స్పెక్ట్రమ్ అమ్మకంతో ద్రవ్యలోటు భర్తీ..!
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయాలు-వ్యయాలకు మధ్య వ్యత్యాసమైన ద్రవ్యలోటు వచ్చే ఆర్థిక సంవత్సరం (2016-17) స్థూల దేశీయోత్పత్తిలో 3.5 శాతానికి కేంద్ర ఆర్థిక మంత్రి పరిమితం చేస్తారన్న అంచనాలను దేశీయంగా ఫిచ్ రేటింగ్స్ అనుబంధ విభాగం- ఇండియా రేటింగ్స్ వెలువరించింది. ఇందుకు స్పెక్ట్రమ్ అమ్మకాలు దోహదపడతాయని సైతం విశ్లేషించింది. ఫిబ్రవరి 29న ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో ద్రవ్యలోటు లక్ష్యాన్ని పెంచే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇండియా రేటింగ్స్ వెలువరించిన అంచనాలకు ప్రాధాన్యత ఏర్పడింది. మరిన్ని ముఖ్యాంశాలు చూస్తే...
రెవెన్యూ యేతర ఆదాయాల ద్వారా ద్రవ్యలోటును ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇందులో స్పెక్ట్రమ్ అమ్మకాలు ఒకటి. ఏడవ వేతన కమిషన్ సిఫారసుల అమలు వల్ల ఏర్పడే ఆదాయలోటును ఇతర ఆదాయాలు భర్తీ చేస్తాయి.పెట్టుబడులకు సంబంధించి ప్రభుత్వం అదనపు వ్యయాలు ఎలా చేయగలుగుతుందన్న అంశాన్ని భారత పరిశ్రమ జాగ్రత్తగా పరిశీలిస్తోంది. ప్రస్తుతం దాదాపు 1.7%కి (జీడీపీలో) పరిమితమవుతున్న మూలధన పెట్టుబడులను 2 శాతానికి పెంచాల్సిన అవసరం ఉంది.
ఈ ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు లక్ష్యాన్ని 3.9%కన్నా అధికంగా 4.1%కి (రూ.5.6 లక్షల కోట్లు) పెంచవచ్చు.ఆర్థిక వ్యవస్థకు కీలకమైన ప్రభుత్వ రంగ బ్యాంకులకు తాజా మూలధనానికి బడ్జెటరీ మద్దతు ఒక సవాలే. బాసెల్ 3 ప్రమాణాల అమలుకు 2017 ఏప్రిల్ నుంచి 2019 మార్చి మధ్య బ్యాంకులకు రూ.3.7 లక్షల కోట్ల మూలధనం అవసరం.మౌలిక రంగంపై ప్రధానంగా దృష్టి పెట్టాలి. అయితే పెట్టుబడులకు సంబంధించి కేంద్రం ప్రత్యామ్నాయ మార్గాలను వెతకాల్సిన అవసరం ఉంటుంది. నిలిచిపోయిన ప్రాజెక్టుల పునరుద్ధరణకు ఒక వ్యూహం అవసరం.కాలం తీరిన వాణిజ్య వాహనాల స్థానంలో కొత్త వాటిని తీసుకురావడానికి ఒక ‘స్క్రాపింగ్ పథకాన్ని’ బడ్జెట్ తీసుకువచ్చే వీలుంది. పెద్ద కార్లు, స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్‌పై ఎక్సైజ్ సుంకాలు తగ్గించే అవకాశం ఉంది.
జీవిత బీమా పరిశ్రమకు ఊతం...
దేశాభివృద్ధిలో జీవిత బీమా పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రత్యేకించి మౌలిక రంగంలో పెట్టుబడులు సమకూర్చడానికి ఈ పరిశ్రమ ముఖ్య భూమిక పోషిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రంగం మరింత పురోభివృద్ధి సాధించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా దేశంలోని మారుమూల ప్రాంతాలన్నింటికీ ఈ రంగం విస్తరించాలి. అందువల్ల 2016-17 బడ్జెట్ ఈ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని భావిస్తున్నా. ముఖ్యంగా ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై) పట్ల ఆకర్షణ మరింత పెంచేందుకు ‘డెత్ బెనిఫిట్’ను రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలి. 80సీ మినహాయింపు పరిమితిని ప్రస్తుత 1.5 లక్షల నుంచి రూ.2 లక్షలకు పెంచడం పొదుపులను ప్రోత్సహించడానికి దోహదపడుతుంది. - అరిజిత్ బసు, ఎస్‌బీఐ లైఫ్ ఎండీ అండ్ సీఈఓ
ఆరోగ్య భద్రతపై దృష్టి...
ఆరోగ్య భద్రత విషయంలో లక్ష్యాలు నెరవేరడానికి ఒక సమర్థవంతమైన ప్రణాళిక అవసరం. ఇలాంటి ప్రణాళిక లేకపోవడం వల్ల ఈ రంగానికి కేటాయింపుల్లో 15 నుంచి 16 శాతం మేర నిరుపయోగంగా మిగిలిపోతోంది. 2011 నుంచీ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. తాజా బడ్జెట్ ఈ విషయాన్ని గమనించి సమస్య పరిష్కారం దిశలో చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నాం. ఆరోగ్య సంరక్షణ విషయంలో ముందుగానే ప్రజలను చైతన్యవంతం చేసే కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టాలి. ఒక వ్యాధి ముదరకముందే దానిని గుర్తించి, చికిత్స వ్యయ భారాలను తగ్గించే దిశలో ప్రభుత్వం తగిన వ్యూహ రచన చేయాలి. ఈ రంగంలో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలి. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాలపై దృష్టి పెట్టడం ద్వారా ఆరోగ్య భద్రతా విభాగంలో తగిన ఫలితాలు రాబట్టవచ్చని భావిస్తున్నాం. - అమీరా షా, మెట్రోపొలిస్ హెల్త్‌కేర్ ఎండీ, సీఈఓ
వాహన రంగంలో డిమాండ్ వృద్ధి..
తయారీ, ఉపాధి కల్పన మార్గాల ద్వారా దేశాభివృద్ధిలో వాహన రంగం భాగస్వామ్యం కీలకం. వినియోగదారు సెంటిమెంట్ బలపడ్డానికి, డిమాండ్ మెరుగుదలకు బడ్జెట్ కీలక చర్యలు ప్రకటిస్తుందని భావిస్తున్నాం. వివిధ రాష్ట్రాల్లో ప్రస్తుత ప్రైసింగ్, పన్ను విధానాలు విభిన్నంగా ఉన్నాయి. ఈ పన్ను వ్యవస్థను సరళీకరించడంపై బడ్జెట్ దృష్టి సారిస్తుందని భావిస్తున్నాం. వ్యాపార పటిష్టత దిశలో వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) అమలు కీలక పాత్ర పోషిస్తుంది. కార్లు, స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్‌పై ఎక్సైజ్ సుంకాల తగ్గింపు వల్ల పరిశ్రమ సెంటిమెంట్ బలపడుతుందని భావిస్తున్నాం. రోడ్డు రవాణా వ్యవస్థ మెరుగుదలకు తీసుకునే చర్యలు కూడా వాహన పరిశ్రమ పురోభివృద్ధికి దోహదం చేస్తుంది. - జో కింగ్, ఆడీ ఇండియా హెడ్