ట్రంప్ లక్ష్యం ఉపాధి కల్పనేనా?
సందర్భం
నేడు ఆయా దేశాలలో పెరిగిపోతోన్న నిరుద్యోగ సమస్య నేపధ్యంలోనే బ్రిట న్‌లో ‘‘బ్రెగ్జిట్’’, అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ గెలుపు, ఫ్రాన్స్ వంటి దేశాలలో అనేక చోట్ల మితవాద నేతలూ, పార్టీల ఎదుగుదల జరుగుతున్నాయి. ధనిక దేశాలలోని ఈ నిరుద్యోగ సమస్యకు అక్కడికి వలస వచ్చిన విదేశీయులూ, లేదా తమ తమ దేశాలనుంచి ఉద్యో గాలు చైనా, భారత్, మెక్సికోల వంటి తక్కువ వేతనాలు ఉన్న దేశాలకు ‘‘అవుట్ సోర్సింగ్’’ రూపంలో తరలిపోవడం కారణ మని ఈ మితవాద పార్టీలూ, నేతలూ ప్రచారం చేస్తున్నారు.
అమెరికాలో ట్రంప్, ఆయన విధానాల సారాంశాన్నీ అర్థం చేసుకోగలిగితే, మిగతా ప్రపంచంలో జరుగుతున్న పరిణామా లను సులువుగా అర్థం చేసుకోవచ్చు. అమెరికాలో నిరుద్యోగం పెరగటానికి ప్రవాసితులూ, అవుట్ సోర్సింగ్‌లే కారణమనేది ట్రంప్‌లాంటి వారి వాదన. కాబట్టి కొత్తగా వచ్చే ప్రవాసితులను అడ్డుకుంటే, ఇప్పటికే అక్కడ ఉన్న వారిని ఏదో ఒక సాకుతో స్వదేశాలకు పంపేస్తే అమెరికాలో ‘‘స్థానికులకు’’ భారీగా ఉద్యో గాలు వస్తాయనీ, తద్వారా తన ఘనమైన గతాన్ని అమెరికా తిరిగి పొందుతుందనేది ట్రంప్ వాదనల సారాంశం.
నిజానికి అమెరికాలో, బ్రిటన్‌లో లేదా ఫ్రాన్స్‌లోని సాధారణ జనాలలో కూడా తమ నిరుద్యోగానికి ప్రవాసితులే కారణం అనే దురభిప్రాయం నెలకొని ఉంది. అయితే, ఈ వాదన పూర్తిగా అసంబద్ధమైనది. నేడు నిరుద్యోగ సమస్య తాలూకు తీవ్రత పెరగటం అనేది, కాస్తో కూస్తో తేడాలతో ప్రపంచంలోని అన్ని దేశాలలోనూ పెద్ద ఎత్తున జరుగుతున్న పరిణామమే!
భారత్‌లో కూడా 2013, 2014 సంవత్సరాలలో సుమారుగా 4,30,000 మందికి ఉపాధి కల్పన జరిగింది. కాగా, ‘మేకిన్ ఇండియా’ (2014, సెప్టెంబర్) కాలంలో 2015లో కల్పించిన ఉపాధిSకేవలం 1,35,000 మాత్రమే! 2016 పరిస్థితీ ఆశావహంగా లేదు. నిజానికి నేడు సగటున రోజుకు 550 ఉద్యోగాలను మన దేశం కోల్పోతోంది. కాగా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశా లలో లాగా, మన దేశంలోకి ప్రవాసితులెవ్వరూ ఉపాధికోసం రావడం లేదు. అలాగే, విదేశీయులకు ఉద్యోగాలను కల్పించని చైనాలోనూ ఇదే పరిస్థితి. అక్కడ కూడా గత కొన్నేళ్లుగా ఎంతో కొంతమేర నిరుద్యోగం పెరుగుతూనే ఉంది. ఇలాగే అనేకానేక ఇతర అభివృద్ధి చెందుతోన్న దేశాలలో కూడా జరుగుతోంది.
కాబట్టి నేడు నిరుద్యోగ సమస్య పెరుగుదల అనేది ఏ ఒక్క ప్రత్యేక దేశం తాలూకు విడి సమస్య కాదు. ఇది, తీవ్రతలో కాస్తో కూస్తో తేడాలతో అన్ని దేశాలలోనూ జరుగుతోన్న పరిణామమే! నిజానికి ఈ సమస్య మూలం ప్రవాసితులలోనో, కేవలం అవుట్ సోర్సింగ్‌లోనో కాకుండా వేగం పుంజుకుంటున్న యాంత్రీకరణ, పారిశ్రామిక రోబోట్ల వినియోగంలోనూ ఉంది. ఒక సర్వే ప్రకారం నేడు అమెరికాలో మిగిలివున్న ఉద్యోగాలలో 47% రాబోయే దశాబ్ద కాలంలో, యాంత్రీకరణ వలన పోతాయి. అలాగే భార త్‌లో ఈ సంఖ్య 69%గా ఉంది. అదీ కథ!
మరి పెట్టుబడిదారుల లాభాల వేటలో జరుగుతోన్న యాంత్రీకరణ వలన పెరిగిపోతోన్న, నిరుద్యోగ సమస్యకు భారత్, చైనా, మెక్సికో వంటి అభివృద్ధి చెందుతోన్న దేశాల నుంచి వస్తోన్న ప్రవాసితులే కారణమని ట్రంప్ వంటి వారు ఎందుకు చెబుతోన్నట్టు? ముఖ్యంగా ధనిక దేశాలలోని సామాన్య ప్రజలు మెల్ల మెల్లగా పెద్ద ఎత్తున కార్పొరేట్ ధనవంతులూ, పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా ‘‘మేము 99% మందిమి’’ వంటి నినాదంతో ‘‘ఆక్యుపై వాల్‌స్ట్రీట్’’ వంటి ఉద్యమాలలో మమేకం అవుతూ ఉండడమే!
2011లో అమెరికాలో జరిగిన ఈ ఆక్యుపై ఉద్యమం, కేవలం 1% మందిగా ఉన్న అమెరికా కార్పొరేట్ ధన వంతుల వల్లే తమ సమస్యలు పెరుగుతున్నాయన్న, 99% మంది అమెరికా సామాన్య జనం తాలూకు ఆక్రోశానికి ప్రతిబింబంగా ఉంది. ఈ ఉద్యమం నాడు ప్రపంచంలోని 800 నగరాలకు విస్తరిం చింది. మన ముంబైలో కూడా ‘‘ఆక్యుపై దలాల్ స్ట్రీట్’’ పేరిట చిన్న స్థాయిలోనైనా ఈ ఉద్యమ ప్రతిధ్వని వినపడింది. ఇక ఆక్యుపై వాల్‌స్ట్రీట్ ప్రభావం 2016 నవంబర్‌లో జరిగిన అమెరికా ఎన్నికల క్రమంలో డెమోక్రటిక్ పార్టీలో అభ్యర్థి అయిన సోషలిస్ట్ బెర్నీ శాండర్స్ రూపంలోనూ కనపడింది. నిజానికి, అమెరికా యువ జనులలోని 80% మంది ఆకాంక్షలకు బెర్నీ శాండర్స్ ప్రతినిధి అనీ, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి అయిన డొనాల్డ్ ట్రంప్‌ను ఓడించేందుకు, హిల్లరీ క్లింటన్ కంటే శాండర్సే మెరుగైన అభ్యర్థి అనీ, నాడు అమెరికా పత్రికలే పలుమార్లు చెప్పాయి.
ఇదీ విషయం!!! ఇక ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్‌లూ, బ్రెగ్జి ట్‌లూ, ఫ్రాన్స్ వంటి దేశాల మితవాదులూ అందరి టార్గెట్ ఒకటే. తమ తమ దేశాలలోని సామాన్య ప్రజలు కార్పొరేట్లకూ, ధనవంతులకూ వ్యతిరేకంగా జమవుతోన్న పరిణామాన్ని నిరో ధించటమే. ఆ ప్రజల ఐక్యతని విచ్ఛిన్నం చేయటమే. తద్వారా ప్రపంచంలో పెరిగిపోతోన్న ఆర్థిక అసమానతలూ, పేదరికం, నిరుద్యోగ సమస్యల కారణాల విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించి వారిమధ్య జాతి వైషమ్యాలూ, దేశీయ విదేశీ ఉద్యోగులూ వంటి విద్వేషాలను రెచ్చగొట్టటమే. కాబట్టి జనాలు తమ సమ స్యలకు అసలు కారణం నుంచి దృష్టిని మళ్ళిస్తే అది వారు తమ వేలితో తమ కన్నే పొడుచుకున్నట్లుగా అవుతుంది.
- డి. పాపారావు
వ్యాసకర్త ఆర్థికరంగ నిపుణులు ‘ మెుబైల్ : 98661 79615