సాక్షి, న్యూఢిల్లీ: చట్ట ఉల్లంఘనలకు పాల్పడిన మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మోసాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు క్షుణ్నంగా విచారణ జరపాలని ఆంధ్రప్రదేశ్ సీఐడీ విభాగం సూచించింది. మనీ లాండరింగ్, నిధుల స్వాహా, కార్పొరేట్ మోసాలు, బినామీ లావాదేవీలతో పన్ను ఎగవేత లాంటి కీలక అంశాలను తమ విచారణలో కనుగొన్న నేపథ్యంలో మరింత లోతుగా దర్యాప్తు చేయడం అవసరమని పేర్కొంది.
సీఐడీ ఏడీజీ సంజయ్ బుధవారం ఢిల్లీలో జాతీయ మీడియాతో మాట్లాడారు. చిట్‌ఫండ్ పేరుతో జరిగిన అతిపెద్ద ఆర్థిక మోసాన్ని ఆంధ్రప్రదేశ్‌లో అడ్డుకున్నట్లు వెల్లడించారు. చట్టవిరుద్ధంగా డిపాజిట్లు స్వీకరించిన చరిత్ర కలిగిన మార్గదర్శి చిట్ గ్రూప్ 1982 చిట్ ఫండ్ చట్టాన్ని ఉల్లంఘించి అమాయక చందాదారులను దోపిడీ చేస్తోందన్నారు.
మార్గదర్శి ఉల్లంఘనలన్నీ కేంద్ర దర్యాప్తు సంస్థల పరిధిలో ఉన్నందున రెండు రోజుల పాటు ఢిల్లీలో ఆయా విచారణ సంస్థలను కలుసుకుని వివరాలు అందచేసినట్లు చెప్పారు. మోసపూరిత ఆర్థిక సంస్థలు చట్టాలను ఉల్లంఘిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ప్రేక్షకపాత్ర వహించరాదని సుప్రీంకోర్టు ఓ కేసు విచారణ సందర్భంగా వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తు చేశారు.
సత్యం, సహారా, శారదా తరహాలో..
మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో ఉల్లంఘనలు, మోసపూరిత పద్ధతులు సత్యం కంప్యూటర్స్, సహారా, శారదా చిట్స్ మోసాలకు చాలా దగ్గరగా ఉన్నట్లు సంజయ్ తెలిపారు. ఈ దోపిడీని అరికట్టేందుకు మార్గదర్శి ఖాతా పుస్తకాలపై లోతైన విచారణ తప్పనిసరి అని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ దిశలోనే తమ దర్యాప్తు కొనసాగుతోందని, తదుపరి వివరాలు తగిన సమయంలో వెల్లడిస్తామన్నారు.
రహస్యంగా నిధుల మళ్లింపు..
డిపాజిట్ల ద్వారా మార్గదర్శి సేకరించిన నిధులను అనుబంధ కంపెనీలు, షేర్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్ లాంటి ఇతర పెట్టుబడులకు రహస్యంగా మళ్లించడంతోపాటు అధిక మొత్తంలో సభ్యత్వాలు స్వీకరిస్తూ మనీలాండరింగ్‌కు పాల్పడుతోందన్నారు. వడ్డీ, భద్రత అందించే పేరుతో చందాదారుల సొమ్మును మార్గదర్శి వద్దే ఉంచాలని బలవంతం చేయడం, ‘చెక్స్ ఆన్‌హ్యాండ్, క్యాష్ ఆన్‌హ్యాండ్’ పేరుతో నగదు నిల్వల్ని పెంచడం లాంటి మోసపూరిత అకౌంటింగ్ పద్ధతుల ద్వారా ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలిపారు.
ఈమేరకు ఎఫ్‌ఐఆర్‌లలో ఏ–1గా మార్గదర్శి చైర్మన్ చెరుకూరి రామోజీరావు, ఏ–2గా కంపెనీ ఎండీ శైలజా కిరణ్, ఏ–3గా బ్రాంచి మేనేజర్లు, ఏ–4గా కంపెనీ, ఏ–5గా ప్రిన్సిపల్ ఆడిటర్ కె.శ్రవణ్ పేర్లను నమోదు చేసినట్లు తెలిపారు. ఏ–1 నుంచి ఏ–5 వరకూ అందరినీ ఒక్కోసారి ప్రశ్నించినా తప్పించుకునే సమాధానాలు వచ్చాయని చెప్పారు. అవసరమైన సమాచారం, పత్రాలను చిట్ రిజిస్ట్రార్, సీఐడీకి మార్గదర్శి ఇవ్వడం లేదన్నారు.
సీఐడీ ప్రాథమిక విచారణలో ఏం తేలిందంటే...
♦చిట్‌ఫండ్ చట్టంలోని పలు నిబంధనలను మార్గదర్శి గ్రూప్ ఉల్లంఘించింది.
♦చందాదారుల సొమ్మును హెచ్‌యూఎఫ్ నియంత్రిత సంస్థలకు మళ్లించింది.
♦చట్ట విరుద్ధంగా చందాదారుల సొమ్మును ఎక్కువ రిస్క్ ఉన్న మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్‌కు మళ్లించారు.
♦నాలుగు నుంచి ఐదు శాతం వార్షిక వడ్డీ రేటు అందిస్తూ భవిష్యత్తు సభ్యత్వాల రసీదు ముసుగులో అక్రమ డిపాజిట్లను బలవంతంగా తీసుకుంటోంది.
♦చిట్‌ఫండ్ చట్టం 1982 ప్రకారం కంపెనీ బ్యాలెన్స్ షీట్, ఖాతాల వివరాలను అందించలేదు.
♦ఖాతాలకు మసిపూసి మారేడు కాయ చేస్తూ అవసరమైన సమాచారాన్ని ఇవ్వడం లేదు.
♦నిందితులు విచారణకు సహకరించకుండా వివిధ మార్గాల ద్వారా సీఐడీ పరువు తీయడం, నిందలు మోపేందుకు యత్నిస్తున్నారు.
‘సుప్రీం’ ఏం చెప్పిందంటే...
‘‘చిట్ ఫండ్స్ చట్టాన్ని ప్రధానంగా చందాదారుల ప్రయోజనాలను కాపాడేందుకు రూపొందించారు. కొన్ని మోసపూరిత ఆర్థిక సంస్థలు చందాదారులు/డిపాజిటర్లను మోసం చేయడమే కాకుండా నిధులను పక్కదారి పట్టించడం లేదా మళ్లించడం చేస్తున్నాయి. ఇలాంటి వాటిని నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకోవడం రాష్ట్ర ప్రభుత్వాల విధి. ప్రజల సంక్షేమానికి సంరక్షకుడిగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం దీనికి పరిష్కారాన్ని కనుగొనకుండా మౌన ప్రేక్షకుడిగా ఉండరాదు’’ అని శ్రీరామ్ చిట్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందని సంజయ్ తెలిపారు.
చదవండి: ఇదే చంద్రబాబుకు నా ఛాలెంజ్: సీఎం జగన్
Comments
Please login to add a commentAdd a comment