గంజాయి రవాణాదారుల అరెస్ట్ వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ పాలరాజు (ఫైల్)
విజయనగరం టౌన్ : ఖైనీ, గుట్కాతో పాటూ గంజాయి అక్రమ రవాణా జిల్లాలో యథేచ్ఛగా సాగుతోంది. ఒడిశా నుంచి ఖైనీ, గుట్కా, గంజాయి తీసుకువచ్చి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీస్ యంత్రాంగం పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నా ప్రతి రోజూ ఎక్కడో ఒకచోట అక్రమ రవాణా గుట్టురట్టవుతోంది.
ఇటువంటి నిషేధిత వస్తువుల క్రయ, విక్రయాలు చేపట్టకూడదని ఆదేశాలు జారీ చేస్తున్నా అక్రమార్కులు పట్టించుకోవడం లేదు. రవాణాను అడ్డుకునేందుకు పోలీస్ యంత్రాంగం స్పెషల్ టాస్క్‌ఫోర్స్ టీమ్‌ను ఏర్పాటుచేసి దాడులు చేపట్టింది. అయినప్పటికీ వ్యాపారులు వాటిని ఏ మాత్రం లెక్కచేయకుండా తమ వ్యాపారాలను రహస్యంగా సాగిస్తున్నారు.
తరలిపోతుందిలా...
ఒడిశా రాష్ట్రం నుంచి తీసుకువస్తున్న నిషేధిత ఖైనీ, గుట్కాలు జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. 2017లో జిల్లాలో 529 కేసులు నమోదవ్వగా... ఈ ఏడాది మే 21 నాటికి 57 కేసులు నమోదుచేశారు. వీటితో పాటు విజయనగరం పోలీస్‌లు 86 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ. 17, 80, 286 విలువైన సరుకు సీజ్ చేశారు.
అదేవిధంగా గంజాయి కూడా ఇతర ప్రాంతాల నుంచి మన జిల్లా మీదుగా తరలిపోతుంది. ఇందులో ప్రధానంగా పెదబయలు, మంగబంద, గుంటసీమ, డబ్రిగూడ, అరకు మీదుగా అనంతగిరి, ఎస్.కోట, ఎల్.కోట, కొత్తవలస మీదుగా విశాఖ తరలిపోతుంటుంది. అదేవిధంగా కొటారుబిల్లి జంక్షన్, గంట్యాడ, తదితర ప్రాంతాల మీదుగా జిల్లాలోకి గంజాయి తరలిస్తున్నారు.
ఒడిశాలో కోరాపుట్ నుంచి బరంపురం, సాలూరు మీదుగా విజయనగరంలోకి గంజాయి వస్తోంది. వీటితో పాటు రాయగడ మీదుగా పార్వతీపురం, సీతానగరం, బొబ్బిలి మీదుగా విజయనగరం మీదుగా విశాఖ, తదితర ప్రాంతాలకు గంజాయి తరలిస్తున్నారు.
చెక్ పడేనా.. ?
గంజాయి, ఖైనీ, గుట్కా వంటి నిషేధిత వస్తువుల రవాణాపై జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేక దృష్టిసారించింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారు. 24 గంటలూ తనిఖీలు చేపడుతున్నందున 2017లో 63 మందిని, 2018 ఇప్పటి వరకు 21 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్దన నుంచి ఆరువేలకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
ఇంత చేస్తున్నప్పటికీ అక్రమార్కులు పోలీసుల కళ్లుగప్పి రవాణా కొనసాగిస్తున్నారు. కొన్నిప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించే సమయాల్లో కొంతమంది పోలీసులు కాసులకు కక్కుర్తి పడడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతోందన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.
ఆస్తులు సీజ్ చేస్తాం
ఖైనీ, గుట్కా, గంజాయిలను విక్రయిస్తూ పట్టుబడితే వారి ఆస్తులు జప్తు చేస్తాం. ఒక కేసు కంటే ఎక్కువ ఉన్న వారిని గుర్తిస్తున్నాం. నాలుగు కంటే ఎక్కువ కేసులుంటే పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తాం. –జి.పాలరాజు, ఎస్పీ, విజయనగరం.
Comments
Please login to add a commentAdd a comment