సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) కుంభకోణంలో మాజీ సీఎం చంద్రబాబుపై సీఐడీ నమోదు చేసిన సెక్షన్లు సరైనవేనని నిర్థారిస్తూ పది గంటలపాటు విచారించిన అనంతరం న్యాయస్థానం ఆయనకు రిమాండ్ విధించింది. ఎల్లో మీడియా మాత్రం దీనికి విరుద్ధంగా సొంత తీర్పులు ఇచ్చేస్తూ పతాక శీర్షికల్లో కథనాలను ప్రచురించడం విస్మయపరుస్తోంది.
టీడీపీ హయాంలో తెరపైకి తెచ్చిన ఏపీఎస్‌ఎస్‌డీసీ ప్రాజెక్ట్ సరైందేనంటూ ‘సెంటర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్(సీఐటీడీ) థర్డ్ పార్టీగా మదింపు జరిపి నివేదిక సమర్పించిందంటూ వక్రీకరించి ప్రజల్ని నమ్మించేందుకు రామోజీ నానా పాట్లు పడ్డారు. అయితే తాము ఇచ్చింది మూడో పార్టీ నివేదికే కాదని... అది కేవలం ఏపీఎస్‌ఎస్‌డీసీ ఇచ్చిన పత్రాల పరిశీలన మాత్రమేనని ‘సీఐటీడీ’ స్పష్టం చేయడం గమనార్హం.
మదింపు నివేదిక ఇవ్వాలంటే ప్రాజెక్ట్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి. కానీ తాము అసలు ఏపీఎస్‌ఎస్‌డీసీ ప్రాజెక్ట్‌ను పరిశీలించనే లేదని సీఐటీడీ తేల్చి చెప్పింది. పోనీ ఈనాడు చెబుతున్నట్టుగా సీఐటీడీ మదింపు నివేదిక ఇచ్చిందని భావించినా సరే.. అంతకంటే కంటే ముందుగానే నిబంధనలకు విరుద్ధంగా డిజైన్ టెక్ కంపెనీకి చంద్రబాబు ప్రభుత్వం నిధులు విడుదల చేయడం ఈ ప్రాజెక్ట్‌లో అవినీతిని రుజువు చేస్తోంది.
అది కేవలం పత్రాల పరిశీలనే
ఏపీఎస్‌ఎస్‌డీసీ ప్రాజెక్ట్‌పై తాము ఎలాంటి మదింపు నివేదిక ఇవ్వలేదని సీఐటీడీ స్పష్టం చేసింది. మదింపు నివేదిక ఇవ్వాలంటే తమ బృందం స్కిల్ డెవలప్‌మెంట్ క్లస్టర్లను స్వయంగా పరిశీలించి అక్కడి సాఫ్ట్‌వేర్, మౌలిక వసతులను పరిశీలించి ప్రాజెక్ట్ వ్యయాన్ని అంచనా వేయాల్సి ఉంటుందని, కానీ తమను ఆ విధంగా మదింపు నివేదిక ఇవ్వాలని అసలు ఏపీఎస్‌ఎస్‌డీసీ కోరనే లేదని సీఐటీడీ తెలిపింది.
ఏపీఎస్‌ఎస్‌డీసీ అధికారులు, డిజైన్ టెక్ ప్రతినిధులు తమ వద్దకు వచ్చి ఆ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పత్రాలను మాత్రమే అందించి పరిశీలించాలని కోరినట్లు పేర్కొంది. అంటే ఏపీఎస్‌ఎస్‌డీసీ జీవోలో పేర్కొన్నట్టుగా సీమెన్స్–డిజైన్ టెక్ కంపెనీలు రూ.3,300 కోట్ల ప్రాజెక్ట్‌లో 90 శాతం నిధులను వెచ్చించాయో లేదో కూడా సీఐటీడీకి తెలియదు. ప్రభుత్వ వాటా రూ.370 కోట్లు విడుదల చేయవచ్చో లేదో కూడా ఆ సంస్థకు అవగాహనే లేదు.
కేవలం ఏపీఎస్‌ఎస్‌డీసీ అధికారులు ఇచ్చిన పత్రాల్లో ఉన్నవాటిని చూసి తాము నివేదిక ఇచ్చామని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆ ప్రాజెక్ట్ రూ.3,330 కోట్లు విలువ చేస్తుందని తాము నిర్ధారించినట్టు కాదని, రూ.371 కోట్లు ప్రభుత్వ వాటా విడుదల చేసేందుకు సమ్మతించినట్లూ కాదని స్పష్టం చేసింది. ప్రాజెక్ట్‌ను భౌతికంగా పరిశీలించకుండా మదింపు నివేదిక ఇవ్వడం సాధ్యం కాదని కూడా తేల్చి చెప్పింది. ఈమేరకు సీఐటీడీ ఉన్నతాధికారులు సీఐడీ విచారణలో స్పష్టమైన వాంగ్మూలం ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ముందే నిధుల విడుదల
పత్రాల పరిశీలనే మూడో పార్టీ నివేదిక అని బుకాయించేందుకు టీడీపీ, ఎల్లో మీడియా చేసిన యత్నాలు బెడిసికొట్టాయి. పత్రాలన్నీ పరిశీలించి సీఐడీటీ నివేదిక ఇచ్చిన తరువాతే నిధులు విడుదల చేయాలి. టీడీపీ సర్కారు దీన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. ఏపీఎస్‌ఎస్‌డీసీ అధికారులు, డిజైన్ టెక్ ప్రతినిధులు కొన్ని పత్రాలు సమర్పించి నివేదిక ఇవ్వాలని సీఐటీడీని 2015 డిసెంబర్ 5న కోరారు.
ఆ సంస్థ తన నివేదికను 2016 మార్చి 31న ఇచ్చింది. కానీ ఆ నివేదికతో నిమిత్తం లేకుండానే, అంతకంటే ముందే డిజైన్ టెక్‌కు టీడీపీ సర్కారు నిధులు విడుదల చేసేసింది. 2015 డిసెంబర్ 5న రూ.185 కోట్లు, 2016 జనవరి 29న రూ.85 కోట్లు, మార్చి 11న రూ.67 కోట్లు విడుదల చేశారు. మూడు విడతల్లో రూ.337 కోట్లు డిజైన్ టెక్ కంపెనీకి ఇచ్చేశారు.
చివరగా 2016 మార్చి 31న మిగిలిన రూ.34 కోట్లు కూడా విడుదల చేశారు. అంటే సీఐటీడీ తన మదింపు నివేదికలో ఏం చెప్పిందో పరిశీలించకుండానే, సమీక్షించకుండానే నిబంధనలకు విరుద్ధంగా నిధులు విడుదల చేశారు. ఈ ప్రాజెక్ట్‌లో చంద్రబాబు అవినీతికి అదే నిదర్శనం.
Comments
Please login to add a commentAdd a comment