స్కిల్‌ కుంభకోణం సూత్రధారి చంద్రబాబే | CID Additional DG Sanjay On Chandrababu Naidu AP Skill Development Scam - Sakshi
Sakshi News home page

స్కిల్‌ కుంభకోణం సూత్రధారి చంద్రబాబే

Published Mon, Sep 18 2023 5:06 AM | Last Updated on Tue, Sep 19 2023 1:25 PM

CID Additional DG Sanjay On Chandrababu Skill Development Scam - Sakshi

మాట్లాడుతున్న సంజయ్, చిత్రంలో పొన్నవోలు

సాక్షి, న్యూఢిల్లీ: టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) కుంభకోణం ప్రధాన సూత్రధారి అని నిర్ధారణ అయినందునే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అరెస్ట్‌ చేశామని సీఐడీ అదనపు డీజీ సంజయ్‌ స్పష్టం చేశారు. సీమెన్స్‌ అనే కంపెనీ ఉదారంగా రూ.3 వేల కోట్లు పెట్టుబడి పెడుతుందని చంద్రబాబు అసెంబ్లీలో చెప్పడంతోపాటు అలానే జీవోలు జారీ చేసి ఒప్పందం కుదుర్చుకున్నారని చెప్పారు. అయితే అందుకు విరుద్ధంగా 2015–16 ఆర్థిక సంవత్సరంలో మూడు నెలల వ్యవధిలో రూ.371 కోట్లు ప్రాజెక్టు నిమిత్తం హడావుడిగా విడుదల చేసి అవినీతికి పాల్పడ్డారని వెల్ల­డిం­చారు.

ఏపీ అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డితో కలిసి ఆదివారం ఆయన ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీమెన్స్‌ కంపెనీ ద్వారా ఏపీలో ఆరు క్లస్టర్లుగా ప్రా­జెక్ట్‌ను ఏర్పాటు చేస్తామని చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందన్నారు. జీవోలో నిధుల వెచ్చింపు 90ః10 నిష్పత్తిగా చెప్పిన్పటికీ ఒప్పందంలో మాత్రం ఆ ప్రస్తావనే లేదని చెప్పారు. అయితే వాస్తవంగా సీమెన్స్‌ కంపెనీకి ఆ ప్రాజెక్ట్‌ గురించే తెలియదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం వాటా కింద రూ.371 కోట్లు విడుదల చేసి,  2015–16లో అందులోంచి రూ.271 కోట్లు ఇతర సంస్థలకు అక్రమంగా నిధులు మళ్లించారని చెప్పారు. 

సీమెన్స్‌ కంపెనీకి తెలియదు 
సీమెన్స్‌ కంపెనీకే తెలియకుండా ఆ కంపెనీ మాజీ ఎండీ సుమన్‌బోస్‌ ఈ కుంభకోణంలో ప్రధాన పాత్ర పోషించారని సంజయ్‌ తెలిపారు. ఆ విషయాన్ని సీమెన్స్‌ కంపెనీ కూడా గుర్తించిందన్నారు. నిందితుల్లో ఒకరైన సుమన్‌ బోస్‌.. ఒప్పందం కుదిరిన రోజున విద్యుత్తు లేనందున కొవ్వొత్తుల వెలుగులో సంతకాలు చేశామని.. కాబట్టి అందులో వివరాలు సరిగా చూడలేదని చెబుతుండటం విడ్డూరంగా ఉందన్నారు.

అప్పటి నుంచి ఇప్పటి వరకూ విద్యుత్తు రాలేదా అని ప్రశ్నించారు. అసలు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ప్రైవేటు వ్యక్తి అయిన గంటా సుబ్బారావుకు ఏకంగా నాలుగు పోస్టులు కట్టబెట్టి, ప్రభుత్వ అధికారులపై పెత్తనం అప్పగించడం.. ఆయన చెప్పినట్టే నిధులు విడుదల చేయాలని చెప్పడం ఏమిటని నిలదీశారు. నిధులు విడుదల చేయాలని చంద్రబాబు ఆదేశించినట్టు సమావేశం మినిట్స్‌ రికార్డులను గంటా సుబ్బారావు చూపించినట్టు ఆర్థిక శాఖ అధికారులు తెలిపారన్నారు.  
 
త్వరలో మరో ఏడుగురి అరెస్ట్‌ 

కుంభకోణం తాలూకు ఫైళ్లలో చంద్రబాబు 13 డిజిటల్‌ సంతకాలు చేశారని సంజయ్‌ తెలిపారు. మొత్తం కుంభకోణంలో చంద్రబాబు పాత్ర ఆధారాలతోసహా బయట పడటంతోనే ఆయన్ను అరెస్ట్‌ చేశామని, ఏసీబీ న్యాయస్థానం రిమాండ్‌ విధించిందన్నారు. ఈ కేసులో మరో ఏడుగురిని అరెస్ట్‌ చేయాల్సి ఉందని చెప్పారు.

స్కిల్‌ కుంభకోణంపై ఈడీ కూడా దర్యాప్తు చేస్తూ ఇప్పటికే సుమన్‌ బోస్, డిజైన్‌ టెక్‌ ఎండీ వికాస్‌ వినాయక్‌ ఖని్వల్కర్, స్కిల్లర్‌ ప్రైవేట్‌ లిమిలెడ్‌ మాజీ ఆర్థిక సలహాదారు ముకుల్‌ చంద్ర అగర్వాల్, సీఏ సురేష్‌ గోయెల్‌లను అరెస్ట్‌ చేసిందన్నారు. ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ లక్షల డాలర్లు లాటరీ తగలిందని చెప్పి అందులో పది శాతం కడితేనే మొత్తం ఇస్తాననే రీతిలో ఈ కుంభకోణానికి పాల్పడ్డారని చెప్పారు. తేదీ, లెటర్‌ నంబరు లేకుండా ఒప్పందం చేసుకోవడం ఎక్కడన్నా జరుగుతుందా.. అని ప్రశ్నించారు. ఈ కేసులో ముద్దాయిలు సెల్ఫ్‌ సర్టిఫికెట్‌లు ఇచ్చుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు.      

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement