దండిగా ఫారెక్స్ నిల్వలు కరెన్సీ హెచ్చుతగ్గుల కట్టడిపై దృష్టి: దువ్వూరి
దండిగా ఫారెక్స్ నిల్వలు కరెన్సీ హెచ్చుతగ్గుల కట్టడిపై దృష్టి: దువ్వూరి
Published Fri, Aug 23 2013 2:00 AM | Last Updated on Fri, Sep 1 2017 10:01 PM
న్యూఢిల్లీ: రూపాయి అసాధారణ పతనం, పెరిగిపోతున్న కరెంటు ఖాతా లోటు (క్యాడ్) సమస్యలను ఎదుర్కొనేందుకు భారత్ వద్ద తగినంతగా విదేశీమారక (ఫారెక్స్) నిల్వలు ఉన్నాయని ఆర్‌బీఐ గవర్నర్ దువ్వురి సుబ్బారావు చెప్పారు. దేశీ కరెన్సీ తీవ్ర హెచ్చుతగ్గులకు లోను కాకుండా కట్టడి చేసేందుకు ఇటీవల తీసుకున్న చర్యలు.. రూపాయి స్థిరపడే దాకా కొనసాగుతాయని గురువారం ఆయన స్పష్టం చేశారు. పరిస్థితి మెరుగైన తర్వాత ఈ చర్యలను పునఃసమీక్షిస్తామన్నారు.
ఆగస్టు 9తో ముగిసిన వారాంతానికి ఫారెక్స్ నిల్వలు 277.17 బిలియన్ డాలర్ల నుంచి 278.60 బిలియన్ డాలర్లకు పెరిగాయి. కరెన్సీని బలపర్చేందుకు, జూలై 15-ఆగస్టు 23 మధ్య ఆర్‌బీఐ పలు చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. క్యాడ్‌ను భర్తీ చేసుకునే ప్రయత్నాలు: క్యాడ్‌ను భర్తీ చేయాలంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) మొదలైన రూపాల్లో వచ్చే నిధులు పెరగాల్సి ఉంటుందని దువ్వూరి చెప్పారు. ఈలోగా స్థిరం గా వచ్చే పెట్టుబడుల నిధులతో క్యాడ్‌ను భర్తీ చేసుకునేందుకు కృషి చేయాల్సి ఉందని, ప్రస్తుతం అవే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.
గందరగోళ సంకేతాలు ఎందుకంటే..
ఇటీవల తీసుకుంటున్న చర్యలతో మార్కెట్లకు గందరగోళ సంకే తాలు వెళుతున్నాయన్న వాదనలతో సుబ్బారావు ఏకీభవించారు. ‘మన చేతుల్లో లేని విదేశీ పరిణామాల కారణంగా దేశీయంగా పరిస్థితులు ప్రతి రోజూ చాలా వేగంగా మారిపోతున్నాయి. కొంత మేర వాటికి ప్రతిస్పందనగా చర్యలు తీసుకోవాల్సి వస్తోంది. కొన్నిసార్లు పరిణామాలను ముందస్తుగా అంచనా వేసి చర్యలు తీసుకుంటుండగా.. కొన్నిసార్లు ప్రతిస్పందనగా తీసుకోవాల్సి వస్తోంది’ అని దువ్వూరి చెప్పారు. ఇలాంటి సందర్భాల్లో ఈ పరిస్థితి తప్పదన్నారు.
ద్రవ్యోల్బణం..రూపాయికి లింకు..
రూపాయి క్షీణించే కొద్దీ ద్రవ్యోల్బణం పెరుగుతుందని, ఈ ప్రభావం ఈ మధ్య మరింత ఎక్కువైందని దువ్వూరి చెప్పారు. ఈసారి వర్షపాతం మెరుగ్గానే ఉన్నప్పటికీ, రూపాయి అదే పనిగా పతనమవుతున్న కారణంగా.. ఆ సానుకూల ప్రయోజనాలు పొందలేకపోవచ్చని రిజర్వ్ బ్యాంక్ వార్షిక నివేదికలో హెచ్చరించింది.
Advertisement
Advertisement