విజయనగరం టౌన్: పదేళ్లకు పైబడి నేరచరిత్ర కలిగి, సాధారణ జీవనం గడుపుతూ పోలీస్ నిఘాలో ఉన్న నేరస్తులపై ఉన్న హిస్టరీ షీట్‌లను మూసివేస్తూ ఎస్పీ జి.పాలరాజు కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ మేరకు గురువారం పోలీస్ కార్యాలయ సమావేశ మందిరంలో పరివర్తన పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించి జిల్లా వ్యాప్తంగా ఉన్న 920 హిస్టరీ షీట్లలో 85 షీట్లను మూసివేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న పాత నేరస్తుల జీవన విధానాన్ని, నడవడికను పరిశీలించి, వారు పరివర్తన చెందారని నిర్ధారించుకున్న తర్వాతనే హిస్టరీ షీట్‌లను మూసివేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 920 హిస్టరీ షీట్స్‌లో (ఇందులో 40 డీసీ షీట్లు, 61 కేడీ షీట్లు, 639 అనుమానిత షీట్లు, 180 రౌడీ షీట్లు) ఇందులో 85 హిస్టరీషీట్స్ (ఐదు డీసీ షీట్స్, 2 కేడీషీట్స్, 46 రౌడీషీట్లు, 32 అనుమానిత షీట్లు) మూసి వేశామన్నారు. పాత నేరస్తులపై ఈ షీట్స్ ఉండడం వల్ల సమాజంలో వారి కుటుంబానికి సరైన గౌరవం లేకపోవడం, వారిపై నిరంతరం పోలీసులు నిఘా ఉండడం వల్ల ప్రజల్లో చిన్న చూపునకు గురవడం జరుగుతుందన్నారు.
వీటిని దృష్టిలో పెట్టుకుని కొన్నేళ్లుగా నేరాలకు పాల్పడకుండా ఉన్న వారిని, వృద్ధాప్యంలో ఉన్న వారిని, Ð5éరి జీవన విధానంలో మార్పు వచ్చిన మార్పులను, నడవడికను పరిశీలించి, వారు సక్రమంగా కుటుంబంతో జీవిస్తున్నారా? లేదా? అన్న విషయం గురించి గత ఆరు నెలలుగా వివిధ రకాలుగా పోలీసు రికార్డులను పరిశీలించారు. వారు మంచిగా జీవనం సాగిస్తున్నారని నిర్ధారించుకున్న తర్వాత వారిపై గల హిస్టరీ షీట్‌లను మూసివేస్తూ చారిత్రక నిర్ణయాన్ని తీసుకున్నామన్నారు. ఇక వారిపై ఎటువంటి పోలీసు నిఘా ఉండదని, పోలీసుల వేధింపులు ఉండవని, సక్రమంగా కుటుంబాలతో జీవించేందుకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. నేరస్తులలో మార్పు తీసుకురా>వడం, వారిలో నిజాయితీగా పరివర్తన తీసుకురావడం వంటి చర్యలను చేపట్టడం వలన మాత్రమే నేరాలను అదుపులోనికి తీసుకురావడంతో పాటూ నేరస్తులలో మార్పు తీసుకురావచ్చని పేర్కొన్నారు.
ఇటీవల హిస్టరీ షీట్ కలిగిన వండాన ధర్మారావు అనే పాత నేరస్తుని కుమార్తె ఎమ్మెస్సీ బయోకెమిస్ట్రీ చదువుకుని ఒక కెమికల్ ఫ్యాక్టరీలో కెమిస్ట్‌గా ఉద్యోగం సాధించుకున్నారన్నారు. ఇదోక శుభ పరిణామమని తెలిపారు. 60 శాతం నేరాలు అనేవి పదే పదే నేరాలకు పాల్పడుతున్న వ్యక్తుల వల్ల మాత్రమే జరుగుతున్నాయన్నారు. వీటిని గుర్తించి అనవసరమైన వ్యక్తులపై నిఘాను తగ్గించి, అవసరమైన నేరస్తులపై నిఘాను మరింతగా బలోపేతం చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా హిస్టరీ షీట్‌లను మూసివేస్తున్నట్లుగా ధ్రువపత్రాలను అందజేశారు. అనంతరం పలువురు పాత నేరస్తులు మాట్లాడుతూ హిస్టరీ షీట్‌లు తొలగించినందుకు ఎస్పీ పాలరాజుకి కృతజ్ఞతలు తెలిపారు. ఎటువంటి సందర్భంలోనూ తప్పులు చేయబోమన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ అట్టాడ వెంకటరమణ, పార్వతీపురం ఏఎస్పీ దీపికా ఎమ్.పాటిల్, బొబ్బిలి డీఎస్పీ సౌమ్యలత, డీఎస్పీలు ఎవి.రమణ, ఎఎస్.చక్రవర్తి, టి.త్రినాథ్, దాసరి లక్ష్మణరావు, సీఐలు రఘు శ్రీనివాస్, చంద్రశేఖర్, పోలీస్ అధికారులు, సిబ్బంది, పాత నేరస్తులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment