సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దక్షిణ మధ్య రైల్వే భారీ ఆదాయాన్ని ఆర్జించింది. ఏప్రిల్ నుంచి నవంబర్ నాటికి అది రూ.8,103 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో పొందిన ఆదాయం కంటే ఇది రూ.1,365 కోట్లు అధికం (20 శాతం వృద్ధి) కావటం విశేషం. మిగతా జోన్ల కంటే ఆదాయ వృద్ధిలో ప్రతి త్రైమాసికానికి దక్షిణ మధ్య రైల్వే మెరుగైన తీరు కనబరుస్తోంది. కేవలం నవంబర్ నెలలోనే రూ.1,181 కోట్లను పొందింది. ఇది గత నవంబర్‌లో రూ.903 కోట్లే కావటం విశేషం. ఇందులో సరుకు రవాణా ద్వారా రూ.865 కోట్లు ఆర్జించింది. ఈ ఆర్థిక సంవత్సరం ఎనిమిది నెలలకుగాను సరుకు రవాణా ద్వారా రూ.5,675 కోట్లు పొందింది. ఇది గత ఏడాది ఇదే సమయం కంటే రూ.1,005 కోట్లు అధికమని సీపీఆర్వో సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపారు.