ విమర్శించడానికి తేడా ఉంటుంది కదా. అసెంబ్లీ లోపల గవర్నర్ ప్రభుత్వాలపై విమర్శనాత్మక వ్యాఖ్యలు చేయవచ్చు. అలా కాకుండా నాలాగే రోజూ ప్రెస్ మీట్ పెట్టడం మొదలుపెడితే గవర్నర్ అనే హోదాకి ఉన్న గౌరవం పోతుంది అని అన్నామలై చెప్పారు.
ఇదీ చదవండి: మతతత్వ పార్టీలకు ప్రజాదరణ ఉండదు
Comments
Please login to add a commentAdd a comment