కేసులో క్రియాశీలక పాత్ర పోషించిన పోలీసులను అభినందిస్తున్న ఎస్పీ పాలరాజు
విజయనగరం టౌన్: డెంకాడ పోలీస్‌స్టేషన్ పరిధికి చెందిన ఒక హత్య కేసులో డెంకాడ మండలం చినతాడివాడ గ్రామానికి చెందిన కానూరి ఆచారికీ యావజ్జీవ ఖైదుతో పాటు రూ.40వేల జరిమానా విధిస్తూ జిల్లా సెషన్స్ జడ్జి ఆలపాటి గిరిధర్ సోమవారం తీర్పు వెల్లడించారు.
కేసు దర్యాప్తులో, ప్రాసిక్యూషన్‌లో సాక్ష్యాధారాలను సక్రమంగా ప్రవేశపెట్టి, నిం దితుడు కానూరి ఆచారి శిక్షింపబడటంలో క్రియాశీలక పాత్ర పోషించిన పోలీస్ అధికారులు, సిబ్బందిని ఎస్పీ జి.పాలరాజు మంగళవారం ప్రత్యేకంగా అభినందించి, ప్రశంసా పత్రాలను, నగదు రివార్డులను అందజేశారు.
డెంకాడ మండలం చినతాడివాడ గ్రామానికి చెందిన కానూరి ఆచారి పుట్టు మూగ, చెవుడు. చెడు వ్యసనాలకు అలవాటు పడిన ఆచారి తనకు పెళ్లి చేయమని, తన తల్లి సావిత్రమ్మను తరచూ తగవులు జరుగుతుండేవి. 2017 జూన్ 2న ఆచారి పెళ్లి చేయమని తన తల్లి సావిత్రిని ఒత్తిడి చేయడంతో ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఆచారి పట్టరాని ఆవేశంతో తన తల్లి సావిత్రమ్మ తలపై చెక్కతో కొట్టి తీవ్రంగా గాయపర్చడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.
డెంకాడ ఎస్‌ఐ కృష్ణ వర్మ హత్యాయత్నంగా కేసు నమోదు చేయగా భోగాపురం సీఐ ఇ.నర్సింగరావు దర్యాప్తు చేపట్టారు. విచారణలో కేసు రుజువు కావడంతో ఆచారీకి యావజ్జీవ ఖైదుతో పాటు రూ.40వేలు జరిమానాగా విధిస్తూ జిల్లా సెషన్స్ జడ్జి ఆలపాటి గిరిధర్ తీర్పు వెల్లడించారు.
కేసు దర్యాప్తు చేసిన పోలీసు అధికారులు, నిందితులకు శిక్ష పడటంలో ప్రతిభ కనబరిచి, క్రియాశీలక పాత్ర పోషించిన అప్పటి భోగాపురం సీఐ, ప్రస్తుత విశాఖ ఎన్‌డీపీఎస్ సెల్‌లో పని చేస్తున్న ఇ.నర్సింహారావు, డెంకాడ ఎస్‌ఐ ఎస్.కృష్ణవర్మ, కోర్టు అసిస్టెంట్ లైజన్ అధికారి ఆర్.ఉమామహేశ్వరరావు, డెంకాడ ఏఎస్‌ఐ బి.మల్లేశ్వరరావు, హెచ్‌సీ ఆర్.అప్పారావు, కోర్టు కానిస్టేబుల్ తవుడు నాయుడు, సైకాలజిస్ట్ రాంబాబులను ఎస్పీ అభినందించి నగదు రివార్డు, ప్రశంసాపత్రాలను అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment