సాక్షి, రాజమహేంద్రవరం: బ్రహ్మయ్య అండ్ కో కంపెనీ చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ)ను అరెస్టుచేస్తే అందరు సీఏలపై దాడి ఎలా అవుతుందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ప్రశ్నించారు. తప్పు ఎవరుచేసినా తప్పేనని, చట్టానికి ఎవరూ అతీతులు కాదన్నారు. అది రామోజీరావు అయినా, మరెవరైనా అంతా సమానమేనన్నారు. సాక్షాత్తూ తిరుమల టీటీడీ హుండీలో వేసే విదేశీ కరెన్సీ విషయంలో ముందస్తు అనుమతి తీసుకోవడంలో జాప్యం చేసినందుకు రూ.10 కోట్ల ఫైన్‌వేశారని ఉండవల్లి గుర్తుచేశారు.
వెంకటేశ్వరస్వామి కంటే అతీతుడినని రామోజీరావు భావిస్తున్నారని ఆయన మండిపడ్డారు. విజయ్‌మాల్యా, రామోజీరావు ఇద్దరూ చేసింది ఒక్కటే అని వ్యాఖ్యానించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మార్గదర్శిలో నిబంధనల ఉల్లంఘన జరుగు తోందని తాను 2006 నుంచి చెబుతూనే ఉన్నానని.. తాను ఆరోపించినట్లుగానే అక్రమాలు వెలుగుచూస్తున్నాయన్నారు.
మార్గదర్శిని రామోజీ ఇష్టమెచ్చినట్లు నడిపిస్తున్నారని ఆరోపించారు. ఇక మార్గదర్శిలో తప్పు జరిగిందని ఎవరైనా ఫిర్యాదు ఇచ్చారా అని ప్రశ్నిస్తున్నారని.. ఆర్థిక నేరాల్లో ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా చర్యలుంటాయన్నారు. రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ గోపాలకృష్ణారెడ్డి పదవిలో ఉండగానే మార్గదర్శి వ్యవహారాన్ని తప్పుబట్టారన్నారు. అందులో జరిగే అక్రమాలపై కర్ణాటక నుంచి ఫిర్యాదు వచ్చిందని తన ఆత్మకథలో ఆయన పేర్కొన్నట్లు గుర్తుచేశారు.
సీఏలు నన్ను ధూషించడం తగదు
‘మార్గదర్శి కేసులో బ్రహ్మయ్య అండ్ కో కంపెనీకి చెందిన ఓ సీఏను అరెస్టుచేస్తే అందుకు నేను బాధ్యుడినా? అది అందరు సీఏలపై దాడి ఎలా అవుతుంది? అరెస్టులకు సంబంధించి విజయవాడలో సీఏలు సమావేశం పెట్టి సీఎం జగన్‌కు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడటంలేదని దూషించడం తగదు’.. అని ఉండవల్లి అన్నారు. సీఏలు ప్రభుత్వానికి ప్రతినిధుల్లాంటి వారని, వాళ్లు తప్పుచేస్తే శిక్షలు ఉంటాయని గుర్తుచేశారు. సత్యం రామలింగరాజు కేసులో సీఎలను అరెస్టుచేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. కానీ, అప్పట్లో íసీఏలు ఇలా మీటింగ్ పెట్టి విమర్శించిన దాఖలాల్లేవన్నారు. సీఏలు మీటింగ్ పెట్టి ఆహ్వానిస్తే వెళ్లి రామోజీ తప్పుచేశారన్న తన వాదన నిజామా? కాదో వివరిస్తానన్నారు.
నా కేసు తప్పని జస్టిస్ రమణతో చెప్పించండి
ఇక మార్గదర్శిపై తాను వేసిన కేసు తప్పని సుప్రీంకోర్టు మాజీ సీజే జస్టిస్ రమణతో చెప్పిస్తే చాలని ఉండవల్లి అన్నారు. రామోజీరావు చేసింది తప్పాకాదా? అని మాత్రమే సమాధానమివ్వాలన్నారు. తప్పని తేలితే రూపాయి ఫైన్ వేసినా సంతోషమేనని, మిగిలిన చిట్‌ఫండ్‌లకు భయం ఉంటుందన్నారు. సెక్షన్ 477–ఏ ప్రకారం అకౌంట్స్ తారుమారు చేస్తే శిక్ష తప్పదని.. రామోజీరావుకు డిపాజిటర్ల పేర్లు విడుదల చేయాలని ఉండవల్లి డిమాండ్ చేశారు. అవినీతిని ప్రశ్నిస్తే రామోజీరావు పత్రికా స్వేచ్ఛపై దాడిగా చెప్పుకుంటారని.. అలాంటప్పుడు చట్టసభల్లో పత్రికాధిపతికి చట్టాలు వర్తించవని చట్టం తీసుకురావాలని ఉండవల్లి సలహా ఇచ్చారు.
జగన్‌ను విమర్శిస్తే విశ్వాస ఘాతుకుడినే..
తనకు టీడీపీ, వైఎస్సార్‌సీపీ రెండు పార్టీలు సమానమేనని ఆయనన్నారు. రాష్ట్ర విభజన అంశంపై కోర్టులో కేసు వేయమని టీడీపీ ప్రభుత్వ హయాంలో అడిగితే పట్టించుకోలేదని.. అదే విషయమై ఇప్పుడు కోరితే తనను సపోర్ట్ చేస్తూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తన కేసులో ఇంప్లీడ్ అవుతూ అఫిడవిట్ దాఖలు చేసిందన్నారు. ఎవరూ చేయలేని పని జగన్ చేశారని.. అలాంటప్పుడు కేసు తేలేవరకైనా కృతజ్ఞత లేకుండా ముఖ్యమంత్రి జగన్‌ను ఎందుకు విమర్శించాలని ఆయన ప్రశ్నించారు. అలా చేస్తే తాను విశ్వాస ఘాతకుడినవుతానన్నారు.
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
(ఫొటో ఉంది)
Comments
Please login to add a commentAdd a comment