ఏ–1 చంద్రబాబు అరెస్ట్‌ | A-1 Chandrababu arrested in AP Skill Development Scam | Sakshi
Sakshi News home page

ఏ–1 చంద్రబాబు అరెస్ట్‌

Published Sun, Sep 10 2023 4:55 AM | Last Updated on Sun, Sep 10 2023 4:55 AM

A-1 Chandrababu arrested in AP Skill Development Scam - Sakshi

గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సిట్‌ కార్యాలయంలో చంద్రబాబును విచారిస్తున్న సీఐడీ బృందం

14 ఏళ్లు ముఖ్యమంత్రి.. మరో 14 ఏళ్లు ప్రతిపక్షనేత.. మొత్తంగా 40 ఏళ్ల రాజకీయ జీవితం... కనుసన్న­లతో రాజకీయాలను, రాజ్యాంగ వ్యవస్థలను శాసించగలరని సన్నిహితులు కీర్తించే నాయకుడు.. మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు.

ఏలేరు కుంభకోణం మొదలు ఎన్నో అవినీతి ఆరోపణలు.. రెండెకరాల నుంచి రూ.రెండు లక్షల కోట్లకు ఆస్తులు పెరిగాయన్న విమ­ర్శలు.. ఎన్నో కేసులు.. స్టేలు.. ఎన్నడూ కోర్టుమెట్లెక్కిందే లేదు.... అరదండాలు ఆయన అరచేతులను తాకలేదు... కానీ చట్టం ఎవరికీ చుట్టం కాదు.. అది తన పని తాను చేసుకుపోతుంది. నూరు గొడ్లను తిన్న రాబందు ఒక్క చిన్న గాలివానకే కూలిపోయినట్లు.. సప్త సముద్రాలను ఈదిన గజ ఈతగాడు చిన్న గుంతలో పడి ప్రాణాలొదిలినట్లు.. ఓ చిన్న స్కామ్‌లో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు. 


ఆయన ఎదుర్కొన్న ఆరోపణలతో పోలిస్తే ఇది సముద్రంలో ఇసుకరేణువంత... ఆయన ఆస్తులలో 0.0000001 శాతం కూడా లేనంత.. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో జరిగిన కుంభకోణ­మిది. అధికారులు వారిస్తున్నా కాదని రూ.371 కోట్ల ప్రజాధనాన్ని నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు షెల్‌ కంపెనీలకు తరలించారు. కమీషన్లు పోను తిరిగి రూ.241 కోట్లు చంద్రబాబుకు చేరాయి. స్పష్టమైన ఆధారాలు దొరకడంతో చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్టు చేశారు.

మాజీ సీఎం కావడంతో పటిష్టమైన భద్రత మధ్య హెలికాఫ్టర్‌లో నంద్యాల నుంచి విజయవాడకు తీసుకురావాలని అధికారులు భావించినా రోడ్డుమార్గంలో.. అదీ తన కాన్వాయ్‌లో వస్తానని చంద్రబాబు పట్టుబట్టారు. అదేం విచి­త్రమో.. వలయంలా నిలబడి తనకు రక్షణ కల్పిస్తా­రని భావించిన ప్రజలు, నిరసనలతో దారి­పొడ­వునా బోలెడంత ప్రచారానికి పనికివస్తారను­కున్న పార్టీ శ్రేణులు ముఖం చాటేయడం అరెస్టును మించిన షాక్‌కు బాబును గురిచేసింది. విజయవాడ చేరుకున్న అనంతరం సీఐడీ కార్యాలయంలో బాబును అధికారులు విచారిస్తున్నారు. ఆదివారం ఉదయం ఆయనను కోర్టులో ప్రవేశపెట్టే అవకాశముందని తెలుస్తోంది. 

ఏపీఎస్‌ఎస్‌డీసీ కుంభకోణం కేసులో నిందితులు
ఏ–1 చంద్రబాబు, టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి 
ఏ–2 కింజరాపు అచ్చెన్నాయుడు, టీడీపీ ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రి 
ఏ–3 గంటా సుబ్బారావు, టీడీపీ ప్రభుత్వంలో ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎండీ–సీఈవో 
ఏ–4 కె.లక్ష్మీ నారాయణ, రిటైర్డ్‌ ఐఏఎస్, ఏపీఎస్‌ఎస్‌డీసీ సలహాదారు 
ఏ–5 నిమ్మగడ్డ వెంకట కృష్ణ ప్రసాద్, మాజీ ఓఎస్డీ, ఏపీఎస్‌ఎస్‌డీసీ 
ఏ–6 అపర్ణ ఉపాధ్యాయుల, ఐఏఎస్, టీడీపీ ప్రభుత్వంలో ఏపీఎస్‌ఎస్‌డీసీ డిప్యూటీ సీఈవో 
ఏ–7 ప్రతాప్‌ కుమార్‌ కర్, టీడీపీ ప్రభుత్వంలో ఫైనాన్సియల్‌ ఆఫీసర్, ఏపీఎస్‌ఎస్‌డీసీ  
ఏ–8 సుమన్‌ బోస్, సీమెన్స్‌ ఇండియా మాజీ ఎండీ 
ఏ–9 జీవీఎస్‌ భాస్కర్‌ ప్రసాద్, ఏపీఎస్‌ఎస్‌డీసీ ప్రాజెక్ట్‌ హెడ్‌ 
ఏ–10 వికాస్‌ వినాయక్‌ కన్వేల్కర్, డిజైన్‌టెక్‌ ఎండీ 
వీరితోపాటు మొత్తం 40మందిని నిందితులుగా పేర్కొన్నారు.   

సాక్షి, అమరావతి /నంద్యాల/ నెట్‌వర్క్‌: టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ స్కిల్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎస్‌ఎస్డీసీ) కుంభకోణానికి ప్రధాన సూత్రధారి, ఈ కేసులో ప్రధాన నిందితుడు (ఏ–1) అయిన నారా చంద్రబాబు నాయుడును సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) శనివారం నంద్యాలలో అరెస్టు చేసింది. జర్మనీకి చెందిన సీమెన్స్‌ కంపెనీకి తెలియకుండా ఆ కంపెనీ ముసుగులో రూ.3,300 కోట్ల ప్రాజెక్ట్‌కు ఒప్పందం కుదుర్చుకుని, ఎలాంటి ప్రాజెక్ట్‌  చేపట్టకుండానే నిబంధనలకు విరుద్ధంగా రూ.371 కోట్లు విడుదల చేయించి.. అందులో రూ.241 కోట్లను కొల్లగొట్టిన చంద్రబాబు అవినీతి బండారం ఆధారాలతోసహా బట్టబయలైంది.

ఏపీఎస్‌ఎస్డీసీ కుంభకోణానికి కర్త కర్మ క్రియ అంతా ఆయనే అని సిట్‌ నిర్ధారించింది. దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ బయటపడిన కీలక ఆధారాలతో ఈ కేసులో చంద్రబాబును ఏ–1గా పేర్కొంటూ చార్జిషీట్‌ నమోదు చేసింది. ఆయనపై ఐపీసీ సెక్షన్లు 120(బి), 166, 167, 418, 420, 465, 468, 471, 477(ఏ), 409, 201, 109 రెడ్‌విత్‌ 34, 37లతోపాటు అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు 13(2) రెడ్‌విత్‌ 13(1) (సి), (డి) కింద అభియోగాలు నమోదు చేశారు. 

టీడీపీ ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా వ్యవహరించిన కింజరాపు అచ్చెన్నాయుడు ఏ–2గా, మరో 38 మందిని నిందితులుగా పేర్కొంటూ సిట్‌ కేసు నమోదు చేసింది. కాగా, చంద్రబాబు తనయుడు నారా లోకేశ్‌ కూడా ఏపీఎస్‌ఎస్‌డీసీ కుంభకోణంలో కీలక పాత్ర పోషించారన్నది తాజాగా బయటపడటం గమనార్హం. దాంతో ఈ కేసులో లోకేశ్ను కూడా విచారించాలని సిట్‌నిర్ణయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కేసులో చంద్రబాబుతోసహా సిట్‌ ఇప్పటి వరకు 9 మందిని అరెస్ట్‌ చేసినట్లయింది.

దర్యాప్తును ప్రభావితం చేసేందుకు చంద్రబాబు విఫలయత్నం
ఏపీఎస్‌ఎస్డీసీ కుంభకోణంలో తన అవినీతి బండారం బయట పడటంతో దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు చంద్రబాబు యత్నించారు. ఈ కేసులో షెల్‌ కంపెనీల ద్వారా నిధులు తరలించిన తన పీఎస్‌ పెండ్యాల శ్రీనివాస్, షాపూర్జీ– పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్‌ వాసుదేవ్‌ పార్థసాని, షెల్‌ కంపెనీల సృష్టికర్త యోగేశ్‌ యాదవ్‌లకు సిట్‌ నోటీసులు జారీ చేయడంతో బెంబేలెత్తిన ఆయన సాక్షులను ప్రభావితం చేసేందుకు యత్నించారు.

ఆయన బెదిరింపులతోనే పెండ్యాల శ్రీనివాస్‌ అమెరికాకు, మనోజ్‌ పార్థసాని దుబాయ్‌కి పరార­­య్యారు. దాంతో సిట్‌ వెంటనే అప్రమత్తమైంది. చంద్రబాబును అరెస్ట్‌ చేయకపోతే సాక్షులు, ఇతరులను బెదిరించడం ద్వారా దర్యాప్తును ప్రభావితం చేసి కేసును తప్పుదారి పట్టించే అవకాశం ఉందని గుర్తించారు.  అప్పటికే ఆయన అవినీతి ఆధారాలు లభించడంతో అరెస్ట్‌ చేయాలని నిర్ణయించారు. 

నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్‌ 
సిట్‌ అధికారులు శుక్రవారం రాత్రి కార్యాచరణకు దిగారు. సిట్‌ ఇన్‌చార్జి కె.రఘురామిరెడ్డి, దర్యాప్తు అధికారి ధనుంజయ నేతృత్వంలో సిట్‌ బృందం నంద్యాల పర్యటనలో ఉన్న చంద్రబాబు వద్దకు బయలుదేరింది. తనను అరెస్ట్‌ చేస్తే రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య సృష్టించాలని అప్పటికే చంద్రబాబు టీడీపీ శ్రేణులను ఆదేశించారు. దాంతో ముందు జాగ్రత్తగా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను చంద్రబాబు బస చేసిన ఆర్కే ఫంక్షన్‌ హాలు వద్ద మోహరించారు.

సిట్‌ ఇన్‌చార్జి కె.రఘురామిరెడ్డి, నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్‌రెడ్డి, సిట్‌ దర్యాప్తు అధికారి ధనుంజయ తదితరులు శనివారం తెల్లవారుజామున 3 గంటలకు నంద్యాలలో చంద్రబాబు బస చేసిన ఆర్కే ఫంక్షన్‌ హాలుకు చేరుకున్నారు. ఆ ఫంక్షన్‌ హాల్‌కు వెళ్లే రహదారిలో వారిని అడ్డుకునేందుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు అడ్డంగా నిలిపిన వాహనాల మధ్య నుంచి అక్కడకు వెళ్లారు.

సిట్‌ అధికారులు చంద్రబాబును కలవనివ్వకుండా టీడీపీ నేతలు కాల్వ శ్రీనివాసులు, భూమా బ్రహ్మానందరెడ్డి, బీసీ జనార్ధన్‌రెడ్డిలు సిట్‌ అధికారులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు చంద్రబాబు బస చేసిన బస్సు తలుపులు తట్టినా ఆయన బయటకు రాలేదు. మరోవైపు టీడీపీ నాయకులు ఎంతగా రెచ్చిపోతున్నా పోలీసులు సంయమనంతో వ్యవహరిస్తూ వారికి ఓపికగా సమాధానం ఇస్తూ.. చంద్రబాబు బయటకు వచ్చేంత వరకు వేచి చూశారు. 

2.30 గంటలపాటు నచ్చజెప్పి..
చంద్రబాబు వద్దకు వెళ్లడానికి అడ్డుగా ఉంచిన వాహనాలను ఎంత సేపటికీ తొలగించకపోవడంతో పోలీసులు వాటికి తాడు కట్టి బుల్డొజర్‌ సాయంతో పక్కకు జరిపారు. ఆ విధంగా సిట్‌ అధికారులు శనివారం తెల్లవారుజామున 3గంటల నుంచి 5.30 గంటల వరకు టీడీపీ నేతలు, న్యాయవాదులతో మాట్లాడుతూ నచ్చజెప్పేందుకు యత్నించారు. పోలీసులు, టీడీపీ నాయకుల మధ్య చర్చలు, వాగ్వాదం జరుగుతుండగా టీడీపీ అధినేత చంద్రబాబు ఉదయం 5.30 గంటలకు బస్సు నుంచి కిందకు దిగారు.

ఏపీఎస్‌ఎస్‌డీసీ కుంభకోణం కేసులో అరెస్ట్‌ చేయడానికి వచ్చామని చెప్పి తమకు సహకరించాలని పోలీసు అధికారులు ఆయన్ను కోరారు. ‘ఎఫ్‌ఐఆర్‌ ఎప్పుడు వేశారు.. అందులో నా పేరు ఉందా.. నా పేరు లేకుండా ఎలా అరెస్ట్‌ చేయడానికి వచ్చారు?’ అని బాబు ప్రశ్నించారు. రెండేళ్ల క్రితమే ఎఫ్‌ఐఆర్‌ వేశామని, అందులో మీ పేరు ఉందని వారు తెలుపగా, కేసుకు సంబంధించిన మొత్తం వివరాలు ఇవ్వాలని బాబు పోలీసులను కోరారు. కోర్టులో హాజరు పరిచే సమయంలో పూర్తి వివరాలు ఇస్తామని పోలీసులు చెప్పారు.

అయినప్పటికీ ఎలా అరెస్ట్‌ చేస్తారని న్యాయవాదులు, చంద్రబాబు.. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అన్ని వివరాలు అప్పుడే ఇస్తామని చెబుతూ పోలీసులు చంద్రబాబుతో సంతకం తీసుకొని, వైద్య పరీక్షలు నిర్వహించి, ఉదయం 6 గంటల సమయంలో అరెస్ట్‌ చేశారు. ఆర్కే ఫంక్షన్‌ హాల్‌ నుంచి బయటకు వస్తున్న చంద్రబాబు వాహనానికి కొందరు టీడీపీ కార్యకర్తలు అడ్డం పడుకోవడానికి వెళ్లగా పోలీసులు వారిని పక్కకు తప్పించారు. 

రోడ్డు మార్గంలో విజయవాడకు తరలింపు
హెలికాఫ్టర్లో విజయవాడకు తీసుకెళ్తామని సిట్‌ అధికారులు చంద్రబాబుతో చెప్పారు. అందుకు ఆయన తిరస్కరించారు. తాను తన వాహనంలో రోడ్డు మార్గంలోనే వస్తానన్నారు. అందుకు సిట్‌ అధికారులు సమ్మతించి ఆయనను నంద్యాల నుంచి విజయవాడకు రోడ్డు మార్గంలో తరలించారు. మధ్యలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. అక్కడక్కడ తప్ప ఎక్కడా ఎలాంటి అవాంతరాలు ఏర్పడ లేదు.

బాపట్ల జిల్లా జే.పంగలూరు మండలం ముప్పవరం గ్రామం సమీపంలో టీడీపీ నేతలు జాతీయ రహదారిపై టైర్లు తగలబెట్టి చంద్రబాబు కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు స్వల్పంగా లాఠీ చార్జీ చేసి కాన్వాయిని ముందుకు పంపించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద టీడీపీ నేతలు ముందస్తు ప్రణాళికతో కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. పోలీసులను దుర్భాషలాడుతూ, తోసివేస్తూ దూసుకువచ్చారు.

కొందరు టీడీపీ కార్యకర్తలు పోలీసులపై దాడికి ప్రయత్నించారు. ఎన్‌ఆర్టీ సెంటర్లో రోడ్డుపై తెలుగు తమ్ముళ్లు టైర్లు కాల్చి, చేతిలో పెట్రోల్‌ బాటిళ్లతో బెదిరింపులకు దిగారు. దాంతో జాతీయ రహదారిపై చంద్రబాబు కాన్వాయ్‌ అరగంటకుపైగా నిలిచిపోయింది. టీడీపీ కార్యకర్తలు సాధారణ ప్రజలను కూడా దూషిస్తూ వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

స్పెషల్‌ పార్టీ పోలీసులను తీవ్ర పదజాలంతో దూషిస్తూ వారి అంతు చూస్తామని హెచ్చరిస్తూ జెండా కర్రలతో దాడికి ప్రయత్నించారు. పోలీసులు అతి కష్టం మీద అల్లరి మూకలను చెదరగొట్టి కాన్వాయ్ని ముందుకు పోనిచ్చారు. గుంటూరు శివారులోని లాల్పురం వై.జంక్షన్‌ టీడీపీ కార్యకర్తలు కాన్వా­య్ను అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. సాయంత్రం ఐదు గంటలకు సిట్‌ అధికారులు చంద్రబాబును గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సిట్‌ కార్యాలయానికి తరలించారు.

బాబుపై ప్రశ్నల వర్షం
సిట్‌ విచారణకు చంద్రబాబు ఏమాత్రం సహకరించ లేదు. అధికారులు ఏ ప్రశ్నలు వేసినా సరే తెలియదు.. గుర్తు లేదు.. మర్చిపోయాను.. అంటూ సమాధానాలు చెప్పి తప్పించుకునేందుకు యత్నించారు. తాడేపల్లిలోని సిట్‌ కార్యాలయానికి చేరుకున్న తర్వాత చంద్రబాబు కాసేపు విశ్రాంతి తీసుకునేందుకు అధికారులు అనుమతించారు. రాత్రి 7 గంటల అనంతరం సిట్‌ అధికారులు విచారణ ప్రక్రియ మొదలు పెట్టారు.

చంద్రబాబు లిఖితపూర్వక విజ్ఞప్తి మేరకు ఆయన న్యాయవాదులను లోపలికి అనుమతించారు. అనంతరం ఓ గదిలో చంద్రబాబును కూర్చోబెట్టి, సిట్‌ దర్యాప్తు అధికారి ధనుంజయ, ఇతర అధికారులు ఈ కేసుకు సంబంధించిన వివరాలను రాబట్టేందుకు ప్రయత్నించారు. సీమెన్స్‌ కంపెనీ పేరిట ఏపీఎస్‌ఎస్‌డీసీ ప్రాజెక్ట్‌ ఒప్పందం కుదుర్చుకున్న విధానంపై సిట్‌ అధికారులు చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపించారు.

కేవలం ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకే ఈ ప్రాజెక్ట్‌పై ఒప్పందం కుదుర్చుకోవడంలో సర్వం తానై చంద్రబాబు వ్యవహరించారనడానికి ఆధారాలను ఆయన ముందు ఉంచి ఒక్కొక్కటిగా ప్రశ్నించారు. అసలు సీమెన్స్‌ కంపెనీకి తెలియకుండానే ఆ కంపెనీ పేరుతో ప్రాజెక్ట్‌ కుదుర్చుకోవడం ఏమిటి? డిజైన్‌టెక్‌ కంపెనీని ఎందుకు తెరపైకి తెచ్చారు? అసలు ప్రాజెక్ట్‌ వ్యయం రూ.3,300 కోట్లుగా ఎలా నిర్ధారించారు? ముఖ్య కార్యదర్శిని పక్కనబెట్టి మరీ ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎండీ గంటా సుబ్బారావుకు ఏకంగా నాలుగు పోస్టులు ఎందుకు కట్టబెట్టారు? ఒప్పందం ప్రకారం ప్రాజెక్ట్‌ వ్యయంలో 90 శాతం నిధులు సమకూర్చకుండా ప్రభుత్వ వాటా 10 శాతం కింద రూ.371 కోట్లు ఎందుకు విడుదల చేశారు? అందుకు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు నోట్‌ఫైల్లో లిఖిత పూర్వకంగా తెలిపిన అభ్యంతరాలను ఎందుకు బేఖాతరు చేశారు? షెల్‌ కంపెనీల ద్వారా ఆయనకు చేరిన నిధుల విషయం ఏమిటి.. ఇలా పలు ప్రశ్నలను ఒక్కొక్కటిగా అడిగారు.

