అధికారంలోకి వస్తే మిస్టరీ ఛేదిస్తాం
♦ శశికళ, పన్నీరుపై విచారణ కమిషన్
♦జయలలిత మరణంపై స్టాలిన్ వ్యాఖ్య
♦జాలర్లతో సమావేశం
సాక్షి, చెన్నై : తాము అధికారంలోకి రాగానే, జయలలిత మరణం వెనుక ఉన్న మిస్టరీని ఛేదించేందుకు అవసరమైన కీలక నిర్ణయాలు తీసుకుంటామని డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ తెలిపారు. శశికళ, పన్నీరుసెల్వంపై విచారణ కమిషన్ వేస్తామని ప్రకటించారు. ఆర్కేనగర్‌లో జాలర్ల సమస్యలపై జరిగిన సమావేశానికి స్టాలిన్ హాజరు అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల ముందు మనకు.. మనమే నినాదంతో స్టాలిన్ రాష్ట్ర పర్యటన సాగించిన విషయం తెలిసిందే.
అన్ని వర్గాలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తూ, వారి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ ఆ పర్యటనలో ముందుకు సాగారు. ఈ పర్యటనకు అమిత స్పందన రావడంతో ప్రస్తుతం మళ్లీ అన్ని వర్గాల సమస్యల అధ్యయనం మీద స్టాలిన్ దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా సోమవారం ఆర్కేనగర్ నియోజకవర్గం పరిధిలోని ఓ కల్యాణ మండపంలో జాలర్లతో ఆయన సమావేశం అయ్యారు. జాలర్ల సంఘాల ప్రతినిధులు, జాలర్ల కుటుంబాలు ఈ సమావేశానికి హాజరు అయ్యారు. తమ సమస్యలను స్టాలిన్‌కు వివరించారు.
సాగరంలో సాగుతున్న దాడులను, తమకు కరువు అవుతోన్న భద్రతను ఏకరువు పెడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. జాలర్ల సంఘాల ప్రతినిధులు సందించిన ప్రశ్నలకు స్టాలిన్ సమాధానాలు ఇచ్చారు. ఈసందర్భంగా స్టాలిన్ తన ప్రసంగంలో జాలర్ల సంక్షేమం లక్ష్యంగా గతంలో డీఎంకే ప్రభుత్వం తీసుకున్న చర్యలను గుర్తు చేశారు.
నిఘా పెంచాలి : ఆర్కేనగర్‌లో ఎన్నికల యంత్రాంగం మరింత కఠినంగా వ్యవహరించాల్సి ఉందన్నారు. ఫిర్యాదుల్ని తక్షణం పరిశీలించి చర్యలు తీసుకోవడాన్ని ఆహ్వానిస్తున్నామన్నారు. రెండాకుల గుర్తు తన రూపంలో అన్నాడీఎంకేకు దురమైనట్టు టీటీవీ దినకరన్ చేస్తున్న ఆరోపణలపై తాను స్పందించ దలచుకోలేదన్నారు. ఇలాంటి వారిపై విమర్శలు గుప్పించి తన స్థాయిని దిగజార్చుకోదలచుకోలేదని వ్యాఖ్యానించారు. జల్లికట్టు మద్దతు ఉద్యమకారుల్ని అణచి వేయడానికి పోలీసులు సాగించిన తీరు సర్వత్రా ఖండించ దగ్గ విషయమేనని స్పందించారు.
ఆ సమయంలో విద్యార్థుల్ని పోలీసుల నుంచి రక్షించేందుకు అండగా నిలిచింది జాలర్ల కుటుంబాలకు చెందిన తల్లులేనని అభినందించారు. అధికారంలో ఉన్నప్పుడు నోరు మెదపని ఓ పన్నీరుసెల్వం, ఇప్పుడు స్పందిస్తున్న తీరు హాస్యాస్పందంగా ఉందని విమర్శించారు. తాను ఒక్కటే చెప్పదలచుకున్నానని, డీఎంకే అధికార పగ్గాలు చేపట్టగానే, జయలలిత మరణం వెనుక ఉన్న మిస్టరీని చేధించేందుకు తగ్గ నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. శశికళ, పన్నీరు సెల్వంSపై విచారణ కమిషన్ వేస్తామని, న్యాయ విచారణలో అన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.