
మళ్లీ కాసుల గలగలలు
- ప్రభుత్వ ఖజానాకు మళ్లీ పెరిగిన ఆదాయం
- పుంజుకున్న వాణిజ్య పన్నుల రాబడి
- ఆగస్టులో లక్ష్యాన్ని మించిన ఆదాయం
- రాష్ట్ర విభజన తరువాత గాడిలో పడిన పరిస్థితి
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర విభజనతో తగ్గిన మహానగర వాణిజ్యపన్నుల శాఖ ఆదాయం ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. ఆగస్టు నెలలో వివిధ పన్నుల ద్వారా లక్ష్యానికి మించి ఆదాయం సమకూరింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్ కేంద్రంగా వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తోన్న సంస్థలు పన్నుల చెల్లింపుపై ఆసక్తి కనబర్చక పోవడంతో సగానికిపైగా ఆదాయం పడిపోయింది.
కొత్త రాష్ట్రం ఏర్పడినా వ్యాపార లావాదేవీలపై పెద్దగా ప్రభావం లేకపోవడంతో మొదట్లో వెనుకడుగు వేసిన సంస్థలు పన్నుల చెల్లింపులకు సిద్దమయ్యాయి. దీంతో తాజాగా పన్నుల చెల్లింపులు మళ్లీ పెరిగాయి. ప్రభుత్వ ఖజానాకు ఆదాయం అత్యధికంగా వాణిజ్య పన్నుల శాఖ నుంచే సమకూరుతోంది.
వాణిజ్య పన్నుల శాఖకు సమకూరే ఆదాయంలో హైదరాబాద్ నగర రాబడి అత్యంత కీలకం. ఉమ్మడి రాష్ట్ర రాబడిలో సైతం 74 శాతం వరకు నగరం నుంచే జమ అయ్యేది. ప్రస్తుతం కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. ఈ శాఖ వసూలు చేసే పన్నుల్లో వ్యాట్ (విలువ ఆధారిత పన్ను) ప్రధానమైనది. ఇదేకాకుండా వృత్తి, వినోద తదితర పన్నుల ద్వారా కూడా కొంతవరకు రాబడి లభిస్తోంది. మొత్తం మీద వ్యాట్ ద్వారానే సుమారు 85 శాతానికిపైగా, 15 శాతం మిగితా పన్నుల ద్వారా ఆదాయం సమకూరుతోంది.
నగర రాబడి ఇలా..
తెలంగాణ రాష్ర్ట ఖజానాకు మహానగరం వాణిజ్య పన్నుల శాఖలు కల్పతరువనే చెప్పాలి. నగరంలోని డివిజన్ల నుంచే అత్యధిక రాబడి వస్తోంది. రాష్ట్రం మొత్తంలో 12 డివిజన్లు ఉండగా అందులో ఏడు డివిజన్లు నగర పరిధిలోనే ఉన్నాయి. మొత్తం డివిజన్లకు కలిపి వివిధ పన్నుల ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్ నుంచి ఆగస్టు) వరకు లభించిన ఆదాయం రూ.3,000.74 కోట్లు కాగా, అందులో నగరంలోని డివిజన్లు నుంచి లభించిన రాబడి మొత్తం రూ.2,493.68 కోట్లకుపైనే.
అందులో పంజగుట్ట డివిజన్ నుంచి రూ.500.68 కోట్లు, బేగంపేట నుంచి రూ. 444.02 కోట్లు, అబిడ్స్ నుంచి రూ.421.84 కోట్ల వరకు రాబడి వసూలైనట్టు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్, లిక్కర్, సిమెంట్, ఐరన్, గోల్డ్, హోటల్ ఇండస్ట్రీ, షాపింగ్ మాల్స్ తదితర సంస్థల నుంచి భారీగా పన్నులు వసూలవుతాయి.