
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరానికి (2018–19) వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు రూ.11.77 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఈకాలంలో సగటున నెలకు 9.2 శాతం వృద్ధి రేటును సాధించి రూ.98,114 కోట్లుగా నమోదైనట్లు ఆర్థికశాఖ ప్రకటించింది. ఈఏడాది మార్చిలో అత్యధికంగా రూ.1.06 లక్షల కోట్లు వసూళ్లు అయినట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. తయారీ, వినియోగం గణనీయంగా పెరుగుతుందనడానికి ఇది సంకేతమని అన్నారయన. అనేక వస్తు, సేవలపై రేట్లు భారీగా తగ్గినప్పటికీ.. పండుగల సీజన్, పన్ను ఎగవేత నిరోధక చర్యల తీవ్రతరం వంటి అంశాలు వసూళ్ల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. ఇక ఏప్రిల్, అక్టోబర్, జనవరి, మార్చి నెలల్లో లక్ష కోట్ల మార్కును అధిగమించాయి. 2019–20 ఆర్థిక సంవత్సరం లక్ష్యం విషయానికి వస్తే.. కేంద్ర జీఎస్‌టీ 6.10 లక్షల కోట్లు, పరిహార సెస్ రూ.1.01 లక్షల కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్‌టీ రూ.50,000 కోట్లు.
మార్చిలో భారీ రిటర్న్స్...
జీఎస్‌టీ అమల్లోకి వచ్చిన జూలై 1, 2017 నుంచి ఇప్పటి వరకు మునుపెన్నటూ లేని విధంగా ఒక్క మార్చిలోనే 75.95 లక్షల రిటర్నులు దాఖలయ్యాయి. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. మార్చి నెల్లో కేంద్ర జీఎస్‌టీ రూ.20,353 కోట్లు, రాష్ట్రాల జీఎస్‌టీ వసూళ్లు రూ.27,520 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్‌టీ రూ.50,418 కోట్లు, సెస్ రూ.8,286 కోట్లు వసూలు కాగా.. మొత్తం కలిపి రూ.1.06 లక్షల కోట్లకు చేరుకుని రికార్డు నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment