SP palaraju
-
హత్య కేసులో ప్రతిభ కనబరిచినందుకు..
విజయనగరం టౌన్: డెంకాడ పోలీస్‌స్టేషన్ పరిధికి చెందిన ఒక హత్య కేసులో డెంకాడ మండలం చినతాడివాడ గ్రామానికి చెందిన కానూరి ఆచారికీ యావజ్జీవ ఖైదుతో పాటు రూ.40వేల జరిమానా విధిస్తూ జిల్లా సెషన్స్ జడ్జి ఆలపాటి గిరిధర్ సోమవారం తీర్పు వెల్లడించారు. కేసు దర్యాప్తులో, ప్రాసిక్యూషన్‌లో సాక్ష్యాధారాలను సక్రమంగా ప్రవేశపెట్టి, నిం దితుడు కానూరి ఆచారి శిక్షింపబడటంలో క్రియాశీలక పాత్ర పోషించిన పోలీస్ అధికారులు, సిబ్బందిని ఎస్పీ జి.పాలరాజు మంగళవారం ప్రత్యేకంగా అభినందించి, ప్రశంసా పత్రాలను, నగదు రివార్డులను అందజేశారు. డెంకాడ మండలం చినతాడివాడ గ్రామానికి చెందిన కానూరి ఆచారి పుట్టు మూగ, చెవుడు. చెడు వ్యసనాలకు అలవాటు పడిన ఆచారి తనకు పెళ్లి చేయమని, తన తల్లి సావిత్రమ్మను తరచూ తగవులు జరుగుతుండేవి. 2017 జూన్ 2న ఆచారి పెళ్లి చేయమని తన తల్లి సావిత్రిని ఒత్తిడి చేయడంతో ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఆచారి పట్టరాని ఆవేశంతో తన తల్లి సావిత్రమ్మ తలపై చెక్కతో కొట్టి తీవ్రంగా గాయపర్చడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. డెంకాడ ఎస్ఐ కృష్ణ వర్మ హత్యాయత్నంగా కేసు నమోదు చేయగా భోగాపురం సీఐ ఇ.నర్సింగరావు దర్యాప్తు చేపట్టారు. విచారణలో కేసు రుజువు కావడంతో ఆచారీకి యావజ్జీవ ఖైదుతో పాటు రూ.40వేలు జరిమానాగా విధిస్తూ జిల్లా సెషన్స్ జడ్జి ఆలపాటి గిరిధర్ తీర్పు వెల్లడించారు. కేసు దర్యాప్తు చేసిన పోలీసు అధికారులు, నిందితులకు శిక్ష పడటంలో ప్రతిభ కనబరిచి, క్రియాశీలక పాత్ర పోషించిన అప్పటి భోగాపురం సీఐ, ప్రస్తుత విశాఖ ఎన్డీపీఎస్ సెల్లో పని చేస్తున్న ఇ.నర్సింహారావు, డెంకాడ ఎస్ఐ ఎస్.కృష్ణవర్మ, కోర్టు అసిస్టెంట్ లైజన్ అధికారి ఆర్.ఉమామహేశ్వరరావు, డెంకాడ ఏఎస్ఐ బి.మల్లేశ్వరరావు, హెచ్‌సీ ఆర్.అప్పారావు, కోర్టు కానిస్టేబుల్ తవుడు నాయుడు, సైకాలజిస్ట్ రాంబాబులను ఎస్పీ అభినందించి నగదు రివార్డు, ప్రశంసాపత్రాలను అందజేశారు. -
గంజాయి, గుట్కాలు విక్రయిస్తే ఆస్తులు సీజ్
విజయనగరం టౌన్ : ఖైనీ, గుట్కాతో పాటూ గంజాయి అక్రమ రవాణా జిల్లాలో యథేచ్ఛగా సాగుతోంది. ఒడిశా నుంచి ఖైనీ, గుట్కా, గంజాయి తీసుకువచ్చి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీస్ యంత్రాంగం పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నా ప్రతి రోజూ ఎక్కడో ఒకచోట అక్రమ రవాణా గుట్టురట్టవుతోంది. ఇటువంటి నిషేధిత వస్తువుల క్రయ, విక్రయాలు చేపట్టకూడదని ఆదేశాలు జారీ చేస్తున్నా అక్రమార్కులు పట్టించుకోవడం లేదు. రవాణాను అడ్డుకునేందుకు పోలీస్ యంత్రాంగం స్పెషల్ టాస్క్‌ఫోర్స్ టీమ్‌ను ఏర్పాటుచేసి దాడులు చేపట్టింది. అయినప్పటికీ వ్యాపారులు వాటిని ఏ మాత్రం లెక్కచేయకుండా తమ వ్యాపారాలను రహస్యంగా సాగిస్తున్నారు. తరలిపోతుందిలా... ఒడిశా రాష్ట్రం నుంచి తీసుకువస్తున్న నిషేధిత ఖైనీ, గుట్కాలు జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. 2017లో జిల్లాలో 529 కేసులు నమోదవ్వగా... ఈ ఏడాది మే 21 నాటికి 57 కేసులు నమోదుచేశారు. వీటితో పాటు విజయనగరం పోలీస్‌లు 86 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ. 17, 80, 286 విలువైన సరుకు సీజ్ చేశారు. అదేవిధంగా గంజాయి కూడా ఇతర ప్రాంతాల నుంచి మన జిల్లా మీదుగా తరలిపోతుంది. ఇందులో ప్రధానంగా పెదబయలు, మంగబంద, గుంటసీమ, డబ్రిగూడ, అరకు మీదుగా అనంతగిరి, ఎస్.కోట, ఎల్.కోట, కొత్తవలస మీదుగా విశాఖ తరలిపోతుంటుంది. అదేవిధంగా కొటారుబిల్లి జంక్షన్, గంట్యాడ, తదితర ప్రాంతాల మీదుగా జిల్లాలోకి గంజాయి తరలిస్తున్నారు. ఒడిశాలో కోరాపుట్ నుంచి బరంపురం, సాలూరు మీదుగా విజయనగరంలోకి గంజాయి వస్తోంది. వీటితో పాటు రాయగడ మీదుగా పార్వతీపురం, సీతానగరం, బొబ్బిలి మీదుగా విజయనగరం మీదుగా విశాఖ, తదితర ప్రాంతాలకు గంజాయి తరలిస్తున్నారు. చెక్ పడేనా.. ? గంజాయి, ఖైనీ, గుట్కా వంటి నిషేధిత వస్తువుల రవాణాపై జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేక దృష్టిసారించింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారు. 24 గంటలూ తనిఖీలు చేపడుతున్నందున 2017లో 63 మందిని, 2018 ఇప్పటి వరకు 21 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్దన నుంచి ఆరువేలకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇంత చేస్తున్నప్పటికీ అక్రమార్కులు పోలీసుల కళ్లుగప్పి రవాణా కొనసాగిస్తున్నారు. కొన్నిప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించే సమయాల్లో కొంతమంది పోలీసులు కాసులకు కక్కుర్తి పడడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతోందన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఆస్తులు సీజ్ చేస్తాం ఖైనీ, గుట్కా, గంజాయిలను విక్రయిస్తూ పట్టుబడితే వారి ఆస్తులు జప్తు చేస్తాం. ఒక కేసు కంటే ఎక్కువ ఉన్న వారిని గుర్తిస్తున్నాం. నాలుగు కంటే ఎక్కువ కేసులుంటే పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తాం. –జి.పాలరాజు, ఎస్పీ, విజయనగరం. -
‘పరివర్తన’తో సత్ఫలితాలు
విజయనగరం టౌన్: పదేళ్లకు పైబడి నేరచరిత్ర కలిగి, సాధారణ జీవనం గడుపుతూ పోలీస్ నిఘాలో ఉన్న నేరస్తులపై ఉన్న హిస్టరీ షీట్లను మూసివేస్తూ ఎస్పీ జి.పాలరాజు కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ మేరకు గురువారం పోలీస్ కార్యాలయ సమావేశ మందిరంలో పరివర్తన పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించి జిల్లా వ్యాప్తంగా ఉన్న 920 హిస్టరీ షీట్లలో 85 షీట్లను మూసివేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న పాత నేరస్తుల జీవన విధానాన్ని, నడవడికను పరిశీలించి, వారు పరివర్తన చెందారని నిర్ధారించుకున్న తర్వాతనే హిస్టరీ షీట్లను మూసివేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 920 హిస్టరీ షీట్స్‌లో (ఇందులో 40 డీసీ షీట్లు, 61 కేడీ షీట్లు, 639 అనుమానిత షీట్లు, 180 రౌడీ షీట్లు) ఇందులో 85 హిస్టరీషీట్స్ (ఐదు డీసీ షీట్స్, 2 కేడీషీట్స్, 46 రౌడీషీట్లు, 32 అనుమానిత షీట్లు) మూసి వేశామన్నారు. పాత నేరస్తులపై ఈ షీట్స్ ఉండడం వల్ల సమాజంలో వారి కుటుంబానికి సరైన గౌరవం లేకపోవడం, వారిపై నిరంతరం పోలీసులు నిఘా ఉండడం వల్ల ప్రజల్లో చిన్న చూపునకు గురవడం జరుగుతుందన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని కొన్నేళ్లుగా నేరాలకు పాల్పడకుండా ఉన్న వారిని, వృద్ధాప్యంలో ఉన్న వారిని, Ð5éరి జీవన విధానంలో మార్పు వచ్చిన మార్పులను, నడవడికను పరిశీలించి, వారు సక్రమంగా కుటుంబంతో జీవిస్తున్నారా? లేదా? అన్న విషయం గురించి గత ఆరు నెలలుగా వివిధ రకాలుగా పోలీసు రికార్డులను పరిశీలించారు. వారు మంచిగా జీవనం సాగిస్తున్నారని నిర్ధారించుకున్న తర్వాత వారిపై గల హిస్టరీ షీట్లను మూసివేస్తూ చారిత్రక నిర్ణయాన్ని తీసుకున్నామన్నారు. ఇక వారిపై ఎటువంటి పోలీసు నిఘా ఉండదని, పోలీసుల వేధింపులు ఉండవని, సక్రమంగా కుటుంబాలతో జీవించేందుకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. నేరస్తులలో మార్పు తీసుకురా>వడం, వారిలో నిజాయితీగా పరివర్తన తీసుకురావడం వంటి చర్యలను చేపట్టడం వలన మాత్రమే నేరాలను అదుపులోనికి తీసుకురావడంతో పాటూ నేరస్తులలో మార్పు తీసుకురావచ్చని పేర్కొన్నారు. ఇటీవల హిస్టరీ షీట్ కలిగిన వండాన ధర్మారావు అనే పాత నేరస్తుని కుమార్తె ఎమ్మెస్సీ బయోకెమిస్ట్రీ చదువుకుని ఒక కెమికల్ ఫ్యాక్టరీలో కెమిస్ట్‌గా ఉద్యోగం సాధించుకున్నారన్నారు. ఇదోక శుభ పరిణామమని తెలిపారు. 60 శాతం నేరాలు అనేవి పదే పదే నేరాలకు పాల్పడుతున్న వ్యక్తుల వల్ల మాత్రమే జరుగుతున్నాయన్నారు. వీటిని గుర్తించి అనవసరమైన వ్యక్తులపై నిఘాను తగ్గించి, అవసరమైన నేరస్తులపై నిఘాను మరింతగా బలోపేతం చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా హిస్టరీ షీట్లను మూసివేస్తున్నట్లుగా ధ్రువపత్రాలను అందజేశారు. అనంతరం పలువురు పాత నేరస్తులు మాట్లాడుతూ హిస్టరీ షీట్లు తొలగించినందుకు ఎస్పీ పాలరాజుకి కృతజ్ఞతలు తెలిపారు. ఎటువంటి సందర్భంలోనూ తప్పులు చేయబోమన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ అట్టాడ వెంకటరమణ, పార్వతీపురం ఏఎస్పీ దీపికా ఎమ్.పాటిల్, బొబ్బిలి డీఎస్పీ సౌమ్యలత, డీఎస్పీలు ఎవి.రమణ, ఎఎస్.చక్రవర్తి, టి.త్రినాథ్, దాసరి లక్ష్మణరావు, సీఐలు రఘు శ్రీనివాస్, చంద్రశేఖర్, పోలీస్ అధికారులు, సిబ్బంది, పాత నేరస్తులు పాల్గొన్నారు. -
పోలీసులూ..ఇక హ్యాపీ
విజయనగరం టౌన్: విధి నిర్వహణలో బిజీగా ఉండే జిల్లా పోలీస్ యంత్రాంగానికి ఎస్పీ పుట్టినరోజు నిర్వహించుకునే పోలీసులకు ఆ రోజు వారి కుటుంబ సభ్యులతో స్వేచ్ఛగా గడిపేందుకు అవకాశం కల్పిస్తూ చర్యలు చేపట్టేందుకు శ్రీకారం చుట్టారు. దీంతో జిల్లా పోలీస్ యంత్రాంగం హర్షం వ్యక్తం చేసింది. సుమారు 2వేల మంది పోలీసులు వివిధ హోదాల్లో శాంతిభద్రతలను పరిరక్షించేందుకు జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారు. విధి నిర్వహణలో భాగంగా తరచూ వివిధ ప్రాంతాలకు వెళ్లడం, సమయపాలన లేకుండా విధులు నిర్వహించడం, కుటుంబ సభ్యులతో స్వేచ్ఛగా గడిపే సమయాలు తక్కువగా మాట్లాడడం, కుటుంబంలో జరిగే కొన్ని శుభ కార్యాక్రమాలకు కూడా హాజరుకాని పరిస్థితులు తరచూ ఎదరవుతూనే ఉంటాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని జిల్లా పోలీస్ శాఖలో పనిచేసే సిబ్బంది పుట్టిన రోజున ఉదయం వారికి స్వయంగా శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు, వారి కుటుంబంతో స్వేచ్ఛగా గడిపేందుకు పర్మిషన్ ఇచ్చే విధంగా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా , ప్రతీ రోజూ నిర్వహించే ‘ప్రతిదినం– ప్రబోధం’ కార్యక్రమం తర్వాత నేరుగా సంబంధిత సిబ్బంది పేర్లను ప్రత్యేక కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా పిలిచి, వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరిచి, వారి కుటుంబ సభ్యులతో గడిపేందుకు జన్మదినం రోజున పర్మిషన్ మంజూరు చేయాల్సిందిగా పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు. -
నేరాలకు పాల్పడే వారిపై కన్నేయండి : ఎస్పీ
విజయనగరం టౌన్: వరుస నేరాలకు పాల్పడే వారిని గుర్తించి, వారిపై హిస్టరీ షీట్లు తప్పనిసరిగా తెరిచి, నిరంతర నిఘాను ఉంచాలని ఎస్పీ జి.పాలరాజు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలుమార్లు నేరాలకు పాల్పడే వారికి స్టేషన్ బెయిల్‌ను మంజూరు చేయవద్దన్నారు. వారిని రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించాలన్నారు. నిబంధనలు అతిక్రమించిన వాహనదారులపైన, బెల్టుషాపులు ద్వారా మద్యం విక్రయాలు చేపట్టే వారిపైనా, నిషేధిత ఖైనీ, గుట్కాలు విక్రయదారులు, మద్యం సేవించి వాహనాలు నడిపేవారు, మద్యం సేవించి బహిరంగ ప్రాంతంలో వీరంగం చేసే వారిపైనా, గంజాయి అక్రమ రవాణాదారులపైనా దాడులు ఉధృతం చేయాలని, వారిపై కేసులు నమోదు చేయాలని సూచించారు. తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలు పొందే సాంకేతికత జిల్లా పోలీసు శాఖకు త్వరలో అందుబాటులో తీసుకురానున్నట్లు, ఈ పరిజ్ఞానంతో కేసుల మిస్టరీని చేధించవచ్చన్నారు. అదనపు ఎస్పీ అట్టాడ వెంకటరమణ, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ పరశురామ్, బొబ్బిలి డీఎస్పీ పి.సౌమ్యలత, ఎస్సీ,ఎస్టీ సెల్ డీఎస్పీలు టి.త్రినాథ్, గురుమూర్తి, సీసీఎస్ డీఎస్పీ ఎఎస్.చక్రవర్తి, ట్రాఫిక్ డీఎస్పీ ఎల్.రాజేశ్వరరావు, మహిళా పీఎస్ డీఎస్పీ కుమారస్వామి, డీటీసీ డీఎస్పీ సిహెచ్‌వి.ప్రసాద్, ఏఆర్ డీఎస్పీ ఎ.హనుమంతు, స్పెషల్ బ్రాంచ్ సీఐ బివిజె.రాజు, డీసీఆర్బీ సీఐ రఘు శ్రీనివాస్, లీగల్ అడ్వయిజర్ జానకి రామరావు, సీఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.