చంద్రబాబుతో కుటుంబ సభ్యుల భేటీ 
సిట్‌ కార్యాలయంలో చంద్రబాబును విచారిస్తుండగానే ఆయన భార్య భువనేశ్వరి, తనయుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి, బావమరిది బాలకృష్ణ అక్కడకు చేరుకున్నారు. తాము చంద్రబాబును కలవాలని అధికారులతో చెప్పారు. దాంతో చంద్రబాబు విచారణకు కాసేపు విరామం ఇచ్చి కుటుంబ సభ్యులను కలిసేందుకు అధికారులు అనుమతించారు.

సిట్‌ కార్యాలయంలో ఓ గదిలో చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో భేటీ అయ్యారు. అరగంటకుపైగా మాట్లాడారు. అనంతరం సిట్‌ అధికారులు మరోసారి  విచారణను కొనసాగించారు. ఈ విధంగా శనివారం అర్ధరాత్రి వరకు.. అంటే 6 గంటలకు పైగా విచారించారు. అనంతరం ఆయన నిద్రించేందుకు అవకాశం కల్పించారు.  ఆదివారం తెల్లవారుజామున న్యాయస్థానంలో హాజరు పరుస్తారని భావిస్తున్నారు.

నడిరోడ్డుపై ప్రజాస్వామ్యం హత్య: చంద్రబాబు
ప్రజాస్వామ్యాన్ని నడిరోడ్డుపై హత్య చేశారని చంద్రబాబు ఆరోపించారు. తనను అరెస్ట్‌ చేయడంపై నంద్యాలలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ తాను ఏం తప్పు చేశానో చెప్పాలన్నారు. నాలుగున్నరేళ్లుగా ప్రజా సమస్యలపై పోరాడుతున్నందుకు అరెస్ట్‌ చేయడం బాధాకరమన్నారు. తప్పు చేసుంటే నిరూపించి కేసు పెట్టాలన్నారు. ఏదే­మైనా న్యాయం, ధర్మం గెలుస్తుందన్నారు.

స్కిల్‌ స్కామ్‌ కేసులో ఇప్పటి వరకు అరెస్టైన వారు.. 
► నారా చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి
► గంటా సుబ్బారావు, టీడీపీ ప్రభుత్వంలో ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎండీ
► సుమన్‌ బోస్, అప్పట్లో సీమెన్స్‌ ఎండీ
► వికాస్‌ వినాయక్‌ కన్వేల్కర్, డిజైన్‌ టెక్‌ ఎండీ
► ముకుల్‌చంద్ర అగర్వాల్, స్కిల్లర్‌ కంపెనీ చీఫ్‌ ఆపరేటింగ్‌ అధికారి
► శిరీష్‌ చంద్రకాంత్‌ షా, డైరెక్టర్‌ ఏసీఐఎల్‌ కంపెనీ
► విపిన్‌కుమార్‌ శర్మ, చార్టెడ్‌ అకౌంటెంట్‌
► నీలమ్‌ శర్మ (విపిన్‌కుమార్‌ శర్మ భార్య)
► జీవీఎస్‌ భాస్కర్, ఏపీఎస్‌ఎస్‌డీసీ ప్రాజెక్ట్‌ హెడ్‌ 

స్కిల్‌ స్కామ్‌ కేసులో ఇప్పటి వరకు అరెస్టైన వారు.. 
► నారా చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి
► గంటా సుబ్బారావు, టీడీపీ ప్రభుత్వంలో ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎండీ
► సుమన్‌ బోస్, అప్పట్లో సీమెన్స్‌ ఎండీ
► వికాస్‌ వినాయక్‌ కన్వేల్కర్, డిజైన్‌ టెక్‌ ఎండీ
► ముకుల్‌చంద్ర అగర్వాల్, స్కిల్లర్‌ కంపెనీ చీఫ్‌ ఆపరేటింగ్‌ అధికారి
► శిరీష్‌ చంద్రకాంత్‌ షా, డైరెక్టర్‌ ఏసీఐఎల్‌ కంపెనీ
► విపిన్‌కుమార్‌ శర్మ, చార్టెడ్‌ అకౌంటెంట్‌
► నీలమ్‌ శర్మ (విపిన్‌కుమార్‌ శర్మ భార్య)
► జీవీఎస్‌ భాస్కర్, ఏపీఎస్‌ఎస్‌డీసీ ప్రాజెక్ట్‌ హెడ్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement