‘అక్షయగోల్డ్’ కేసుల్లో రూ.12.2 కోట్ల ఆస్తులు జప్తు
హైదరాబాద్ సిటీ: ప్రకాశం జిల్లా ఒంగోలు కేంద్రంగా ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్షయ గోల్డ్ ఫర్మ్స్ అండ్ విల్లాస్ ఇండియా లిమిటెడ్, అక్షయ గోల్డ్ రియల్ ఎస్టేట్స్ అండ్ వెవలపర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కేసుల్లో రూ.12.2 కోట్ల స్థిరాస్తుల్ని జప్తు చేసేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సరైన రిజిస్ట్రేషన్లు, టైటిల్ డీడ్స్ లేని ఫ్లాట్ల అమ్మకాలతో పాటు వివిధ స్కీముల పేరుతో డిపాజిట్లు సేకరించిన ఈ సంస్థలు భారీగా మోసానికి పాల్పడ్డాయి.
రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన 17 కేసులపై దర్యాప్తు చేపట్టిన రాష్ట్ర నేర పరిశోధన విభాగం (సీఐడీ) అధికారులు డిపాజిట్‌దారుల నుంచి వసూలు చేసిన సొమ్ములో రూ.41.54 లక్షల్ని ఇతర సంస్థలకు మళ్ళించినట్లు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటి వరకు 25 మంది నిందితులుగా నిర్థారించిన అధికారులు వారితో పాటు సంస్థల పేరిట ఉన్న స్థిరాస్తుల వివరాలు సేకరించారు. కృష్ణా, గుంటూరు, మెదక్‌లతో పాటు విశాఖపట్నంలో ఉన్న రూ.12.2 కోట్ల ఆస్తుల్ని స్వాధీనం చేసుకున్నారు. వీటిని జప్తు చేసేందుకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సర్కారు మధ్యంతర అనుమతిస్తూ తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా సీఐడీ అదనపు డీజీని ఆదేశించింది.