
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వచ్చే ఐదేళ్లపాటు స్థిరంగా ఏడాదికి తొమ్మిది శాతం వృద్ధి చెందితేనే 2028–29 ఆర్థిక సంవత్సరం నాటికి భారత్ ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు సోమవారం పేర్కొన్నారు. భారత్ 75వ స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకుని తెలంగాణా చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో దువ్వూరి చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు...
► ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్దేశించుకున్న ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ కలను సాకారం చేసుకోడానికి భారత్‌కు ఎనిమిది కీలక సవాళ్లు ఉన్నాయి. ఇందులో మొదటిది వచ్చే ఐదేళ్లలో భారత్ వరుసగా 9 శాతం చొప్పున వృద్ధిని సాధించాలి. తరువాతి అంశాల్లో కొన్ని పెట్టుబడులు పెరగాలి. ఉత్పత్పాదక మెరుగుపడాలి. విద్య, వైద్య రంగాలు పురోగమించాలి. భారీ ఉపాధి కల్పనలు జరగాలి. వ్యవసాయం మరింత తోడ్పాటును అందించాలి. ఎకానమీ ఫండమెంటల్స్ పటిష్టంగా కొనసాగుతూ ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు వంటి వంటి స్థూల ఆర్థిక అంశాలు స్థిరంగా ఉండాలి. పలు రంగాల్లో ప్రమాణాలు అంతర్జాతీయ స్థాయిలో ఉండాలి. పాలనా వ్యవస్థ మెరుగుపడాలి.
► రాష్ట్రాలు ఇచ్చే రాయితీలపై మోడీ చర్చను ప్రారంభించారు. అనవసర సబ్సిడీల పరిస్థితికి ఏ ఒక్కరూ కారణం కాదు. అన్ని రాజకీయ
పార్టీలూ ఇందుకు బాధ్యత వహించాలి.
► దేశానికి మిగులు బడ్జెట్‌లు లేవని, ఈ పరిస్థితుల్లో దేశానికి ఆర్థిక పరమైన భద్రతా వలయం తప్పనిసరిగా అవసరమని, కేంద్రం, రాష్ట్రాలు
గుర్తించాలి.
► అప్పు తెచ్చుకున్న డబ్బు నుండి ఎలాంటి ఉచితాలను ఇవ్వాలనే అంశాన్ని కేంద్ర, రాష్ట్రాలు జాగ్రత్తగా పరిశీలించాలి. ఇందుకు సంబంధించి ఎంపికలు జాగ్రత్తగా ఉండాలి. భవిష్యత్తు తరాలపై అనవసరమైన అప్పుల భారం మోపకూడదు.
► రూపాయి తన సహజ స్థాయిని కనుగొనడం అవసరమే. ఈ విషయంలో సెంట్రల్ బ్యాంక్ జోక్యం పరిమితంగానే ఉండాలి. తీవ్ర ఒడిదుడుకులను నివారించేలా మాత్రమే ఆర్‌బీఐ చర్యలు తీసుకోవాలి. డాలర్ మారకంలో మినహాయిస్తే, పలు కరెన్సీలకన్నా భారత్ మెరుగైన స్థితిలో ఉంది. పలు దేశాల మారకంలో బలపడింది.
Comments
Please login to add a commentAdd a comment