రామోజీ ఆర్థిక నేరగాడే | Ramoji Rao is a financial criminal | Sakshi
Sakshi News home page

రామోజీ ఆర్థిక నేరగాడే

Published Sun, Aug 18 2024 5:14 AM | Last Updated on Sun, Aug 18 2024 7:07 AM

Ramoji Rao is a financial criminal

ఆర్‌బీఐ నివేదికను బట్టి సుస్పష్టం  

‘మార్గదర్శి’ సేకరించిన రూ.2,600 కోట్లకు పైగా డిపాజిట్లన్నీ చట్ట విరుద్ధమే 

45 ఎస్‌ నిబంధన ఉల్లంఘన.. బాధ్యులను ప్రాసిక్యూట్‌ చేయాల్సిందేనని తేల్చిన ఆర్‌బీఐ  

కేసులు విచారణలో ఉండగానే రూ.2 వేల కోట్ల అక్రమ డిపాజిట్ల వసూలు 

ఉమ్మడి హైకోర్టు చివరి రోజు ‘మార్గదర్శి’పై కేసు కొట్టివేత 

సుప్రీంలో అప్పీల్‌ చేయని నాటి చంద్రబాబు ప్రభుత్వం 

ఉండవల్లి పిటిషన్‌లో ఇంప్లీడ్‌ అయిన గత ప్రభుత్వం 

చట్ట విరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేసినందుకు రెట్టింపు జరిమానా, జైలు

సాక్షి, అమరావతి: మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ నిర్భీతిగా నిబంధనలను ఉల్లంఘించి ఆర్థిక దోపిడీకి పాల్పడినట్లు స్పష్టమైంది. మార్గదర్శి ఫైనాన్సియర్స్‌కు కూడా చైర్మన్‌గా వ్యవహరించిన ఈనాడు అధిపతి చెరుకూరి రామోజీరావు (ఇటీవల మరణించారు) ఆర్థిక  నేరస్తుడని తేటతెల్లమైంది. చట్టానికి తాను అతీతమన్నట్టుగా దశాబ్దాలుగా ఆర్థిక ఉగ్రవాదానికి పాల్పడి భారీగా దోపిడీకి తెగించినట్లు నిగ్గు తేలింది. 

మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి అక్రమ డిపాజిట్లు వసూలు చేసినట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మరోసారి విస్పష్టంగా ప్రకటించింది. ఈ మేరకు తాజాగా తెలంగాణ హైకోర్టుకు ఈ నెల 13న లిఖితపూర్వకంగా కౌంటర్‌లో నివేదించింది. ఈ నేపథ్యంలో మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ అక్రమ డిపాజిట్ల దందా పూర్వాపరాలివి.  

ఆర్‌బీఐకి తెలియకుండానే...
హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్‌యూఎఫ్‌) కింద మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ ఏర్పాటైంది. ఈ హెచ్‌యూఎఫ్‌కు రామోజీరావు కర్త. డిపాజిట్లు వసూలు చేసేందుకు హెచ్‌యూఎఫ్‌లకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అనుమతివ్వదు. ఇక్కడ అసక్తికర విషయం ఏమిటంటే అసలు మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ అనే సంస్థ ఉన్నట్లు రిజర్వ్‌ బ్యాంకుకే తెలియదు. 

ఎందుకంటే రిజర్వ్‌ బ్యాంకు అనుమతి లేకుండానే రామోజీరావు నేతృత్వంలోని మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ తన కార్యకలాపాలను కొనసాగించింది. ఆర్‌బీఐ చట్ట నిబంధనలకు విరుద్ధంగా 2006 మార్చి నాటికి దాదాపు 2.75 లక్షల మంది డిపాజిటర్ల నుంచి రూ.2,610.38 కోట్లను డిపాజిట్లుగా సేకరించింది. ఇంత భారీ మొత్తాల్లో డిపాజిట్లు వసూలు చేసిన మార్గదర్శి అప్పట్లో ప్రతీ సంవత్సరం వందల కోట్ల రూపాయల్లో నష్టాలు చూపింది. 

