మలివిడత మాల్యా ఆస్తుల జప్తుపై ఈడీ దృష్టి
న్యూఢిల్లీ: బ్యాంకులకు రూ.9వేల కోట్ల రుణాలను చెల్లించకుండా, బ్రిటన్‌లో తలదాచుకున్న ప్రముఖ వ్యాపార వేత్త విజయ్‌మాల్యాకు సంబంధించి మరిన్ని ఆస్తులను అటాచ్ చేసే దిశగా ఈడీ తన చర్యలను ముమ్మరం చేసింది. మాల్యాపై విచారణ జరుపుతున్న ఈడీ ఇప్పటికే రూ. 8,041 కోట్ల విలువైన ఆస్తులను మనీ లాండరింగ్ చట్టం కింద అటాచ్ చేసిన విషయం తెలిసిందే. మరోసారి వేల కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్ చేసే దిశగా ఈడీ దర్యాప్తు బృందం చర్యలు ముమ్మరం చేసింది. ఇందుకు సంబంధించి ముంబై కోర్టు ఆదేశాలను సైతం పొందింది. ఈ సారి అటాచ్‌మెంట్ చేసే వాటిలో మాల్యా విదేశీ ఆస్తులు కూడా ఉన్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఈడీ ఈ నెల 3న రెండో విడత మాల్యాకు సంబంధించి రూ.6,630 కోట్ల ఆస్తులను అటాచ్ చేసిన విషయం తెలిసిందే. కాగా, మాల్యా అరెస్ట్‌కు వారంట్ జారీ చేయాలని ఇంటర్‌పోల్‌ను కోరిన ఈడీ తాజా అభియోగాలను నమోదు చేసింది.