2000 మార్చి 30వ తేదీ నాటికి 619.25 కోట్లను డిపాజిట్ల రూపంలో వసూలు చేయగా, 2006 మార్చి 30 నాటికి వసూలు చేసిన డిపాజిట్ల మొత్తాన్ని రూ.2,610.38 కోట్లుగా చూపింది. ఇంత పెద్ద మొత్తంలో డిపాజిట్లు వసూలు చేసినప్పటికీ 2006 మార్చి నాటికి రూ.1,369.47 కోట్లను వృద్ధి చెందుతున్న నష్టాలుగా చూపింది. అంటే 50 శాతం డిపాజిటర్లకు డిపాజిట్లు చెల్లించలేని పరిస్థితికి మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ చేరింది. డిపాజిటర్లకు వడ్డీలు, మెచ్యూరిటీ మొత్తాలు చెల్లించేందుకు మళ్లీ డిపాజిట్లు తీసుకోవడం మొదలు పెట్టింది. ఇలా మార్గదర్శి ఆర్థికంగా మనుగడ సాగించింది.  

ఉండవల్లి ఫిర్యాదుతో కదిలిన మార్గదర్శి పునాదులు.. 
మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ చట్ట ఉల్లంఘనలపై 2006లో అప్పటి కాంగ్రెస్‌ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఫిర్యాదు చేయడంతో ఈ అక్రమ డిపాజిట్ల కథ వెలుగులోకి వచ్చింది. ఉండవల్లి ఫిర్యాదును కేంద్ర ప్రభుత్వం ఆర్‌బీఐకి పంపింది. దీంతో ఆర్‌బీఐ మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ వివరణ కోరింది. ఆర్‌బీఐ చట్టంలోని సెక్షన్‌ 45(ఎస్‌) హిందూ అవిభక్త కుటుంబం (హెచ్‌యూఎఫ్‌)కు వర్తించదని మార్గదర్శి ఆర్‌బీఐకి రాతపూర్వకంగా తెలిపింది. 
 


 

అందులో ఎక్కడా కూడా డిపాజిట్లు వసూలు చేయలేదని మాత్రం చెప్పలేదు. అంతేకాక 2006 సెప్టెంబర్‌ 16 నుంచి రూ.లక్ష అంతకన్నా తక్కువ మొత్తాలను డిపాజిట్లుగా స్వీకరించడాన్ని నిలిపేశామని ఆర్‌బీఐకి చెప్పింది. ఈ వివరాలను ఆర్‌బీఐ అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని ఆర్‌బీఐ స్పష్టంగా చెప్పింది.  

అక్రమాల నిగ్గు తేల్చే బాధ్యత రంగాచారికి 
ఆర్‌బీఐ సూచన మేరకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం డిపాజిటర్ల ప్రయోజనాల పరిరక్షణపై దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా డిపాజిటర్ల ప్రయోజనాలను పరిరక్షించడంతోపాటు మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ అక్రమాలను, అవకతవకలను నిగ్గు తేల్చి నివేదిక ఇచ్చేందుకు అప్పటి ప్రభుత్వ సలహాదారు (ఫైనాన్స్‌) ఎన్‌.రంగాచారిని నియమిస్తూ 2006 డిసెంబర్‌ 19న జీవో జారీ చేసింది. 

అలాగే మార్గదర్శి ఫైనాన్సియర్స్‌పై చట్ట ప్రకారం న్యాయస్థానాల్లో ఫిర్యాదు చేసేందుకు, తదనుగుణంగా చర్యలు తీసుకునేందుకు ఐపీఎస్‌ అధికారి టి.కృష్ణరాజును అదీకృత అధికారిగా నియమించింది. దీంతో ఉలిక్కిపడ్డ రామోజీరావు... మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ ద్వారా అటు రంగాచారి, ఇటు కృష్ణరాజు నియామకాలను సవాలు చేస్తూ 2006లో హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయించారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు వారి నియామకాలను రద్దు చేసేందుకు తిరస్కరిస్తూ మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ పిటిషన్లను కొట్టేసింది.  

మార్గదర్శి, రామోజీల ప్రాసిక్యూషన్‌ కోసం కృష్ణరాజు ఫిర్యాదు 
చట్ట ఉల్లంఘనలకు పాల్పడినందుకు మార్గదర్శి ఫైనాన్సియర్స్, హెచ్‌యూఎఫ్‌ కర్త రామోజీరావులను ప్రాసిక్యూట్‌ చేయాలని కోరుతూ అ«దీకృత అధికారి టి.కృష్ణరాజు 2008, జనవరి 23న నాంపల్లి మొదటి అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజి్రస్టేట్‌ కోర్టులో క్రిమినల్‌ ఫిర్యాదు (సీసీ నెంబర్‌ 540) దాఖలు చేశారు. 

ఆర్‌బీఐ చట్టంలోని సెక్షన్‌ 45(ఎస్‌)కు విరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించడం నిషిద్ధమని, అయితే మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ ఇందుకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించి నేరం చేసిందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది ఆర్‌బీఐ చట్టంలోని సెక్షన్‌ 58ఈ కింద శిక్షార్హమని తెలిపారు. ఈ ఫిర్యాదును కొట్టేయాలని కోరుతూ మార్గదర్శి 2008లో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం, మార్గదర్శిపై కృష్ణరాజు దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టేసేందుకు నిరాకరించింది.  

మార్గదర్శిపై చర్యల నిలిపివేతకు సుప్రీంకోర్టు తిరస్కృతి  
కృష్ణరాజు దాఖలు చేసిన ఫిర్యాదులో రామోజీరావు 2010లో ఓ అనుబంధ పిటిషన్‌ దాఖలు చేశారు. ఫిర్యాదులో విచారణను సెక్షన్‌ 45(ఎస్‌)(1), 45(ఎస్‌)(2), 58బీ(5ఏ) రెడ్‌ విత్‌ సెక్షన్‌ 58(ఈ)లకే పరిమితం చేసేలా ఆదేశాలు ఇవ్వాలని నాంపల్లి కోర్టును కోరారు. ఈ అభ్యర్థనను నాంపల్లి కోర్టు తోసిపుచ్చుతూ 2011లో ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వులపై మార్గదర్శి, రామోజీరావు హైకోర్టును ఆశ్రయించారు. 

హెచ్‌యూఎఫ్‌ అయిన మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ ఆర్‌బీఐ చట్టంలోని సెక్షన్‌ 45ఎస్‌ పరిధిలోకి రాదంటూ వాదించారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన అప్పటి న్యాయమూర్తి జస్టిస్‌ తేలప్రోలు రజనీ... మార్గదర్శిపై కృష్ణరాజు దాఖలు చేసిన ఫిర్యాదులో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ 2011లో మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ఆ తర్వాత ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. సుప్రీంకోర్టు నాంపల్లి కోర్టు ముందున్న ఫిర్యాదు (సీసీ 540)లో తదుపరి చర్యలను నిలిపేసేందుకు నిరాకరించింది. అలాగే హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులను కొనసాగించేందుకు సైతం నిరాకరించింది.  

ఉమ్మడి హైకోర్టుకు చివరి రోజు 
మార్గదర్శికి అనుకూలంగా తీర్పు... 
ఆ తర్వాత 2019, జనవరి ఒకటో తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు విభజన జరిగింది. అంటే 31.12.2018న ఉమ్మడి హైకోర్టుకు చివరి రోజు. అందరూ విభజన పనుల్లో నిమగ్నమయ్యారు. అటు న్యాయవాదులు, ఇటు న్యాయమూర్తులు అందరూ భావోద్వేగ వాతావరణంలో ఉన్నారు. కేసుల విచారణపై ఎవరూ దృష్టి సారించలేని పరిస్థితి. ఇదే అదునుగా భావించిన రామోజీరావు నాంపల్లి కోర్టులో కృష్ణరాజు ఫిర్యాదును కొట్టేయాలంటూ 2011లో దాఖలు చేసిన తన వ్యాజ్యాలను 2018, డిసెంబర్‌ 31వ తేదీన విచారణకు తెప్పించారు. 

ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్‌ తేలప్రోలు రజనీ విచారణ జరిపారు. రామోజీరావు తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు విన్న జస్టిస్‌ రజనీ అదే రోజున... అంటే 2018, డిసెంబర్‌ 31న తీర్పు కూడా ఇచ్చేశారు. హెచ్‌యూఎఫ్‌ ఆర్‌బీఐ చట్టంలోని సెక్షన్‌ 45ఎస్‌ పరిధిలోకి రాదని జస్టిస్‌ రజనీ తన తీర్పులో తేల్చేశారు. మార్గదర్శి, రామోజీరావులను ప్రాసిక్యూట్‌ చేయాలని కోరుతూ నాంపల్లి కోర్టులో కృష్ణరాజు దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టేస్తూ తీర్పునిచ్చారు.  

మార్గదర్శి, రామోజీరావులకు క్లీన్‌చిట్‌ ఇచ్చేసిన న్యాయమూర్తి... 
డిపాజిట్ల సేకరణ విషయంలో మార్గదర్శి ఫైనాన్సియర్స్, రామోజీరావులకు అసలు ఎలాంటి దురుద్దేశాలు లేవంటూ న్యాయమూర్తి సర్టిఫికెట్‌ ఇచ్చేయడం ఈ తీర్పులో ఆసక్తికర విషయం. అంతేకాక డిపాజిట్లను తిరిగి చెల్లించే ప్రక్రియను మొదలుపెట్టారని చెప్పిన హైకోర్టు, పరోక్షంగా మార్గదర్శి, రామోజీరావు చట్ట విరుద్ధంగా డిపాజిట్లు సేకరించిన విషయాన్ని నిర్ధారించినట్లు అయింది. ఇంత పెద్ద కేసులో ఒకే రోజు విచారణ జరిపి తీర్పునివ్వడం విశేషం. 

అసలు ఈ కేసు విచారణకు వచ్చినట్లు గానీ, న్యాయమూర్తి ఈ విధంగా తీర్పునిచ్చినట్లు గానీ ఎవరూ గుర్తించలేదు. ఆ తర్వాత కొద్ది నెలలకు ఈ తీర్పు వెలుగు చూసింది. దీంతో మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ కుంభకోణాన్ని బయటపెట్టిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ అప్రమత్తమై హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంలో ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం 2019లో ఇంప్లీడ్‌ అయింది. 

యావజ్జీవ ఖైదు... రెండింతల జరిమానా 
అక్రమ డిపాజిట్ల కేసులో నేరం నిరూపితమైతే భారీ జరిమానాతోపాటు ఆ సంస్థ బాధ్యులకు రెండేళ్ల నుంచి యావజ్జీవ జైలు శిక్ష వరకు పడే అవకాశం ఉందని ఈ ఏడాది ఏప్రిల్‌లో న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఆ సంస్థ  చైర్మన్‌ రామోజీ ఇటీవల మృతిచెందారు. కానీ నేరం రుజువైతే నేరంగానే పరిగణిస్తారు. ఆ సంస్థ నిర్వాహకులు అందుకు బాధ్యత వహించక తప్పదు. ఇక సేకరించిన అక్రమ డిపాజిట్లు రూ.రూ.2,610.38కోట్లకు రెట్టింపు జరిమానా విధించే అవకాశం ఉంది. 

బెడిసికొట్టిన ‘పత్రికా స్వేచ్ఛ’ పన్నాగం
పత్రికా స్వేచ్ఛ ముసుగులో ఈ కేసు నుంచి బయటపడేందుకు నాడు రామోజీరావు వేసిన ఎత్తుగడ బెడిసికొట్టింది. ఈనాడు పత్రికకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వ్యతిరేకం కాబట్టే ఈ కేసు విషయంలో పట్టుబడుతోందని రామోజీరావు తరఫున ప్రముఖ న్యాయవాదులు వినిపించిన వాదనలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ అంశానికి, అక్రమ డిపాజిట్లకు సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈనాడు పత్రికకు వ్యతిరేకంగా ఉండొద్దని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని ఆదేశించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 

ఎన్నికలు ఉన్నందునే ఈ కేసుపై ఏపీ ప్రభుత్వం పట్టుబడుతోందన్న రామోజీ తరఫు న్యాయవాదుల వాదనలతో అత్యున్నత న్యాయస్థానం ఏకీభవించలేదు. ‘ఎన్నికలు ఉంటే ఈనాడుకు ఏమైంది? ఈనాడు ఏమీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు కదా..? ఈనాడు కేవలం ఓ పత్రికే కదా..! ఎన్నికలతో ఏం సంబంధం?’ అని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. దీంతో ఉండవల్లి అరుణ్‌ కుమార్‌పై నెపాన్ని నెట్టివేసేందుకు రామోజీ తరఫు న్యాయవాదులు విఫలయత్నం చేశారు.  

రంగాచారి నివేదికలోని కీలక అంశాలు 
రంగాచారి విచారణకు రామోజీరావు, మార్గదర్శి ఎంతమాత్రం సహకరించలేదు. కార్యాలయాల్లో తనిఖీలకు అడ్డుపడ్డారు. కావాల్సిన డాక్యుమెంట్లు ఇవ్వకుండా ముప్పుతిప్పులు పెట్టారు. తమ పిటిషన్లు కోర్టుల ముందు పెండింగ్‌లో ఉన్నాయని, అందువల్ల డాక్యుమెంట్లు ఇచ్చేది లేదన్నారు. చివరకు ఆదాయపు పన్ను శాఖ ఇచ్చిన అన్నీ డాక్యుమెంట్లను పరిశీలించిన రంగాచారి 2007 ఫిబ్రవరి 19న తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు. 

⇒ ఆర్‌బీఐ చట్టంలోని సెక్షన్‌ 45(ఎస్‌)కు విరుద్ధంగా మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ డిపాజిట్లు సేకరించిందని రంగాచారి తేల్చారు. 

⇒ డిపాజిటర్లకు వడ్డీ చెల్లించే అలవాటే మార్గదర్శికి లేదని, ఒత్తిడి చేస్తేనే చెల్లిస్తుందంటూ ఓ డిపాజిటర్‌ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్న విషయాన్ని రంగాచారి తన నివేదికలో పొందుపరిచారు.  

⇒ డిపాజిట్లను తిరిగి చెల్లించే స్థితిలో మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ లేదని, దాని ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని ఆయన తన నివేదికలో పేర్కొన్నారు. మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ తీవ్ర నష్టాల్లో ఉండటమే అందుకు కారణమని స్పష్టంచేశారు.  

⇒ రామోజీరావు తన అనుబంధ కంపెనీలకు మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ నిధులను మళ్లించడమే నష్టాలకు ప్రధాన కారణమని రంగాచారి తేల్చారు. క్రియాశీలకంగా లేని అనేక కంపెనీలకు మార్గదర్శి నిధులను బదలాయించినట్లు వారు సమర్పించిన డాక్యుమెంట్లే స్పష్టంగా చెబుతున్నాయని పేర్కొన్నారు.  

⇒ రామోజీ గ్రూపులోని ఇతర కంపెనీల్లో కూడా ఇలాగే ఒక గ్రూపు నిధులను మరో గ్రూపునకు బదలాయించడం జరిగిందని పేర్కొన్నారు. 

⇒ 2000, ఆ తర్వాత సంవత్సరాల్లోని బ్యాలెన్స్‌ షీట్‌లను గమనిస్తే మార్గదర్శి ఫైనాన్సియర్స్‌లో రామోజీ ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టలేదని,  మొత్తం ప్రజల నుంచి వసూలు చేసిన డిపాజిట్లతోనే మార్గదర్శిని నడిపారని తెలిపారు.  

⇒ ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్‌ తప్ప మిగిలిన అన్నీ కంపెనీలు నష్టాల్లో ఉన్నట్లు బ్యాలెన్స్‌ షీట్ల పరిశీలన ద్వారా తెలిసిందని రంగాచారి తన నివేదికలో వివరించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement